‘దేవర’ మూవీ రివ్యూ
టైటిల్: దేవరనటీనటులు: జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, శృతి మారాఠే, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్ తదితరులునిర్మాణ సంస్థ: ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్నిర్మాతలు: నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని,కొసరాజు హరికృష్ణదర్శకత్వం- స్క్రీన్‌ప్లే: కొరటాల శివసంగీతం: అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలుఎడిటింగ్: అక్కినేని శ్రీకర్ ప్రసాద్విడుదల తేది: సెప్టెంబర్ 27, 2024ఎన్టీఆర్ అభిమానుల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆయన సోలో హీరోగా నటించిన ‘దేవర’ మూవీ ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, ఆచార్య లాంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత డెరెక్టర్ కొరటాల శివ కలిసి చేసిన సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘దేవర’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది? కొరటాల శివకు భారీ బ్రేక్ వచ్చిందా? ఎన్టీఆర్‌కు ఇండస్ట్రీ హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప( శ్రీకాంత్), కుంజర(షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా... దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం( జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటేదాదాపు ఆరేళ్ల గ్యాప్ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో దేవర పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ ఓ మాదిరిగి ఉన్నా... సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుంది. లేకపోతే ఎన్టీఆర్ ఒప్పుకోరు కదా అని అంతా అనుకున్నారు. కానీ కొరటాల మరోసారి రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ట్రెడింగ్లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాని అప్లై చేస్తూ కథనాన్ని నడిపించడం కొంతవరకు కలిసొచ్చే అంశం. యాక్షన్ సీన్లు కూడా బాగానే ప్లాన్ చేశారు. అయితే ఇవి మాత్రమే ప్రేక్షకుడికి సంతృప్తిని ఇవ్వలేవు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో స్థాయికి తగ్గట్టుగా కథను తీర్చిదిద్దడంతో కొరటాల సఫలం కాలేదు.గతంలో కొరటాల తీసిన సినిమాల్లో ఆచార్య మినహా ప్రతి దాంట్లో కొన్ని గూస్బంప్స్ వచ్చే సీన్లతో పాటు ఓ మంచి సందేశం ఇచ్చేవాడు. ఒకటి రెండు పవర్ఫుల్ డైలాగ్స్ ఉండేవి. కానీ దేవరలో అలాంటి సీన్లు, డైలాగ్స్ పెద్దగా లేవు. స్క్రీన్‌ప్లే కూడా కొత్తగా అనిపించదు.ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాతో కథను ప్రారంభించాడు. గ్యాంగ్‌స్టర్‌ని పట్టుకునేందుకు పోలీసు అధికారి(అజయ్) ఎర్రసముద్రం రావడం.. అక్కడ ఓ వ్యక్తి (ప్రకాశ్ రాజ్) దేవరకు భారీ ఎలివేషన్స్ ఇస్తూ పన్నెడేంళ్ల క్రితం ఆ ఊరిలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా ఎర్రసముద్రం, దేవర చుట్టు తిరుగుతుంది. ప్రేక్షకుల్ని మెల్లిగా దేవర ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఎర్ర సముద్రం నేపథ్యం, వారు దొంగలుగా మారడానికి గల కారణాలు, దేవర చూపించే భయం, ప్రతిది ఆకట్టుకుంటుంది. చెప్పే కథ కొత్తగా ఉన్నా తెరపై వచ్చే సీన్లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం బాగా ప్లాన్ చేశాడు. ఫస్టాఫ్ అంతా దేవర చుట్టు తిరిగితే.. సెకండాప్ వర చుట్టూ తిరుగుతుంది. రెండో ఎన్టీఆర్ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కథ సాగదీతగా అనిపిస్తుంది. జాన్వీ కపూర్ ఎపిసోడ్స్ అతికినట్లుగా అనిపిస్తాయి. పాట మినహా ఆమెతో వచ్చే సీన్లన్ని బోరింగ్‌గానే సాగుతాయి. ప్రీ క్లైమాక్స్‌లో సముద్రం లోపల ఎన్టీఆర్‌తో వచ్చే యాక్షన్ సీన్లు అదిరిపోతాయి. పార్ట్ 2కి లీడ్ ఇస్తూ కథను ముగించారు. క్లైమాక్స్ కొంతవరకు ఆసక్తికరంగా సాగినా.. ట్విస్ట్ పాయింట్ బాహుబలి సినిమాను గుర్తు చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్ నటనకు ఏం వంక పెట్టగలం. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. ఇక దేవర, వర(వరద) అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో మాస్ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక డ్యాన్స్ కూడా ఇరగదీశాడు.ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. పల్లెటూరి అమ్మాయి ‘తంగం’ పాత్రలో ఒదిగిపోయింది. తెరపై అచ్చం తెలుగమ్మాయిలాగే కనిపించింది. కాకపోతే ఈమె పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. ఇందులో సైఫ్ అలీఖాన్ భైరవ అనే ఓ డిఫరెంట్ పాత్రను పోషించాడు. నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా నటించాడు. పార్ట్ 2 ఆయన పాత్ర పరిధి ఎక్కువగా ఉంటుంది. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. చుట్టంమల్లే పాటకు థియేటర్స్‌లో ఈలలు పడతాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్