ప్రశాంతంగా సీఈటీ
సాక్షి, బెంగళూరు : ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో వైద్య, దంతవైద్య, ఇంజనీరింగ్ తదితర వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీఈటీ) మొదటి రోజైన గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్ణాటక ఎగ్జామినేషన్ బోర్డు (కేఈఏ) పోలీసు శాఖతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధి వరకూ 144 సెక్షన్ విధించారు. కేంద్రాలకు దగ్గరగా ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. కాగా, మొదటిరోజు జీవశాస్త్రం, గణింతం విషయాల్లో పరీక్ష జరిగింది. నేడు (శుక్రవారం) భౌతిక, రసాయన శాస్త్రాల్లో పరీక్ష జరగనుంది. ఈ ఏడాది సీఈటీ కోసం బెంగళూరులోని 70 కేంద్రాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 314 పరీక్ష కేంద్రాలను కేఈఏ అధికారులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ప్రవాస కన్నడిగులకు (హొరనాడు, గడినాడు) కన్నడ భాష పరిజ్ఞానంపై నిర్వహించే పరీక్ష ఈనెల 3న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల వరకూ నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు మొత్తం 1,660 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు.