మోడీ పంటకు 11 సూత్రాలు
యూపీఏ తన పదేళ్ల పాలనలో కిసాన్లతో పాటు జవాన్లకు కూడా నరకం చూపించిందని ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో విమర్శించారు. వ్యవసాయం విషయంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వ ఎజెండా ఎలా ఉండాలి? రైతాంగాన్ని ఆ పతనావస్థ నుంచి రక్షించడానికి మోడీ ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి?
దేశంలో వ్యవసాయ రంగం ఎంతటి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నదో, అప్రతిహతంగా జరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలే సాక్ష్యం చెబుతాయి. గడచిన పదిహేడేళ్లలో దాదాపు మూడు లక్షల మంది కర్షకులు ఆత్మహత్యలను ఆశ్రయించారు. అవకాశం దొరికితే సాగును విడిచి వెళ్లిపోవాలని మరో 42 శాతం మంది రైతులు కోరుకుంటున్నారు. పదహారో లోక్‌సభ ఎన్నికల సంరంభంలోనూ రైతుల ఆత్మహత్యలలో తీవ్రత తగ్గలేదు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో గడచిన కొన్ని వారాలలో సగటున రోజుకు ఐదుగురు సేద్యగాళ్లు ప్రాణాలు తీసుకున్నారు. తెలంగాణలో ఐదుగురు, బుందేల్‌ఖండ్‌లో ఇద్దరు వంతున కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మార్చి-ఏప్రిల్ మాసాలలోనే మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో 101 మంది కర్షకులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు వార్తలు వెలువడినాయి. సేద్యంలో ఎంతో ముందంజ వేసిన పంజాబ్‌లోనూ గడచిన రెండు మాసాలలో పద్నాలుగు మంది రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. యూపీఏ తన పదేళ్ల పాలనలో కిసాన్లతో పాటు జవాన్లకు కూడా నరకం చూపించిందని ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో విమర్శించారు. దేశం నలుమూలలా ఆయా ప్రాంతాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి కొన్ని మాటలు చెప్పి రైతాంగంలో ఆశలు కల్పించారు.
వ్యవసాయం విషయంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వ ఎజెండా ఎలా ఉండాలి? రైతాంగాన్ని ఆ పతనావస్థ నుంచి రక్షించడానికి మోడీ ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి? ఆహార స్వయం సమృద్ధి విషయంలో భారత్ రాజీపడకూడదన్న అంశాన్ని అంతా దృష్టిలో ఉంచుకుంటూనే, కొన్ని దీర్ఘకాలిక, ఇంకొన్ని స్వల్పకాలిక చర్యలు చేపట్టాలి. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు రూపొందించిన పదకొండు సూత్రాలను ఇక్కడ పేర్కొంటున్నాను. సాగుకు గత వైభవాన్ని తేవడానికి ఉద్దేశించిన ఎజెండా ఇది.
రైతులకు నెలవారీ ఆదాయ కల్పన: సాధారణ రైతు కుటుంబం నెలసరి ఆదాయం రూ. 2,115 అని అర్జున్ సేన్‌గుప్తా సంఘం నివేదిక వెల్లడించింది. ఆ కుటుంబం తెచ్చుకునే వ్యవసాయేతర ఆదాయం రూ.900 కూడా ఇందులో కలిపారు. దేశంలో 60 శాతం రైతులు బతకడానికి మహా త్మాగాంధీ గ్రామీణాభివృద్ధి పథకం మీద ఆధారపడ్డారు. 55 శాతం రైతులు పస్తులు ఉండడం ఇంకో వాస్తవం. అయితే ఈ రైతులంతా కూడా సేద్యం, ఫలపుష్ప సాగుతో, పాల ఉత్పత్తితో దేశానికి ఆర్థిక సంపదను అందిస్తున్నవారే. ఆహారోత్పత్తి రూపంలో రైతాంగం సమకూరుస్తున్న ఆర్థిక సంపత్తికి ప్రతిఫలం చెల్లించవలసిన సమయమిది. కొత్త ప్రభుత్వం రైతుల ఆదాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నా సలహా. ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ రైతు చేస్తున్న ఉత్పత్తిని బట్టి నెలసరి ఆదాయం కల్పించాలి.
ధరల విధానం కాదు, ఆదాయ విధానం కావాలి: కనీస మద్దతు ధర ఆహార కొరత మీద చూపుతున్న ప్రభావం ఏమిటో ప్రతిసారి ప్రశ్నార్థకంగానే ఉంటోంది. కాబట్టి ఇది ధరల విధానం నుంచి ఆదాయ విధానం వైపు జరగవల సిన సమయం. రైతు ఆదాయాన్ని, ఆ రైతు పండించిన పంట మార్కెట్‌లో తెచ్చే ధర నుంచి విడదీసి చూడాలి. అందుకే రైతుకు నెలవారీ ఆదాయాన్ని సమకూర్చేందుకు హామీ ఉండాలని నేను భావిస్తున్నాను. పెరిగిన ద్రవ్యోల్బణం అందరితో పాటు రైతు మీద కూడా ప్రభావం చూపుతుందన్న సంగతిని విస్మరించరాదు. కానీ ఒక ప్రభుత్వోద్యోగికి పెరిగిన ద్రవ్యోల్బణానికి తగినట్టు ప్రతి ఆరు మాసాలకు కరువు భత్యం మంజూరవుతుంది. వీరికి కొన్నేళ్లకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది. కానీ రైతుల విషయంలో ఒక్క కనీస గిట్టుబాటు ధరే ఇస్తారు. 1.25 బిలి యన్ ప్రజలకు చౌకగా ఆహారం అందించే భారమంతా రై తుల భుజాల మీదే మోపకుండా, దేశమంతా భరించాలి.
మండీల నెట్‌వర్క్ పటిష్టం కావాలి: వ్యవసాయోత్పత్తులను విక్రయించడానికి అవకాశం కల్పించే మండీల నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలి. వ్యవసాయోత్పత్తులకు ధర కల్పించే అవకాశం మార్కెట్ చేతిలో పెట్టడం వల్ల విపరీత పరిణామాలు సంభవిస్తున్నాయి. ఈ విషయంలో పంజాబ్, బీహార్ ఉదాహరణలు చూద్దాం. పంజాబ్‌లో మండీల వ్యవస్థ బలంగా ఉంది. రోడ్లతో వాటిని అనుసంధానం చేశారు. రైతులు అక్కడకు తీసుకెళ్లి ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర రూ. 1,310 పొందారు. కానీ బీహార్‌లో ఏపీఎంసీ చట్టం వర్తింపజేయడం లేదు. దీనితో అక్కడి రైతుల దిగుబడికి రూ. 900 మించి ధర పలకలేదు. అయితే ఇప్పుడు పంజాబ్‌లో ధరలూ వ్యయాల కమిషన్ మండీల వ్యవస్థను రద్దు చేయమని కోరుతోంది. అంటే పంజాబ్ రైతుకు కూడా త్వరలోనే బీహార్ రైతుకు పట్టిన గతే పడుతుంది.
కూరలూ, పళ్ల మీద ఏదీ ఆ శ్రద్ధ?: పాలు వంటి త్వరగా చెడిపోయే పదార్థాన్ని రక్షించుకోవడానికి ప్రత్యేక నెట్‌వర్కింగ్‌ను ఏర్పాటు చేసుకున్న దేశం అదే పద్ధతిలో పళ్లూ, కూరగాయల రక్షణకు వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? పాల సేకరణ పద్ధతిలోనే భారత్‌లో కూరలూ, పళ్ల సేకరణకు గొలుసుకట్టు వ్యవస్థను ఎందుకు నిర్మించుకోలేదు?
సహకార సేద్యానికి ప్రోత్సాహం: సహకార వ్యవసాయా న్ని ప్రోత్సహించడం అవసరం. సహకార సంఘాలు మరింత స్వేచ్ఛాయుతంగా, ప్రతిభావంతంగా పని చేయడానికి అవసరమైన చట్టాలను రూపొందించాలి. అమూల్ పాల సహకార వ్యవస్థ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కూరగాయల, పళ్ల సహకార సేద్య వ్యవస్థను కూడా రూపొందించాలి. సేంద్రియ వ్యవసాయం ద్వారా చిన్న చిన్న సహకార సంఘాలు అద్భుత ఫలితాలు సాధించిన సంగతిని గుర్తించాలి. అదే మిగిలిన పంటలకు కూడా ఎందుకు వర్తింపజేయకూడదు?
స్వయం సమృద్ధ గ్రామసీమలు : ఆహారభద్రతలో, వ్యవసాయంలో ప్రతి గ్రామం స్వయం సమృద్ధిని సాధించాలి. సేద్యం, ఆహార భద్రతల స్వయం సమృద్ధిలో ఛత్తీస్‌గఢ్ చక్కని నమూనాను అందించింది. అక్కడ స్థానికంగా జరిగే ఉత్పత్తులు, స్థానికంగా ఉత్పత్తుల సేకరణ, స్థానికంగా పంపిణీ అనే అంశం మీద దృష్టి సారించారు. దేశమంతా అనుసరించవలసిన విధానం సరిగ్గా ఇదే. ఇందుకు జాతీయ ఆహార భద్రత చట్టాన్ని సవరించాలి. నెల నెలా ఐదు కిలోల వంతుల గోధుమలో, బియ్యమో, రాగులో అందించడానికి బదులు ప్రతి గ్రామం తన ఆహార భద్రతకు తనే బాధ్యత తీసుకునే విధంగా జాగ్రత్త వహించాలి.
రసాయనిక ఎరువులు వద్దు: భూసారం నశించడం, రసాయనిక ఎరువులతో వాతావరణం కలుషితం కావడం, జల వనరుల లభ్యత క్షీణించడం వంటి సమస్యలతో హరిత విప్లవం కింద ఉన్న ప్రాంతాలు ఉత్పత్తిలో నిలకడను సాధించలేక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇది ఆహార లభ్యత క్రమం మీద, ప్రజారోగ్యం మీద కూడా ప్రభావం చూపుతోంది. కొత్త ప్రభుత్వం క్రిమి సంహారకాలతో ప్రమేయం లేని సాగును ప్రోత్సహించాలి. ఆంధ్రప్రదేశ్‌లో 35 లక్షల ఎకరాలలో రసాయనిక పురుగు మందులు వాడకుండా సేద్యం చేశారు. మరో 20 లక్షల ఎకరాలలో రసాయనిక ఎరువులు ఉపయోగించలేదు. ఉత్పత్తి పెరిగి, కాలుష్యం తగ్గింది. వైద్య ఖర్చు తగ్గడంతో సేద్యపు పెట్టుబడులు 45 శాతం పెరిగాయి.
వ్యవసాయ వృద్ధిలోనే పర్యావరణ పరిరక్షణ : సేద్యం, పాల ఉత్పత్తులను, అటవీ వ్యవహారాలను సమన్వయం చేయాలి. వ్యవసాయ వృద్ధిని కేవలం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుదలతోనే బేరీజు వేయరాదు. పర్యావరణ పరిరక్షణను పరిగణనలోనికి తీసుకోవాలి.
ఆ దిగుమతుల మీద సుంకం పెంచాలి: ఆహార దిగుమతి అంటే, నిరుద్యోగాన్ని కూడా దిగుమతి చేసుకోవడమే. దిగుమతి అవుతున్న యాపిల్స్ మీద తక్కువ సుంకా న్ని విధిస్తున్నందుకు ఈ మధ్య హిమాచల్ రైతాంగం నిరసన తెలియజేసింది. యాపిల్స్‌ను దిగుమతి చేసుకోవడం వల్ల హిమాచల్‌లో వాటికి గిరాకీ తగ్గింది. మిగిలిన పంటల విషయం కూడా ఇంతే. దిగుమతి చేసుకునే వ్యవసాయోత్పత్తుల మీద, పాల, ఫలపుష్ప ఉత్పత్తుల మీద ప్రభుత్వం సుంకం పెంచాలి. వీటి మీద సుంకం తగ్గించాలన్న యూరోపియన్ యూనియన్ విధానాలకు తలొగ్గరాదు.
కర్బనాలను తగ్గించాలి: వాతావరణంలో మార్పులు సేద్యం మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావాన్ని తగ్గించడానికీ, లేదా దీని నుంచి తప్పించుకునే జాగ్రత్తలు రైతులు తీసుకునేటట్టు చేయడానికీ ప్రభుత్వాలు పరిమితం కారాదు. అసలు వ్యవసాయం ద్వారా వచ్చే కర్బనాల నిరోధానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కర్బనాల విడుదలలో సేద్యం వాటా 25 శాతం.
నిల్వ సౌకర్యం అనివార్యం: ఆహార ధాన్యాల నిల్వకు సౌకర్యాలు లేవు. ఆహార రక్షణ నినాదం కింద 1979లో ప్రభుత్వం దేశం మొత్తం మీద 50 చోట్ల సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. నేటి ప్రభుత్వం కూడా ఇదే ప్రాధాన్యాన్ని గౌరవించాలి. ఒక్క గింజ కూడా వృథా కానివ్వరాదు.
దేవేందర్ శర్మ (వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు)