అక్కరకు రాని పంటల బీమా
దొంగతనం లేదా అగ్నిప్రమాద భయం నుంచి రక్షణగా ఒక వ్యక్తి తన ఇంటిని బీమా చేయగలిగినప్పుడు ఒక పంట పొలాన్ని అదే రీతిలో ఎందుకు బీమా చేయలేం? పంటల బీమా విషయంలోనే బీమా సంస్థలు ప్రాంతీయ ప్రాతిపదికను అమలు చేయడాన్ని ఎందుకు అనుమతించాలి?
పచ్చని పంట చేను రైతు కళ్ల ముందే నేల మట్టమైపోవటాన్ని మించిన దారుణం మరేదీ ఉండదు. చేతికి అంది ందనుకున్న పంట కొన్ని నిమిషాల్లోనే నేల పాలై పోవడంతోపాటే రైతుల ఆశలు, ఆకాంక్షలు అన్నీ బుగ్గయిపోతాయి. పంటే కాదు రైతు జీవితమే నేల మట్టమైపోతుంది. ఈ నెలల్లో వరుసగా వచ్చిపడ్డ వడగళ్ల వానలకు మధ్యప్రదేశ్‌లో 24 హెక్టార్లు, మహారాష్ట్రలో 18 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బ తినిపోయాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల్లో కూడా విస్తృతంగా పంటనష్టం వాటిల్లింది. ఇదో ప్రకృతి విపత్తు అనేయడం తేలిక. కాబట్టే అధిక వర్షాలు, వడగళ్ల వానలు అసాధారణమైనవని, రైతులు ధైర్యాన్ని ప్రదర్శించాలని అంత తేలికగా కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ అనేశారు. కానీ, పండిన పంటతో కొన్ని నెలలపాటైనా ఇంటిల్లిపాదికీ ఆకలి మంటలు తప్పుతాయనే ఆశతో అహరహం చమటోడ్చిన లక్షలాది మంది చిన్న రైతులు సర్వస్వమూ కోల్పో యారు. ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉన్నవారి గృహ ఆర్థిక వ్యవస్థ కనీసం మూడేళ్లు వెనక్కుపోయింది. ఇప్పటికే అప్పుల్లో కూరుకున్నవారికి జీవితం మేరు పర్వతమంత భారంగా మారుతుంది. తలరాతను తప్ప మరెవరినీ నిందించలేమని వారికి తెలుసు. నిజానికి ఇది వ్యవసాయరంగంలో నెలకొన్న అత్యవసర పరి స్థితి. మధ్య భారతంలో తీవ్ర స్థాయిలో కురిసిన ఈ వడగళ్ల వానల తదుపరి బుందేల్‌ఖండ్‌లో 43 మంది, మహారాష్ట్రలో 47 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్ప డ్డారు. నష్టం ఎంత విస్తృతంగా జరిగిందో కనిపిస్తూనే ఉంది. రైతులను ధైర్యంగా ఉండమంటున్న వ్యవసాయ మంత్రి పవార్ చెరకు పంట నష్టం పట్ల మాత్రం ఎక్కువ పట్టింపును చూపుతున్నట్టుంది. నష్టాన్ని అంచనా వేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు కాకముందే చెరకు పంటకు 15 శాతం నష్టం వాటిల్లిందని ఆయన ప్రకటించారు. చక్కెర మిల్లులకు కలిగే నష్టాన్ని లెక్కలు గట్టేశారు. మిగతా రైతులకు సమష్టిగా పెను నష్టాన్ని ఎదుర్కోవాలని సలహా ఇచ్చారు. ఈ సమస్యపై మంత్రుల బృందం వచ్చే వారంలో సమావేశం కానుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు ఒక్కొక్కటీ తక్షణమే రూ.5,000 కోట్ల సహాయ ప్యాకేజీని కోరాయి. ఇతర రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు ముంచెత్తనున్నాయి.
పేరు గొప్ప పంటల బీమా
నష్ట పరిహారం రైతులకు ఎలాంటి ఊరటను కలిగిం చదని గత అనుభవాలు చెబుతున్నాయి. రూ. 20కి ఒక రూపాయి, 1,470కి రూ.95, రూ. 5,000కు రూ. 3,000 చొప్పున గతంలో చెల్లించిన పరిహారమే అందుకు ఉదాహరణ. అదీ కూడా నెలల తరబడి రైతులు వేచి చూసిన తర్వాత... చూపడానికే సిగ్గు పడాల్సినంత చిన్న మొత్తానికి చెక్కు వచ్చేది. ప్రభుత్వాలకు రైతాంగం పట్ల ఉన్న చిన్న చూపునకు ఇది అద్దం పడుతుంది. ఏప్రిల్ 10న మొదటి దఫా పోలింగ్ మొదలు కావడానికి కొన్ని రోజు ల ముందటి పరిస్థితి ఇది. ఎన్నికల క్యాంపెయిన్ తారస్థాయికి చేరడంతోనే రాజకీయ దుర్బిణీల్లో రైతులు ఎక్కడా పత్తా లేకుండా పోతారు. వాతావరణ పరిస్థితులపై ఆధారపడిన పంటల బీమా పథకాల్లో ప్రపంచంలోనే అతి పెద్దదైన పథకం మన దేశంలో 2007లో ప్రారంభమైం ది. 2012-13 నాటికి అది 15 రాష్ట్రాలకు, 1.20 కోట్ల రైతులకు విస్తరించింది. అయితే బీమా సంస్థలు వాస్తవ నష్టంపైన గాక సూచిక మీద ఆధారపడి మాత్రమే పరిహారాన్ని చెల్లిస్తాయి. అంతేగాక వాస్తవంగా రైతుకు వాటిల్లిన నష్టానికిగాక నిర్దేశించిన ప్రాంతం, తరచుగా బ్లాకు ప్రాతిపదికపై పరిహారాన్ని చెల్లిస్తాయి. ఇలాంటి పంటల బీమా పథకాల వల్ల ప్రయోజనమేమిటో అంతుపట్టదు. ‘‘బీమా చేసిన ప్రతి పంట పొలానికి రైతు చేతుల మీదుగా అందాల్సిన సంరక్షణ, శ్రద్ధలకు తగినంత మొత్తం పరిహారంగా అందేట్టు చూసే పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏ బీమా సంస్థా ఏర్పాటు చేయదు. ఈ అతి పెద్ద సమస్యను అధిగమించడానికి తగిన యంత్రాంగాన్ని రూపొందించనిదే పంటల బీమా పథకం అనేది వాస్తవానికి అసాధ్యం’’. 1920 లోనే వ్యవసాయ నిపుణుడు జేఎస్ చక్రవర్తి రాసిన మాటలివి. వందేళ్లుగా ఈ విషయం తెలిసి ఉండి కూడా పంటల బీమా నేటికీ అదే సమస్యల్లో చిక్కుకుపోయి, అదే స్థాయి అసమర్థతను ప్రదర్శించడమంటే మన ప్రాధాన్యాల్లో పంటల బీమాకు స్థానం లేకుండా పోయిందనే అర్థం కాదా?
వ్యక్తిగత పంటల బీమా కావాలి
పంటల బీమా సంస్థలు లేదా కంపెనీలు రైతులకు వాస్తవంగా వాటిల్లిన నష్టం ఎంతో తెలుసుకునేలా ప్రభుత్వం ఎందుకు చేయదో నాకు ఎప్పటికీ అర్థం కాదు. దేశంలోని ప్రతి వ్యక్తి జీవితానికి బీమా చేసినట్టయితే అందులో మారుమూల గ్రామాల్లో నివసించే వాళ్లు కూడా ఉండి ఉండాలి. అదే పద్ధతిని పంటల బీమాకు కూడా ఎందు కు వర్తింపజేయరు? ఒక వ్యక్తి తన ఇంటిని దొంగతనం లేదా అగ్నిప్రమాద భయానికి బీమా చేయగలిగినప్పుడు ఒక పంట పొలాన్ని అదే రీతిలో ఎందుకు బీమా చేయలేం? పంటల బీమా విషయంలోనే బీమా సంస్థలు ప్రాంతీయ ప్రాతిపదికను అమలు చేయడానికి ఎందుకు అనుమతించాలి? ప్రభుత్వాలకు ఆ విషయంలో శ్రద్ధ లేదు. మహారాష్ట్రలో వడగళ్ల వానకు దెబ్బతిన్న 18 లక్షల హెక్టార్లకు నిజంగానే బీమా ఉంటే రైతులు ఇంతగా ఆందోళన చెందాల్సింది గానీ, బాధపడాల్సిందిగానీ ఉండేది కాదు. ఏ ఒక్క రైతు ఆత్మహత్యకు పాల్పడేవాడు కాడు. అలాంటి బీమాను ఆచరణలోకి తేవడానికి నేను కొన్ని సూచనలను చేస్తున్నాను.
ప్రీమియం భారం ప్రభుత్వానిదే
ఒకటి, బీమా కంపెనీలు అందరు రైతులకు, వారి పంటలకు బీమాను వర్తింపజేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయాలి. ప్రత్యేకించి విదేశీ బీమా సంస్థలకు దీన్ని తప్పనిసరి చేయాలి. వ్యక్తిగతమైన పంటల బీమాను అందిస్తామని ఆ సంస్థల నుంచి ముందుగానే హామీ పత్రాలను తీసుకోవాలి. ఇవ్వని వాటిని అనుమతించరాదు. అదే సమయంలో ఇప్పుడున్న ప్రతి పంటల బీమా పథకాన్ని వ్యక్తిగత నష్టం ప్రాతిపదికపై పరిహారాన్ని అందించే లక్ష్యాన్ని సాధించగలిగేలా పునర్నిర్మించాలి. రెండవది, బీమా ప్రీమియంలో మూడింట రెండు వంతుల మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. అమెరికాలో సైతం ఇటీవల 2014 వ్యవసాయ బిల్లు నిబంధనలు ప్రీమియంలో అత్యధిక భాగాన్ని ప్రభుత్వమే మరో పదేళ్ల పాటు చెల్లించాలని నిర్దేశించింది. మన దేశంలో కూడా ఏటికేడాది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియంకు అయ్యే వ్యయానికి ఎక్కువగానే పంట నష్టాలకు పరిహారంగా చెల్లిస్తున్నాయి. అదే సమయంలో పంటల బీమా పథకాలను నిజంగానే ప్రభావశీలమైనవిగా చేయడం కోసం ఎప్పటికప్పుడు రైతుల సలహాలను కూడా తీసుకోవాలి. రాష్ట్ర రైతు సంఘాలు రైతులకు పౌర సమాజం, నిపుణులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి తగు నమూనాలను రూపొందించి ఇచ్చే కర్తవ్యాన్ని నిర్దేశించాలి. వ్యక్తిగత ప్రాతిపదికపై పంటల బీమా పూర్తిగా ఆచరణ సాధ్యం కానిదనే నమ్మకం ఎలా కలిగిందో గాని మనకు కలిగింది. ఈ భావనను సరిదిద్దకపోతే రైతులకు ఎలాంటి ఆశాకిరణం కనిపించదు. ప్రకృతి వైపరీత్యాల్లో రైతులను ధైర్యంగా ఉండమని చెప్పడం తేలికే. మీ సొంత ఇల్లు లేదా కంపెనీ అగ్ని ప్రమాదానికో లేక మరే అనుకోని దుర్ఘటనకో ధ్వంసమైపోతే మీరు ఆ నష్టాన్ని తట్టుకొని ధైర్యంగా ఉండగలుగుతారా? బీమా రక్షణ ఉంటే తప్ప ఉన్న ఇంటిని, జీవనోపాధిని పునర్నిర్మించుకోవడం చాలా కష్టం. వ్యవసా యం అందుకు మినహాయింపు కాదు.
విశ్లేషణ: దేవేందర్ శర్మ
(వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు)