devendar sharma
-
‘సాగు’ బాగుంటేనే ప్రగతి సాధ్యం
దేశంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సన్నకారు రైతులు గరిష్టంగా చేసిన రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తున్నందుకే మన ఆర్థికవేత్తలు, ఆర్థికరంగ సమర్థకులు ద్రవ్యలోటు చుక్కలంటుతుందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. కానీ మన బ్యాంకులు లక్షల కోట్ల మేరకు కార్పొరేట్ రుణాలను అలవోకగా మాఫీ చేసినప్పుడు వీరికి ద్రవ్యలోటు ప్రమాదం గుర్తుకురావడం లేదు. వ్యవసాయరంగ దుస్థితిని పట్టించుకోని మన విధాన నిర్ణేతలు ఒకటి, రెండు నెలలు కార్లు, ఆటోమైబైల్స్ అమ్మకాలు పడిపోయి, పరిశ్రమలు కొన్ని వేల ఉద్యోగాలకు కోతపెట్టగానే కొంపలంటుకుపోయినట్లు గావుకేకలు పెడుతున్నారు. వ్యవసాయరంగం నిత్య సంక్షోభంలో కూరుకుపోయినంతకాలం మన ఆర్థిక వ్యవస్థ కూడా నిత్య అనిశ్చిత పరిస్థితుల్లోనే కొనసాగుతుంది. దేశీయ డిమాండ్ పెరగాలంటే వ్యవసాయరంగంలో భారీ పెట్టుబడులు పెట్టాలి. కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీఎమ్ సిద్ధార్థ తన జీవితాన్ని ముగించుకుంటున్నట్లు ప్రకటించి ఆత్మహత్య చేసుకున్న కొద్ది రోజుల తర్వాత అయిదు మంది రైతులు మహారాష్ట్రలోని అకోలా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పురుగుమందు సేవించి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తమ భూమికి సత్వరం పరిహారం అందించాలన్నది వారి డిమాండు. సరిగ్గా అదేసమయంలో, హరియాణాలో నాలుగు నెలలుగా ధర్నా చేస్తున్న మరొక రైతు మరణించాడు. ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తన భూమికి అధిక పరిహారం ఇవ్వాలని ఆ రైతు నిరసన తెలుపుతూ చనిపోయాడు. ఈ రైతుల మరణం, లేదా ఆత్మహత్యా ప్రయత్నం ప్రపంచం దృష్టికి రాలేదు కానీ కాఫీ కింగ్ విషాదమరణానికి దారితీసిన పరిస్థితుల గురించి పరిశ్రమవర్గాలు పెట్టిన గగ్గోలుకు మీడియా విపరీత ప్రచారం కల్పించింది. మన పారిశ్రామిక అధిపతుల్లో చాలామంది సిద్ధార్థ మృతిని పన్నుల రూపంలోని ఉగ్రవాదంతో ముడిపెట్టారు. తమకు మరిన్ని పెట్టుబడులు, పన్నురాయితీలు ఇవ్వాలని, పన్నుల బారి నుంచి స్వాతంత్య్రం కల్పించాలని పరిశ్రమవర్గాలు డిమాండు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కెఫే కాఫీ డే యజమాని దాదాపు రూ.11,000 కోట్ల భారీ రుణ ఊబిలో చిక్కుకుపోయారన్న విషయాన్ని విస్మరించి, పరిశ్రమ వర్గాల మనోభావాలను ప్రతిధ్వనింపచేయడంలో బిజినెస్ జర్నలిస్టులు మునిగిపోయారు. ఆర్థిక మందగమనంలో తాము నిలదొక్కుకోవడానికి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీతోపాటు మరిన్ని రాయితీలను కల్పించాలని పరిశ్రమ వర్గాలు సహేతుకమైన ఆర్థిక కారణాలను చూపించవచ్చు. కానీ వ్యవసాయరంగంలో మృత్యుదేవత ప్రళయతాండవం గురించి ఎవరికీ పట్టింపు లేదు. రైతుల ఆత్మహత్యలపై మీడియా కనీసంగా ప్రస్తావించటం లేదు. ఒక వ్యాపారవేత్తగా సిద్ధార్థకు కష్టకాలంలో తగిన మద్దతు అవసరం కావచ్చు. అయితే రైతులు కూడా తమరంగంలో పారిశ్రామికులుగానే కార్యకలాపాలు సాగిస్తున్న వాస్తవాన్ని ఎవరూ గుర్తించడం లేదు. అందుకే మన దేశ రైతులు తమ కష్టాలను వ్యక్తిగతంగానే ఎదుర్కొంటూ నష్టపోతున్నారు. తమ నష్టాలకు తగిన పరిహారం లభించే హక్కును సకాలంలో పొందగలిగినట్లయితే, దేశీయరైతులు కూడా తమ వ్యవసాయ రంగ వ్యాపార సామర్థ్యాన్ని నిరూపించుకోగలరు. కానీ అలాంటి అవకాశాన్నే తోసిపుచ్చడం అంటే ఆ అవకాశాన్ని రైతులు కోల్పోవడమనే అర్థం. ప్రతి ఏటా మన పరిశ్రమ వర్గాలు రూ.1.8 లక్షల కోట్ల మేరకు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని పొందుతూనే ఉన్నాయి. 2008–09లో ప్రపంచ ఆర్థికరంగం కుప్పగూలినప్పటినుంచి జాతీయ బ్యాంకులు పరిశ్రమకు 17 లక్షల కోట్ల రూపాయల భారీ రుణాలను అందించాయి. దీనిలో రూ.10 లక్షల కోట్లు నిరర్థక ఆస్తులుగా మిగిలిపోయాయి. మన పారిశ్రామిక రంగం గత 10 సంవత్సరాల్లో ఆర్థిక ప్యాకేజీ కింద రు. 18 లక్షల కోట్లను అందుకుంది. కానీ ఇప్పటికీ పారిశ్రామిక రంగం తీవ్రమైన సంక్షోభంలో కొనసాగుతోంది. పైగా, 2007 నుంచి 2019 వరకు గత 12 ఏళ్లలో బ్యాంకులు దాదాపు రూ. 8.36 లక్షల కోట్ల మొండిబకాయిలను రద్దు చేసినట్లు ఆర్బీఐ నివేదికను మీడియా ప్రస్తావిస్తుంది. పరిశ్రమ, వస్తూత్పత్తి రంగం, ఎగుమతుల రంగం పనితీరు దిగజారిపోవడానికి ఆర్థిక మందగమనమే కారణమా లేక బ్యాంకులు భారీస్థాయిలో దివాలా ఎత్తడమే అసలు కారణమా అని తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. దేశీయబ్యాంకులు 2007–2016 మధ్యకాలంలో మొత్తం రూ. 2.88 లక్షల కోట్ల మేరకు మొండిబకాయిలను రద్దు చేశాయి. అయితే 2016–17లో 1.33 లక్షల కోట్లను, 2017–18లో 1.61 లక్షల కోట్లను మాఫీ చేసిన బ్యాంకులు 2018–19 సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 2.54 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయి. బ్యాంకులు పూర్తిగా ఒట్టిపోవడానికి ప్రధాన కారణం.. ఇంత భారీ మొత్తాన్ని మూడేళ్లకాలంలోనే మాఫీ చేయడమే. కారణాలు ఏవైనా కావచ్చు.. దేశంలో ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన 9 వేలమంది డిఫాల్టర్ల పేర్లను బహిరంగపర్చాలని ఆర్బీఐ పట్టుపడుతోంది. మొండి బకాయిలు ఇంకా అధికంగా ఉన్నాయనడానికి ఇది నికార్సైన సంకేతం. కేంద్రప్రభుత్వం ఇప్పటికే బ్యాంకుల ప్రక్షాళన ప్రక్రియను ప్రారంభించడంపై పట్టుదలతో ఉంటున్నప్పటికీ, రుణం చెల్లింపు అశక్తత, దివాలా కోడ్ (ఐబీసీ)ని 2016లో ప్రవేశపెట్టింది. మొండిబకాయిల ఉపద్రవాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న బలమైన వైఖరికి ఇది నిదర్శనం. ప్రతిసంవత్సరం పరిశ్రమవర్గాలు భారీ పన్ను రాయితీలను అందుకుంటున్న సమయంలో పన్నుల అధికారులు తమ తలుపు తడితే మాత్రం పరిశ్రమవర్గాలు విలపించడం సమర్థనీయం కాదు. మన వ్యవస్థ రైతుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నదో ఇప్పుడు మనం పరిశ్రమల రంగంతో పోల్చి చూద్దాం. బ్యాంకులకు రుణాలను చెల్లించలేకపోయారన్న కారణంతో పలు సంవత్సరాలుగా దేశంలో వందలాది మంది రైతులను బహిరంగంగా అవమానాల పాలు చేశారు. జైళ్లలో పెట్టారు. పరిశ్రమల రంగానికి లక్షలాది కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తుండగా, ఒక్కటంటే ఒక్క నెల బకాయిని చెల్లించలేకపోయిన రైతులను జైళ్లలోకి నెడుతున్నారు. అలాంటి రైతుల స్థిరాస్తి, చరాస్తిని బ్యాంకు తక్షణం స్వాధీనం చేసుకోవడమే కాదు.. రైతులు తాము చెల్లించాల్సిన అసలు మొత్తాన్ని చెల్లించలేని సందర్భాల్లో, వారికి రుణాన్ని మంజూరు చేసే సమయంలో రైతులనుంచి తీసుకున్న సంతకం చేసిన ఖాళీ చెక్కును బ్యాంకు తానే డిపాజిట్ చేసి, అవి చెల్లనప్పుడు ఈ సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చి వేధిస్తున్నాయి. తర్వాత అలాంటి రైతులను జైలుకు పంపుతున్నారు. తాము తీసుకున్న రుణాన్ని అసలు, వడ్డీతో సహా తీర్చివేయాలని కోర్టులు రైతులను ఆదేశిస్తున్నాయి కూడా. వాస్తవానికి ఈ దేశంలో క్రమం తప్పకుండా నెలవారీ రుణ చెల్లింపులను చేయగలుగుతున్నది రైతులు మాత్రమే కాగా, ఇలాంటి వారిపైనా డిఫాల్టర్లుగా ఎందుకు ముద్ర వేస్తున్నారో నాకు అసలు అర్థంకాదు. దేశంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సన్నకారు రైతులు గరిష్టంగా చేసిన రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తున్నందుకే మన ఆర్థికవేత్తలు, ఆర్థికరంగ సమర్థకులు ఈ రుణమాఫీతో ద్రవ్యలోటు ఆకాశానికి అంటుతుందంటూ గావుకేకలు పెడుతున్నారు. కానీ ఇదే బ్యాంకులు లక్షల కోట్ల మేరకు కార్పొరేట్ రుణాలను అలవోకగా మాఫీ చేసినప్పుడు ఇదే ఆర్థికవేత్తలకు ద్రవ్యలోటు ప్రమాదం అసలు గుర్తుకురావడం లేదు. అనేక సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ఉందని పలు ప్రగతి సూచికలు తెలుపుతూనే ఉన్నాయి. వ్యవసాయరంగ రాబడులు గత 15 ఏళ్లలో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. చివరకు గ్రామీణ రంగ ఉపాధి కూడా ఘోరంగా దెబ్బతిందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. వీటి ప్రకారం 2011–2018 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతంలో 3.2 కోట్లమంది రోజుకూలీలు పని కోల్పోయారు. వీరిలో 3 కోట్లమంది వ్యవసాయరంగ కార్మికులున్నారు. కానీ అతిపెద్ద విషాదమేమిటంటే, ముంచుకొస్తున్న వ్యవసాయరంగ దుస్థితి గురించిన తీవ్ర హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని మన విధాన నిర్ణేతలు ఒకటి, రెండు నెలలు కార్లు, ఆటోమొబైల్స్ అమ్మకాలు పడిపోయి పారిశ్రామికరంగంలో కొన్ని వేల ఉద్యోగాలకు కోతపెట్టగానే గావుకేకలు పెడుతున్నారు. వ్యవసాయరంగం నిరంతర సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నంతవరకు మన ఆర్థిక వ్యవస్థ కూడా అనిశ్చిత పరిస్థితుల్లోనే కొనసాగుతుంది. వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ వినియోగం పెరుగుదలపైనే ఆధారపడుతుంది. వినియోగం అనేది ఎంత డిమాండును సృష్టిస్తాం అన్న అంశంపై ఆధారపడుతుంది. దేశీయ డిమాండును పెంచడంలో గ్రామీణ రంగమే అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నది అందరూ అర్థం చేసుకోవాలి. దీనికి రాబోయే సంవత్సరాల్లో వ్యవసాయరంగంలో మరిన్ని పెట్టుబడులు అవసరం అవుతాయి. అంటే పరిశ్రమలను మరింతగా ప్రైవేటీకరించడం, మరిన్ని ఉద్దీపన ప్యాకేజీలను ఇవ్వడం నుంచి ప్రభుత్వం తన దృష్టిని వ్యవసాయరంగం వైపు మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.దేశీయ శ్రామికశక్తిలో దాదాపు 50 శాతాన్ని కలిగి ఉన్న వ్యవసాయరంగానికి ప్రభుత్వ మదుపులకు సంబంధించి జీడీపీలో అర్ధ శాతం కంటే తక్కువ కేటాయించడమే మన రైతుల దుస్థితికి అసలు కారణం. కోట్లాది మందికి బతుకునివ్వగల వ్యవసాయ రంగానికి మరింతగా పెట్టుబడులను కేటాయించడం, ఈ క్రమంలో మరింత దేశీయ డిమాండును సృష్టించడమే దీనికి పరిష్కారం. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
వ్యవసాయంపై మరో గుదిబండ
ఆహార ఉత్పత్తులు, ఉద్యానవన పంటలు, పళ్లు, కాయగూరలు, ప్రాసెస్డ్ ఫుడ్ దిగుమతులు వరదలా వచ్చిపడటంతో ఇప్పటికే కునారిల్లుతున్న భారత వ్యవసాయ రంగం మరింత అధ్వాన్నంగా మారింది. కాబట్టి, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒడంబడిక (ఆర్సీఈపీ)లో మనం ఎందుకు చేరాలి? చివరికి అమెరికాలో ఉద్యోగావకాశాలను కాపాడటానికి డొనాల్డ్ ట్రంప్ 12 దేశాల ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్షిప్ ఒప్పందం నుంచి బయటకు రావాలనుకుంటున్నప్పుడు, దశాబ్దాలుగా నిర్మించుకున్న ఆహార భద్రతను రక్షించుకోవాల్సిన అవసరం భారత్‌కు ఉంది. ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్నామంటే నిరుద్యోగాన్ని కొనితెచ్చుకోవడమే. ప్రపంచీకరణకు వ్యతిరేక వాతావరణం పుంజుకుంటూ, స్వీయ సంరక్షణతత్వం పెరుగుతున్న వాతావరణంలో ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో వాణిజ్యరంగంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి క్షీణిం చింది. ఇలాంటి నేపథ్యంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 16 దేశాల మధ్య కుదిరిన భారీ వాణిజ్య ఒడంబడిక ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒడంబడిక (ఆర్సీఈపీ)లో భారత్ చేరుతుండటమనేది రిస్క్‌తో కూడుకున్న సాహసమేనని చెప్పాలి. పైగా దేశీయ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం గుండా పయనిస్తున్నప్పుడు, వస్తూత్పత్తి రంగం నిత్యం దిగజారిపోతున్న సమయంలో భారత్ పయనం వాంఛనీయం కాదనే చెప్పాలి. నవంబర్ మధ్యలో సింగపూర్‌లో జరిగిన తాజా సంప్రదింపుల్లో ఈ సంవత్సరం చివరినాటికి కూటమి దేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకోవాలన్న ప్రతిపాదనను వదిలివేశారు. 2019 చివరి నాటికి అంతిమ అవగాహనకు వద్దామంటూ కొత్త లక్ష్యం విధించుకున్నారు. ఎందుకంటే భారత్, థాయ్‌లాండ్, ఇండోనేషియాలు వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి కాబట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి ముందుగా రిస్క్ తీసుకోవడానికి ఈ మూడు దేశాల్లో ఏ ఒక్కటీ సంసిద్ధత వ్యక్తం చేయలేదు. ఈ విషయమై భారతీయ దౌత్యప్రతినిధి అభిప్రాయాన్ని న్యూస్ ఏజెన్సీ నిక్కీ వెల్లడించింది. ’’పన్నులు తగ్గించడంపై ఆర్సీఈపీ ప్రాథమిక ఒప్పందాన్ని ప్రకటించిన మరుక్షణం న్యూఢిల్లీలో కేంద్రప్రభుత్వం కుప్పకూలడం ఖాయం’’వాణిజ్యాన్ని మరింత సరళీకరించాలని భావిస్తూ, 10 ఆసియా దేశాలు వాటి భాగస్వామ్య దేశాలైన జపాన్, దక్షిణ కొరియా, చైనా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఇండియా మధ్య కుదిరిన భారీ వాణిజ్య ఒప్పందమే ఆర్సీఈపీ (ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒడంబడిక). ఈ ఒప్పందం అమల్లోకి రాగానే ఈ వాణిజ్యమండలి ప్రపంచ జనాభాలో 45 శాతానికి, ప్రపంచ జీజడీపీలో 25 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే ప్రపంచ వాణిజ్యంలో దీని వాటా 40 శాతం అన్నమాట. ఈ ఒడంబడిక గత ఆరేళ్లుగా చర్చలు సాగిస్తూ సరకులు, సేవలు, మదుపు అనే మూడు కీలకాంశాలపై దృష్టి సారించింది. ఒప్పందంపై సంతకాలు చేశాక ఆర్సీఈపీ ప్రపంచంలోనే అతి పెద్ద వాణిజ్య మండలిగా అవతరించనుంది. దిగుమతి సుంకాల భారీ తగ్గింపు విధ్వంసకరమే! ఆర్సీఈపీ దేశాలతో భారత వాణిజ్యలోటు 100 బిలియన్ డాలర్లను అధిగమించింది. అంటే భారతీయ మొత్తం వాణిజ్య లోటులో ఇది 64 శాతం అన్నమాట. అందుకే ఈ భారీ వాణిజ్య లోటు అంతరాన్ని రాబోయే సంవత్సరాల్లో పూడ్చుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే చైనా, కొరియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియాలతో భారత్‌కు భారీస్థాయిలో వాణిజ్య లోటు ఉండటమే కాకుండా, దిగుమతి సుంకాలను జీరోకి తొలగించి అతిపెద్ద దేశీయ మార్కెట్ తలుపులు తెరిచేస్తే పరస్పర వాణిజ్యం జరగాల్సిన సరకుల స్థానంలో చౌక ధరలతో కూడిన దిగుమతులు దేశంలోకి వెల్లువెత్తుతాయి. ఇప్పటికే ఈ విషయంలో పలు శాఖల కేంద్రమంత్రులు ప్రమాద హెచ్చరికలు చేసేశారు. ఇక ఉక్కు, లోహాలు, ఫార్మాసూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పాలపరిశ్రమ వంటి దేశీయ పరిశ్రమలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒడంబడిక కార్యచట్రం పరస్పర వాణిజ్యం జరగాల్సిన 92 శాతం సరకులపై జీరో శాతం సుంకాలను విధిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో మరొక 5 శాతం దీనికి తోడవుతుంది. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న ఆసియన్ దేశాలు, జపాన్ ఈ విషయంలో బలంగా ఒత్తిడి తీసుకొస్తున్నాయి. శాశ్వత భాగస్వామ్యం లేని మూడు ప్రముఖ దేశాలు కూడా 80 శాతం ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పూర్తిగా తొలగించాలని పట్టుబడుతున్నాయి. ఇప్పటికే అందుతున్న నివేదికల ప్రకారం భారత్ 72 నుంచి 74 శాతం సరకులపై చైనా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాలకు దిగుమతి సుంకాలను తొలగించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సుంకాలను తొలగించడానికి 20 సంవత్సరాల సమయం కావాలని భారత్ కోరుకుంటోంది. కానీ చైనా మాత్రం సుంకాలను పూర్తిగా తొలగించడానికి తనకు మరింత సమయం కావాలని కోరుతోంది. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ గోప్యత ఎవరి ప్రయోజనాల కోసం? గత కొన్ని దశాబ్దాల్లో, ప్రత్యేకించి ప్రపంచ వాణిజ్య సంస్థ ఉనికిలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ సబ్సిడీలను బాగా తగ్గించాలని, మార్కెట్‌కు మరింతగా అవకాశం కల్పించాలని సంపన్న దేశాలు ప్రయత్నిస్తూ వచ్చాయి. ఈ విషయమై ప్రపంచ వాణిజ్య సంస్థ చేసిన ప్రారంభ ప్రయత్నాలను తదనంతరం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, పలు ద్వైపాక్షిక ఒప్పందాలు మరింత దూకుడుగా ముందుకు నెట్టాయి. దిగుమతి సుంకాలను తగ్గించిన తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలావరకు ఆహార దిగుమతి దేశాలుగా దిగజారిపోయిన వైనాన్ని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ క్రమంలో లక్షలాది వ్యవసాయ కుటుం బాలు ధ్వంసమైపోయాయి. భారతీయ ఆహార భద్రతపై ప్రతిపాదిత ఆర్సీఈపీ ఒడంబడిక ప్రభావాల గురించి అంతగా అధ్యయనం చేసినట్లు లేదు. పైగా ఈ ట్రీటీలో భాగంగా జరుగుతున్న సంప్రదింపులు అత్యంత రహస్యాన్ని పాటిస్తుండటంతో జరగబోయే పరిణామాలు కలవరం కలిగిస్తున్నాయి. పైగా పరిశ్రమలు, ఎన్జీవోలలో ఏ ఒక్కరికీ ఈ చర్చల్లో భాగస్వామ్యం కల్పించలేదు. ఆర్సీఈపీ సంప్రదింపులు ప్రారంభమైన ఆరేళ్ల తర్వాత ప్రతిపాదిత ఒప్పందం వలన ఏర్పడే లాభనష్టాలపై అధ్యయనం ప్రారంభించడం విచిత్రంగా లేదూ? న్యూఢిల్లీలోని ప్రాంతీయ అధ్యయన కేంద్రం, బెంగళూర్ లోని ఐఐఎంలను ఈ అధ్యయనం చేయాల్సిందిగా ప్రభుత్వం చాలా ఆలస్యంగా కోరింది. ఇదిలావుంటే, స్టీల్, ఫార్మా రంగాలకు చెందిన ప్రతినిధులు, పలువురు నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్సీఈపీ ఒప్పందం వలన పాల ఉత్పత్తులపై ఆధారపడిన 15కోట్లమంది తీవ్రంగా నష్టపోతారని అముల్ డైరీ కోపరేటివ్ సీనియర్ జనరల్ మేనేజర్ జయన్ మెహతా చెబుతున్నారు. దీనివల్ల ఇబ్బందులేమిటో ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ ఏడాది 176 మిలియన్ టన్నుల ఉత్పత్తిని దాటితే భారత దేశం ప్రపంచంలోనే పెద్ద పాల ఉత్పత్తిదారుగా నిలుస్తుంది. ప్రస్తుతం, 40 నుంచి 60 శాతం సుంకంతో పాలు, పాల ఉత్పత్తుల దిగుమతిని అనుమతిస్తున్నారు. దీంతో స్థానిక డైరీలో తమ స్థాయిలో పోటీపడటానికి ఇది దోహదపడుతోంది. అమెరికా, యూరప్ డైరీ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి చౌకపాలకు భారత్ గేట్లు బార్లా తెరిచింది. ఆస్ట్రేలియా లోని 6,300మంది పాలఉత్పత్తిదార్లు, న్యూజిలాండ్ లోని 12వేలమంది పాల ఉత్పత్తిదారులు తీవ్రంగా స్పందించి చిన్నదైన తమ పాల ఉత్పత్తి వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే, భారత్ మాత్రం తమ పాల ఉత్పత్తిని తగ్గించుకోడానికి సిద్ధపడిందని మనం మరిచిపోకూడదు. ఆహార ఉత్పత్తులలో భారత్ కోలుకోలేని దెబ్బ అదే సమయంలో దిగుమతి సుంకాలు తగ్గించడంతో దేశంలోకి వంట నూనెలు విపరీతంగా వచ్చిపడ్డాయి. భారత్‌ను ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దిగుమతిదారుగా నిలబెట్టాయి. గత మూడేళ్లుగా పప్పుధాన్యాలపై దిగుమతి సుంకం కూడా లేకపోవడంతో పాల ఉత్పత్తిదారుల ధరలు స్వల్పంగా పడిపోయాయి. ఎన్నో ఏళ్లుగా భారత్ దిగుమతి సుంకం తగ్గించాలని కోరుతున్న ఆస్ట్రేలియా నుంచి గోధుమలు దిగుమతి చేసుకోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. పబ్లిక్ వాటాదారులకు కనీస మద్దతుధర చెల్లించాలన్న ప్రపంచ వాణిజ్య కేంద్రం ఒత్తిడితో ఆహార ఉత్పత్తుల విషయంలో భారత్ కోలుకోలేని దెబ్బతింది. వ్యవసాయదారుల జీవితాలు రోడ్డున పడ్డాయి. ఆహార ఉత్పత్తులు, ఉద్యానవన పంటలు, పళ్లు, కాయగూరలు, ప్రాసెస్డ్ ఫుడ్ దిగుమతులు వరదలా వచ్చిపడటంతో ఇప్పటికే కునారిల్లుతున్న భారత వ్యవసాయ రంగం మరింత అధ్వాన్నంగా మారింది. మరోవైపు సభ్య దేశాలు ఇప్పటికే విస్తృతమైన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకున్నాయి. తమ దేశం నుంచి బాదంపప్పును ఎగుమతి చేయడం ద్వారా గత దశాబ్దంలో ఐదింతలు లాభం చేకూరిందని గతవారం ఢిల్లీ వచ్చిన ఆస్ట్రేలియా వాణిజ్యమంత్రి సిమాన్ బిర్మింగ్హమ్ చెప్పారు. కాబట్టి ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒడంబడిక (ఆర్సీఈపీ)లో మనం ఎందుకు చేరాలి? చివరికి అమెరికాలో ఉద్యోగావకాశాలను కాపాడటానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 12దేశాల ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్షిప్ ఒప్పందం నుంచి బయటకు రావాలనుకుంటున్నప్పుడు, దశాబ్దాలుగా నిర్మించుకున్న ఆహార భద్రతను రక్షించుకోవాల్సిన అవసరం భారత్‌కు కూడా ఉంది. ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్నామంటే నిరుద్యోగాన్ని కొనితెచ్చుకోవడమేనని మనం మరిచిపోకూడదు. బహుముఖమైన వ్యవసాయరంగమే నిరుద్యోగం లేని దేశప్రగతికి దోహదం చేస్తుంది. వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
రైతుల ఆందోళన దేనికోసం?
ఇటీవల రైతులు, పాల వ్యాపారులు, కూరగాయల వ్యాపారుల నిరసన ప్రదర్శ నల సందర్భంలో చెలరేగిన ఘర్షణలను దృష్టిలో పెట్టు కుని పంజాబ్‌లో పది రోజుల పాటు జరగాల్సిన గావ్ బంద్ (గ్రామాల బంద్)ను కుదించాలన్న నిర్ణయం హర్షించదగ్గ పరిణామం. అనేక కొట్లాట లకు దారితీసిన రైతుల ఆందోళనలు మరోసారి గ్రామీణ ప్రాంతాల్లో రక్తపాతానికి కారణమౌతాయనే భయంతో గావ్ బంద్‌ను మధ్యలోనే విరమించడం మంచి నిర్ణయం. కిందటేడాది మధ్యప్రదేశ్‌లోని మాండసోర్‌లో రైతులు ఆందోళనకు దిగినప్పుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు రైతులు మర ణించారు. ఇలాంటి దురదృష్టకర ఘటన పునరా వృతం కాకూడదనే భావనతోనే గావ్ బంద్‌ను విర మించారు. రైతుల నిరసనకు న్యాయమైన కారణాలు లేవన్న కేంద్రమంత్రి రాధామోహన్‌సింగ్ హరి యాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్... నిజంగా రైతుల పరిస్థితి అంతా బాగుంటే, వ్యవసా యంలో లోపాలే లేకుంటే రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయనే అనుమానం నాకు వస్తోంది. వ్యవసాయరంగం వ్యవస్థాపరమైన సంక్షో భంలో కూరుకుపోతోంది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు నిలకడగా కొనసాగడా నికి కర్షకులను కావాలనే ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడకుండా చేస్తున్నారు. ఆర్బీఐ మాజీ గవ ర్నర్, ప్రసిద్ధ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ ఇది వరకు చెప్పిన మాటలే దీనికి తార్కాణం. వ్యవసాయాన్ని ఆర్థికంగా గిట్టుబాటయ్యే వృత్తిగా మార్చాల్సిన అవ సరముందని చెప్పడానికి బదులు ‘‘రైతులను వ్యవ సాయం నుంచి బయటకు తీసుకొచ్చి నగరాలకు తరలించడమే అతి పెద్ద సంస్కరణ. ఎందుకంటే, పట్టణ ప్రాంతాలకు తక్కువ వేతనంతో పనిచేసే కార్మికుల అవసరం ఉంది’’ అని సూత్రీకరించారు. నేడు దేశం ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభం ఓ ‘ఆర్థిక కుట్ర’ ఫలితమని చెప్పవచ్చు. నామమాత్రంగా సైతం పెరగని వ్యవసాయో త్పత్తుల ధరలు వ్యవసాయానికి సంబంధించిన తాజా ప్రభుత్వ గణాంకాలు పరిశీలిస్తే రైతులకు ఏం దక్కుతోందో స్పష్టమౌతుంది. ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం నాలుగో భాగంలో వ్యవసాయోత్పత్తుల ధరలు కేవలం 0.4 శాతం మాత్రమే పెరిగాయని కేంద్ర గణాంక కార్యలయం (సీఎస్ఓ) ప్రకటిం చింది. 2011–12 మధ్య ఐదేళ్ల కాలంలో వాస్తవిక వ్యవసాయ ఆదాయాలు ఏటా అర శాతం కన్నా తక్కువే (ఖచ్చితంగా చెప్పాలంటే 0.44) పెరిగా యని నీతి ఆయోగ్ ఇది వరకటి నివేదికలో వెల్లడిం చింది. వ్యవసాయోత్పత్తుల నికర ధరలు ప్రపంచ వ్యాప్తంగా 1985–2005 మధ్య ఇరవై ఏళ్ల కాలంలో ఎదుగూబొదుగూ లేకుండా నిలిచిపోయాయని ఐక్య రాజ్యసమితి అనుబంధ సంస్థ అంక్టాడ్ కొన్నేళ్ల క్రితం విడుదల చేసిన ఓ నివేదికలో తెలిపింది. 1970 సంవత్సరంలో గోధుమకు క్వింటాలుకు కనీస మద్దతు ధర 76 రూపాయలుంది. 45 ఏళ్ల తర్వాత, 2015లో గోధుమల ధర క్వింటాలుకు రూ. 1435కు పెరిగింది. అంటే గోధుమ మద్దతు ధర 19 రెట్లు పెరిగింది. ఈ నాలుగున్నర దశాబ్దాల కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనం, కరవు భత్యం (డీఏ) కలిపి 120 నుంచి 150 రెట్లు పెరిగింది. కళా శాల–విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల వేతనాలు 150 నుంచి 170 రెట్లు, పాఠశాల ఉపాధ్యాయుల జీతాలు 280 నుంచి 320 రెట్లు పెరిగాయి. అయితే, రైతుల ఉత్పత్తులకు చెల్లించే ధరలు ఈ 45 సంవత్సరాల్లో నిజమైన పెరుగుదల లేకుండా దాదాపు నిలకడగా నిలిచిపోయాయి. అంతేగాక, ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుతో ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 108 రకాల భత్యాలు అందుబాటులోకి వచ్చాయి. కనీస మద్దతు ధర నిర్ణయించే క్రమంలో తమకు కూడా ఇంటి అద్దె అలవెన్స్, వైద్య ఖర్చుల అలవెన్స్, విద్యకు అలవెన్స్, ప్రయాణ భత్యం చేర్చా లని రైతులు ఎప్పుడైనా అడిగారా? అనుమానమే. ఇంతటి అననుకూల పరిస్థితుల్లో దేశానికి ధాన్యాగారంగా పరిగణించే పంజాబ్‌లో ప్రతి ముగ్గురు రైతుల్లో ఒకరు పేదరికంలో జీవిస్తున్నారన్న విషయం ఆశ్చర్యం కలిగించదు. 98 శాతం నికర సాగునీటి సరఫరా సౌకర్యాలతో ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో పప్పుధాన్యాల దిగుబడి సాధి స్తున్నా రైతుల ఆత్మహత్యలకు పంజాబ్ కేంద్రంగా మారిపోయింది. 2000–2017 మధ్య కాలంలో 16,600 మంది పంజాబ్ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మూడు విశ్వవిద్యాలయాల ప్రతిని ధులు ఇంటింటికీ వెళ్లి జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. సాగు సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పడం తేలికే. అయితే, నానా కష్టాలు పడి పండించిన పంటకు న్యాయబద్ధంగా దక్కాల్సిన ఆదాయం రైతుకు అందకుండా చేయడమే ప్రధాన కారణం. రాష్ట్ర ఆదాయంలో 88.36 శాతం సొమ్మును జీతాలు, పింఛన్లు చెల్లించడానికి, రుణా లపై వడ్డీలు కట్టడానికి, విద్యుత్ సబ్సిడీ చెల్లించడా నికి పోతే రైతుల సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి మిగి లేది ఎంతో గమనిస్తే సమస్య తీవ్రత అర్థమౌతుంది. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
మోడీ పంటకు 11 సూత్రాలు
యూపీఏ తన పదేళ్ల పాలనలో కిసాన్లతో పాటు జవాన్లకు కూడా నరకం చూపించిందని ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో విమర్శించారు. వ్యవసాయం విషయంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వ ఎజెండా ఎలా ఉండాలి? రైతాంగాన్ని ఆ పతనావస్థ నుంచి రక్షించడానికి మోడీ ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి? దేశంలో వ్యవసాయ రంగం ఎంతటి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నదో, అప్రతిహతంగా జరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలే సాక్ష్యం చెబుతాయి. గడచిన పదిహేడేళ్లలో దాదాపు మూడు లక్షల మంది కర్షకులు ఆత్మహత్యలను ఆశ్రయించారు. అవకాశం దొరికితే సాగును విడిచి వెళ్లిపోవాలని మరో 42 శాతం మంది రైతులు కోరుకుంటున్నారు. పదహారో లోక్‌సభ ఎన్నికల సంరంభంలోనూ రైతుల ఆత్మహత్యలలో తీవ్రత తగ్గలేదు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో గడచిన కొన్ని వారాలలో సగటున రోజుకు ఐదుగురు సేద్యగాళ్లు ప్రాణాలు తీసుకున్నారు. తెలంగాణలో ఐదుగురు, బుందేల్‌ఖండ్‌లో ఇద్దరు వంతున కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మార్చి-ఏప్రిల్ మాసాలలోనే మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో 101 మంది కర్షకులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు వార్తలు వెలువడినాయి. సేద్యంలో ఎంతో ముందంజ వేసిన పంజాబ్‌లోనూ గడచిన రెండు మాసాలలో పద్నాలుగు మంది రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. యూపీఏ తన పదేళ్ల పాలనలో కిసాన్లతో పాటు జవాన్లకు కూడా నరకం చూపించిందని ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో విమర్శించారు. దేశం నలుమూలలా ఆయా ప్రాంతాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి కొన్ని మాటలు చెప్పి రైతాంగంలో ఆశలు కల్పించారు. వ్యవసాయం విషయంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వ ఎజెండా ఎలా ఉండాలి? రైతాంగాన్ని ఆ పతనావస్థ నుంచి రక్షించడానికి మోడీ ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి? ఆహార స్వయం సమృద్ధి విషయంలో భారత్ రాజీపడకూడదన్న అంశాన్ని అంతా దృష్టిలో ఉంచుకుంటూనే, కొన్ని దీర్ఘకాలిక, ఇంకొన్ని స్వల్పకాలిక చర్యలు చేపట్టాలి. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు రూపొందించిన పదకొండు సూత్రాలను ఇక్కడ పేర్కొంటున్నాను. సాగుకు గత వైభవాన్ని తేవడానికి ఉద్దేశించిన ఎజెండా ఇది. రైతులకు నెలవారీ ఆదాయ కల్పన: సాధారణ రైతు కుటుంబం నెలసరి ఆదాయం రూ. 2,115 అని అర్జున్ సేన్‌గుప్తా సంఘం నివేదిక వెల్లడించింది. ఆ కుటుంబం తెచ్చుకునే వ్యవసాయేతర ఆదాయం రూ.900 కూడా ఇందులో కలిపారు. దేశంలో 60 శాతం రైతులు బతకడానికి మహా త్మాగాంధీ గ్రామీణాభివృద్ధి పథకం మీద ఆధారపడ్డారు. 55 శాతం రైతులు పస్తులు ఉండడం ఇంకో వాస్తవం. అయితే ఈ రైతులంతా కూడా సేద్యం, ఫలపుష్ప సాగుతో, పాల ఉత్పత్తితో దేశానికి ఆర్థిక సంపదను అందిస్తున్నవారే. ఆహారోత్పత్తి రూపంలో రైతాంగం సమకూరుస్తున్న ఆర్థిక సంపత్తికి ప్రతిఫలం చెల్లించవలసిన సమయమిది. కొత్త ప్రభుత్వం రైతుల ఆదాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నా సలహా. ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ రైతు చేస్తున్న ఉత్పత్తిని బట్టి నెలసరి ఆదాయం కల్పించాలి. ధరల విధానం కాదు, ఆదాయ విధానం కావాలి: కనీస మద్దతు ధర ఆహార కొరత మీద చూపుతున్న ప్రభావం ఏమిటో ప్రతిసారి ప్రశ్నార్థకంగానే ఉంటోంది. కాబట్టి ఇది ధరల విధానం నుంచి ఆదాయ విధానం వైపు జరగవల సిన సమయం. రైతు ఆదాయాన్ని, ఆ రైతు పండించిన పంట మార్కెట్లో తెచ్చే ధర నుంచి విడదీసి చూడాలి. అందుకే రైతుకు నెలవారీ ఆదాయాన్ని సమకూర్చేందుకు హామీ ఉండాలని నేను భావిస్తున్నాను. పెరిగిన ద్రవ్యోల్బణం అందరితో పాటు రైతు మీద కూడా ప్రభావం చూపుతుందన్న సంగతిని విస్మరించరాదు. కానీ ఒక ప్రభుత్వోద్యోగికి పెరిగిన ద్రవ్యోల్బణానికి తగినట్టు ప్రతి ఆరు మాసాలకు కరువు భత్యం మంజూరవుతుంది. వీరికి కొన్నేళ్లకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది. కానీ రైతుల విషయంలో ఒక్క కనీస గిట్టుబాటు ధరే ఇస్తారు. 1.25 బిలి యన్ ప్రజలకు చౌకగా ఆహారం అందించే భారమంతా రై తుల భుజాల మీదే మోపకుండా, దేశమంతా భరించాలి. మండీల నెట్వర్క్ పటిష్టం కావాలి: వ్యవసాయోత్పత్తులను విక్రయించడానికి అవకాశం కల్పించే మండీల నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలి. వ్యవసాయోత్పత్తులకు ధర కల్పించే అవకాశం మార్కెట్ చేతిలో పెట్టడం వల్ల విపరీత పరిణామాలు సంభవిస్తున్నాయి. ఈ విషయంలో పంజాబ్, బీహార్ ఉదాహరణలు చూద్దాం. పంజాబ్‌లో మండీల వ్యవస్థ బలంగా ఉంది. రోడ్లతో వాటిని అనుసంధానం చేశారు. రైతులు అక్కడకు తీసుకెళ్లి ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర రూ. 1,310 పొందారు. కానీ బీహార్‌లో ఏపీఎంసీ చట్టం వర్తింపజేయడం లేదు. దీనితో అక్కడి రైతుల దిగుబడికి రూ. 900 మించి ధర పలకలేదు. అయితే ఇప్పుడు పంజాబ్‌లో ధరలూ వ్యయాల కమిషన్ మండీల వ్యవస్థను రద్దు చేయమని కోరుతోంది. అంటే పంజాబ్ రైతుకు కూడా త్వరలోనే బీహార్ రైతుకు పట్టిన గతే పడుతుంది. కూరలూ, పళ్ల మీద ఏదీ ఆ శ్రద్ధ?: పాలు వంటి త్వరగా చెడిపోయే పదార్థాన్ని రక్షించుకోవడానికి ప్రత్యేక నెట్‌వర్కింగ్‌ను ఏర్పాటు చేసుకున్న దేశం అదే పద్ధతిలో పళ్లూ, కూరగాయల రక్షణకు వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? పాల సేకరణ పద్ధతిలోనే భారత్‌లో కూరలూ, పళ్ల సేకరణకు గొలుసుకట్టు వ్యవస్థను ఎందుకు నిర్మించుకోలేదు? సహకార సేద్యానికి ప్రోత్సాహం: సహకార వ్యవసాయా న్ని ప్రోత్సహించడం అవసరం. సహకార సంఘాలు మరింత స్వేచ్ఛాయుతంగా, ప్రతిభావంతంగా పని చేయడానికి అవసరమైన చట్టాలను రూపొందించాలి. అమూల్ పాల సహకార వ్యవస్థ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కూరగాయల, పళ్ల సహకార సేద్య వ్యవస్థను కూడా రూపొందించాలి. సేంద్రియ వ్యవసాయం ద్వారా చిన్న చిన్న సహకార సంఘాలు అద్భుత ఫలితాలు సాధించిన సంగతిని గుర్తించాలి. అదే మిగిలిన పంటలకు కూడా ఎందుకు వర్తింపజేయకూడదు? స్వయం సమృద్ధ గ్రామసీమలు : ఆహారభద్రతలో, వ్యవసాయంలో ప్రతి గ్రామం స్వయం సమృద్ధిని సాధించాలి. సేద్యం, ఆహార భద్రతల స్వయం సమృద్ధిలో ఛత్తీస్‌గఢ్ చక్కని నమూనాను అందించింది. అక్కడ స్థానికంగా జరిగే ఉత్పత్తులు, స్థానికంగా ఉత్పత్తుల సేకరణ, స్థానికంగా పంపిణీ అనే అంశం మీద దృష్టి సారించారు. దేశమంతా అనుసరించవలసిన విధానం సరిగ్గా ఇదే. ఇందుకు జాతీయ ఆహార భద్రత చట్టాన్ని సవరించాలి. నెల నెలా ఐదు కిలోల వంతుల గోధుమలో, బియ్యమో, రాగులో అందించడానికి బదులు ప్రతి గ్రామం తన ఆహార భద్రతకు తనే బాధ్యత తీసుకునే విధంగా జాగ్రత్త వహించాలి. రసాయనిక ఎరువులు వద్దు: భూసారం నశించడం, రసాయనిక ఎరువులతో వాతావరణం కలుషితం కావడం, జల వనరుల లభ్యత క్షీణించడం వంటి సమస్యలతో హరిత విప్లవం కింద ఉన్న ప్రాంతాలు ఉత్పత్తిలో నిలకడను సాధించలేక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇది ఆహార లభ్యత క్రమం మీద, ప్రజారోగ్యం మీద కూడా ప్రభావం చూపుతోంది. కొత్త ప్రభుత్వం క్రిమి సంహారకాలతో ప్రమేయం లేని సాగును ప్రోత్సహించాలి. ఆంధ్రప్రదేశ్‌లో 35 లక్షల ఎకరాలలో రసాయనిక పురుగు మందులు వాడకుండా సేద్యం చేశారు. మరో 20 లక్షల ఎకరాలలో రసాయనిక ఎరువులు ఉపయోగించలేదు. ఉత్పత్తి పెరిగి, కాలుష్యం తగ్గింది. వైద్య ఖర్చు తగ్గడంతో సేద్యపు పెట్టుబడులు 45 శాతం పెరిగాయి. వ్యవసాయ వృద్ధిలోనే పర్యావరణ పరిరక్షణ : సేద్యం, పాల ఉత్పత్తులను, అటవీ వ్యవహారాలను సమన్వయం చేయాలి. వ్యవసాయ వృద్ధిని కేవలం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుదలతోనే బేరీజు వేయరాదు. పర్యావరణ పరిరక్షణను పరిగణనలోనికి తీసుకోవాలి. ఆ దిగుమతుల మీద సుంకం పెంచాలి: ఆహార దిగుమతి అంటే, నిరుద్యోగాన్ని కూడా దిగుమతి చేసుకోవడమే. దిగుమతి అవుతున్న యాపిల్స్ మీద తక్కువ సుంకా న్ని విధిస్తున్నందుకు ఈ మధ్య హిమాచల్ రైతాంగం నిరసన తెలియజేసింది. యాపిల్స్‌ను దిగుమతి చేసుకోవడం వల్ల హిమాచల్‌లో వాటికి గిరాకీ తగ్గింది. మిగిలిన పంటల విషయం కూడా ఇంతే. దిగుమతి చేసుకునే వ్యవసాయోత్పత్తుల మీద, పాల, ఫలపుష్ప ఉత్పత్తుల మీద ప్రభుత్వం సుంకం పెంచాలి. వీటి మీద సుంకం తగ్గించాలన్న యూరోపియన్ యూనియన్ విధానాలకు తలొగ్గరాదు. కర్బనాలను తగ్గించాలి: వాతావరణంలో మార్పులు సేద్యం మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావాన్ని తగ్గించడానికీ, లేదా దీని నుంచి తప్పించుకునే జాగ్రత్తలు రైతులు తీసుకునేటట్టు చేయడానికీ ప్రభుత్వాలు పరిమితం కారాదు. అసలు వ్యవసాయం ద్వారా వచ్చే కర్బనాల నిరోధానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కర్బనాల విడుదలలో సేద్యం వాటా 25 శాతం. నిల్వ సౌకర్యం అనివార్యం: ఆహార ధాన్యాల నిల్వకు సౌకర్యాలు లేవు. ఆహార రక్షణ నినాదం కింద 1979లో ప్రభుత్వం దేశం మొత్తం మీద 50 చోట్ల సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. నేటి ప్రభుత్వం కూడా ఇదే ప్రాధాన్యాన్ని గౌరవించాలి. ఒక్క గింజ కూడా వృథా కానివ్వరాదు. దేవేందర్ శర్మ (వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు) -
అక్కరకు రాని పంటల బీమా
దొంగతనం లేదా అగ్నిప్రమాద భయం నుంచి రక్షణగా ఒక వ్యక్తి తన ఇంటిని బీమా చేయగలిగినప్పుడు ఒక పంట పొలాన్ని అదే రీతిలో ఎందుకు బీమా చేయలేం? పంటల బీమా విషయంలోనే బీమా సంస్థలు ప్రాంతీయ ప్రాతిపదికను అమలు చేయడాన్ని ఎందుకు అనుమతించాలి? పచ్చని పంట చేను రైతు కళ్ల ముందే నేల మట్టమైపోవటాన్ని మించిన దారుణం మరేదీ ఉండదు. చేతికి అంది ందనుకున్న పంట కొన్ని నిమిషాల్లోనే నేల పాలై పోవడంతోపాటే రైతుల ఆశలు, ఆకాంక్షలు అన్నీ బుగ్గయిపోతాయి. పంటే కాదు రైతు జీవితమే నేల మట్టమైపోతుంది. ఈ నెలల్లో వరుసగా వచ్చిపడ్డ వడగళ్ల వానలకు మధ్యప్రదేశ్‌లో 24 హెక్టార్లు, మహారాష్ట్రలో 18 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బ తినిపోయాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల్లో కూడా విస్తృతంగా పంటనష్టం వాటిల్లింది. ఇదో ప్రకృతి విపత్తు అనేయడం తేలిక. కాబట్టే అధిక వర్షాలు, వడగళ్ల వానలు అసాధారణమైనవని, రైతులు ధైర్యాన్ని ప్రదర్శించాలని అంత తేలికగా కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ అనేశారు. కానీ, పండిన పంటతో కొన్ని నెలలపాటైనా ఇంటిల్లిపాదికీ ఆకలి మంటలు తప్పుతాయనే ఆశతో అహరహం చమటోడ్చిన లక్షలాది మంది చిన్న రైతులు సర్వస్వమూ కోల్పో యారు. ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉన్నవారి గృహ ఆర్థిక వ్యవస్థ కనీసం మూడేళ్లు వెనక్కుపోయింది. ఇప్పటికే అప్పుల్లో కూరుకున్నవారికి జీవితం మేరు పర్వతమంత భారంగా మారుతుంది. తలరాతను తప్ప మరెవరినీ నిందించలేమని వారికి తెలుసు. నిజానికి ఇది వ్యవసాయరంగంలో నెలకొన్న అత్యవసర పరి స్థితి. మధ్య భారతంలో తీవ్ర స్థాయిలో కురిసిన ఈ వడగళ్ల వానల తదుపరి బుందేల్‌ఖండ్‌లో 43 మంది, మహారాష్ట్రలో 47 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్ప డ్డారు. నష్టం ఎంత విస్తృతంగా జరిగిందో కనిపిస్తూనే ఉంది. రైతులను ధైర్యంగా ఉండమంటున్న వ్యవసాయ మంత్రి పవార్ చెరకు పంట నష్టం పట్ల మాత్రం ఎక్కువ పట్టింపును చూపుతున్నట్టుంది. నష్టాన్ని అంచనా వేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు కాకముందే చెరకు పంటకు 15 శాతం నష్టం వాటిల్లిందని ఆయన ప్రకటించారు. చక్కెర మిల్లులకు కలిగే నష్టాన్ని లెక్కలు గట్టేశారు. మిగతా రైతులకు సమష్టిగా పెను నష్టాన్ని ఎదుర్కోవాలని సలహా ఇచ్చారు. ఈ సమస్యపై మంత్రుల బృందం వచ్చే వారంలో సమావేశం కానుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు ఒక్కొక్కటీ తక్షణమే రూ.5,000 కోట్ల సహాయ ప్యాకేజీని కోరాయి. ఇతర రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు ముంచెత్తనున్నాయి. పేరు గొప్ప పంటల బీమా నష్ట పరిహారం రైతులకు ఎలాంటి ఊరటను కలిగిం చదని గత అనుభవాలు చెబుతున్నాయి. రూ. 20కి ఒక రూపాయి, 1,470కి రూ.95, రూ. 5,000కు రూ. 3,000 చొప్పున గతంలో చెల్లించిన పరిహారమే అందుకు ఉదాహరణ. అదీ కూడా నెలల తరబడి రైతులు వేచి చూసిన తర్వాత... చూపడానికే సిగ్గు పడాల్సినంత చిన్న మొత్తానికి చెక్కు వచ్చేది. ప్రభుత్వాలకు రైతాంగం పట్ల ఉన్న చిన్న చూపునకు ఇది అద్దం పడుతుంది. ఏప్రిల్ 10న మొదటి దఫా పోలింగ్ మొదలు కావడానికి కొన్ని రోజు ల ముందటి పరిస్థితి ఇది. ఎన్నికల క్యాంపెయిన్ తారస్థాయికి చేరడంతోనే రాజకీయ దుర్బిణీల్లో రైతులు ఎక్కడా పత్తా లేకుండా పోతారు. వాతావరణ పరిస్థితులపై ఆధారపడిన పంటల బీమా పథకాల్లో ప్రపంచంలోనే అతి పెద్దదైన పథకం మన దేశంలో 2007లో ప్రారంభమైం ది. 2012-13 నాటికి అది 15 రాష్ట్రాలకు, 1.20 కోట్ల రైతులకు విస్తరించింది. అయితే బీమా సంస్థలు వాస్తవ నష్టంపైన గాక సూచిక మీద ఆధారపడి మాత్రమే పరిహారాన్ని చెల్లిస్తాయి. అంతేగాక వాస్తవంగా రైతుకు వాటిల్లిన నష్టానికిగాక నిర్దేశించిన ప్రాంతం, తరచుగా బ్లాకు ప్రాతిపదికపై పరిహారాన్ని చెల్లిస్తాయి. ఇలాంటి పంటల బీమా పథకాల వల్ల ప్రయోజనమేమిటో అంతుపట్టదు. ‘‘బీమా చేసిన ప్రతి పంట పొలానికి రైతు చేతుల మీదుగా అందాల్సిన సంరక్షణ, శ్రద్ధలకు తగినంత మొత్తం పరిహారంగా అందేట్టు చూసే పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏ బీమా సంస్థా ఏర్పాటు చేయదు. ఈ అతి పెద్ద సమస్యను అధిగమించడానికి తగిన యంత్రాంగాన్ని రూపొందించనిదే పంటల బీమా పథకం అనేది వాస్తవానికి అసాధ్యం’’. 1920 లోనే వ్యవసాయ నిపుణుడు జేఎస్ చక్రవర్తి రాసిన మాటలివి. వందేళ్లుగా ఈ విషయం తెలిసి ఉండి కూడా పంటల బీమా నేటికీ అదే సమస్యల్లో చిక్కుకుపోయి, అదే స్థాయి అసమర్థతను ప్రదర్శించడమంటే మన ప్రాధాన్యాల్లో పంటల బీమాకు స్థానం లేకుండా పోయిందనే అర్థం కాదా? వ్యక్తిగత పంటల బీమా కావాలి పంటల బీమా సంస్థలు లేదా కంపెనీలు రైతులకు వాస్తవంగా వాటిల్లిన నష్టం ఎంతో తెలుసుకునేలా ప్రభుత్వం ఎందుకు చేయదో నాకు ఎప్పటికీ అర్థం కాదు. దేశంలోని ప్రతి వ్యక్తి జీవితానికి బీమా చేసినట్టయితే అందులో మారుమూల గ్రామాల్లో నివసించే వాళ్లు కూడా ఉండి ఉండాలి. అదే పద్ధతిని పంటల బీమాకు కూడా ఎందు కు వర్తింపజేయరు? ఒక వ్యక్తి తన ఇంటిని దొంగతనం లేదా అగ్నిప్రమాద భయానికి బీమా చేయగలిగినప్పుడు ఒక పంట పొలాన్ని అదే రీతిలో ఎందుకు బీమా చేయలేం? పంటల బీమా విషయంలోనే బీమా సంస్థలు ప్రాంతీయ ప్రాతిపదికను అమలు చేయడానికి ఎందుకు అనుమతించాలి? ప్రభుత్వాలకు ఆ విషయంలో శ్రద్ధ లేదు. మహారాష్ట్రలో వడగళ్ల వానకు దెబ్బతిన్న 18 లక్షల హెక్టార్లకు నిజంగానే బీమా ఉంటే రైతులు ఇంతగా ఆందోళన చెందాల్సింది గానీ, బాధపడాల్సిందిగానీ ఉండేది కాదు. ఏ ఒక్క రైతు ఆత్మహత్యకు పాల్పడేవాడు కాడు. అలాంటి బీమాను ఆచరణలోకి తేవడానికి నేను కొన్ని సూచనలను చేస్తున్నాను. ప్రీమియం భారం ప్రభుత్వానిదే ఒకటి, బీమా కంపెనీలు అందరు రైతులకు, వారి పంటలకు బీమాను వర్తింపజేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయాలి. ప్రత్యేకించి విదేశీ బీమా సంస్థలకు దీన్ని తప్పనిసరి చేయాలి. వ్యక్తిగతమైన పంటల బీమాను అందిస్తామని ఆ సంస్థల నుంచి ముందుగానే హామీ పత్రాలను తీసుకోవాలి. ఇవ్వని వాటిని అనుమతించరాదు. అదే సమయంలో ఇప్పుడున్న ప్రతి పంటల బీమా పథకాన్ని వ్యక్తిగత నష్టం ప్రాతిపదికపై పరిహారాన్ని అందించే లక్ష్యాన్ని సాధించగలిగేలా పునర్నిర్మించాలి. రెండవది, బీమా ప్రీమియంలో మూడింట రెండు వంతుల మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. అమెరికాలో సైతం ఇటీవల 2014 వ్యవసాయ బిల్లు నిబంధనలు ప్రీమియంలో అత్యధిక భాగాన్ని ప్రభుత్వమే మరో పదేళ్ల పాటు చెల్లించాలని నిర్దేశించింది. మన దేశంలో కూడా ఏటికేడాది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియంకు అయ్యే వ్యయానికి ఎక్కువగానే పంట నష్టాలకు పరిహారంగా చెల్లిస్తున్నాయి. అదే సమయంలో పంటల బీమా పథకాలను నిజంగానే ప్రభావశీలమైనవిగా చేయడం కోసం ఎప్పటికప్పుడు రైతుల సలహాలను కూడా తీసుకోవాలి. రాష్ట్ర రైతు సంఘాలు రైతులకు పౌర సమాజం, నిపుణులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి తగు నమూనాలను రూపొందించి ఇచ్చే కర్తవ్యాన్ని నిర్దేశించాలి. వ్యక్తిగత ప్రాతిపదికపై పంటల బీమా పూర్తిగా ఆచరణ సాధ్యం కానిదనే నమ్మకం ఎలా కలిగిందో గాని మనకు కలిగింది. ఈ భావనను సరిదిద్దకపోతే రైతులకు ఎలాంటి ఆశాకిరణం కనిపించదు. ప్రకృతి వైపరీత్యాల్లో రైతులను ధైర్యంగా ఉండమని చెప్పడం తేలికే. మీ సొంత ఇల్లు లేదా కంపెనీ అగ్ని ప్రమాదానికో లేక మరే అనుకోని దుర్ఘటనకో ధ్వంసమైపోతే మీరు ఆ నష్టాన్ని తట్టుకొని ధైర్యంగా ఉండగలుగుతారా? బీమా రక్షణ ఉంటే తప్ప ఉన్న ఇంటిని, జీవనోపాధిని పునర్నిర్మించుకోవడం చాలా కష్టం. వ్యవసా యం అందుకు మినహాయింపు కాదు. విశ్లేషణ: దేవేందర్ శర్మ (వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు)