రాగానికి వన్స్‌మోర్..
నాటకం.. నిత్యనూతనం
వన్నెతగ్గని రంగస్థల వినోదం
యువతరాన్నీ ఆకట్టుకుంటున్న పౌరాణికం
దేవీచౌక్ వేదికే సాక్ష్యం
తెల్లవారే వరకూ ప్రదర్శనలు దసరా ఉత్సవాల్లో సందడే సందడి
వన్స్‌మోర్ అంటూ కేరింతలు
‘బావా ఎప్పుడు వచ్చితీవు’, ‘జెండాపై కపిరాజు’, ‘అదిగో ద్వారక – ఆలమందలవిగో’, ‘అలుగుటయే యెరుంగని మహా మహితాత్ముడజాత శత్రుడే యలిగిననాడు’, ‘చెల్లియో,చెల్లకో’ తదితర పద్యాలు నిరక్షరాస్యుల నాలుకలపై సైతం నర్తనమాడటానికి ప్రధాన కారణం నాటకరంగమే. సుమారు అర్ధశతాబ్దం వెనుక వరకు రాత్రి ఏ పదిగంటలకో ప్రారంభమయ్యే ఈ నాటకాలు తెల్లవారేవరకు సాగినా ప్రేక్షకులు ఓపికగా చూసేవారు. అయితే సినిమాలు, టీవీల స్వైరవిహారం ప్రారంభమైన ఈ రోజుల్లో నాటకాలు ప్రాధాన్యం కోల్పోయాయా, వీటిపై నేటితరం ప్రతిస్పందన ఏమిటి, నాటకాలకు ఆదరణ ఎలా ఉంటోంది...తదితర ప్రశ్నలకు సమాధానంగా రాజమహేంద్రవరం దేవీచౌక్‌లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించిన నాటకాల తీరు ... ప్రేక్షకుల అభిరుచిపై ‘సాక్షి’ ఫోకస్ దృష్టి సారించింది. రాత్రి పది గంటలకు ప్రారంభమై వేకువ జామున ఐదు గంటలవరకూ కొనసాగినా ప్రాంగణం పలుచపడలేదు ... ప్రేక్షకుల ఆదరణ చెక్కు చదరలేదు. వృద్ధులతో పాటు మహిళలు, యువత కూడా ఆద్యంతం తిలకించి నేటికీ నాటకాలకు ఆదరణ తగ్గలేదని రుజువు చే శారు.
– రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం కల్చరల్
ప్రదర్శించిన పద్య నాటకాలు ఇవే..
ఈ నెల ఒకటో తేదీన హైకోర్టు న్యాయమూర్తి ఆశపు రామలింగేశ్వరరావు, ఎంపీ మాగంటి మురళీమోహన్, ఇతర ప్రముఖులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఒకటిన గుడివాడకు చెందిన రాజరాజేశ్వరీ నాట్యమండలి ఆధ్వర్యంలో కనకదుర్గా మహత్మ్యం, 3న నగరానికి చెందిన జయలక్ష్మి నాట్యమండలి ఆధ్వర్యంలో సత్యహరిశ్చంద్ర, 5న అదే సంస్థ ఆధ్వర్యంలో మూడు పద్యనాటకాల నుంచి మూడు ప్రధాన ఘట్టాలు, 6న విజయవాడకు చెందిన దుర్గాకళానికేతన్ ఆధ్వర్యంలో మాయాబజారు, 7న ఉమాశ్రీవాణీ కళానికేతన్ ఆధ్వర్యంలో సత్యహరిశ్చంద్ర, 8న ఇదే సంస్థ ఆధ్వర్యంలో చింతామణి, 10న నగరానికి చెందిన జయలక్ష్మి నాట్యమండలి ఆధ్వర్యంలో బాలనాగమ్మ, 11న సంపత్ నగరానికి చెందిన బాలసరస్వతి నాట్యమండలి ఆధ్వర్యంలో రామాంజనేయ యుద్ధం, 12న జయలక్ష్మి నాట్యమండలి ఆధ్వర్యంలో కురుక్షేత్రం నాటకాలను ప్రదర్శించారు. మధ్య తేదీలలో సంగీత విభావరి కార్యక్రమాలు జరిగాయి.
రాజరాజేశ్వరి నాట్యకళామండలి గుడివాడ ఆధ్వర్యంలో ఈ నెల ఒకటో తేదీ రాత్రి సుమారు 11 గంటలకు కనకదుర్గా మహాత్మ్యం నాటకం ప్రారంభమైంది. రాక్షసులను కనకదుర్గాదేవి మట్టుపెట్టడం ప్రధాన ఇతివృత్తం. శంకరుడు, మహిషాసురుడు, నారదుడు, వీరభద్రుడు, పార్వతి ప్రధాన పాత్రలు. ప్రారంభం రోజున ముఖ్య అతి«థుల ప్రసంగాలు ఉండడంతో మేకప్ పూర్తి చేసుకుని వచ్చిన కళాకారులు స్టేజ్ వెనుక ఉన్న రోడ్డుమీదనే కొద్దిసేపు సేదదీరారు.
రాజమహేంద్రవరానికి చెందిన జయలక్ష్మి నాట్యమండలి కళాకారులు మూడో తేదీన ప్రదర్శించిన సత్యహరిశ్చంద్ర నాటకం తెల్లవారుజాము 4.30 గంటల వరకు కొనసాగింది. హరిశ్చంద్రుని పాత్రలో నలుగురు, నక్షత్రకుడి పాత్రలో ముగ్గురు, చంద్రమతి పాత్రలో ముగ్గురు కనిపించారు.
ఉమా శ్రీవాణి కళానికేతన్ కళాకారులు ఏడో తేదీన ప్రదర్శించిన సత్యహరిశ్చంద్ర నాటకం మరుసటిరోజు ఉదయం 4 గంటల వరకు కొనసాగింది. పద్యాలు ఆకట్టుకున్నాయి.
జాతీయ కవి చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన గయోపాఖ్యానం నాటకంలోని కృష్ణార్జున సంవాదం, చింతామణిలోని భవానీ,చింతామణి సంవాదం,హరిశ్చంద్రలోని కాటిసీన్లను ఐదో తేదీన ప్రదర్శించారు.
విజయవాడకు చెందిన దుర్గాకేశవమండలి కళాకారులు ఆరో తేదీన మాయాబజారు నాటకం ప్రదర్శించారు.
ఈ నాటకం ఇతివృత్తం మహాభారతంలో ఎక్కడా
కానరాకపోయినా ప్రేక్షకులకు మాయాబజారు
సినిమా, నాటకాలు నేటికీ అలరిస్తున్నాయి. ఇందులో కృష్ణుడి వేషధారణలో ఇద్దరు కనిపించారు.
కణ్వశ్రీ రచించిన బాలనాగమ్మ నాటకం ఆధారంగా రెండు సినిమాలు గతంలో విడుదలయ్యాయి. జానపదకథకు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి, ‘కాలానుగుణం’గా మార్పులు, చేర్పులు చేశారు. ఈనెల 10న
ప్రదర్శించిన నాటకంలో ప్రత్యేకంగా హాస్యం పేరిట
మసాలా సన్నివేశాలను జొప్పించారు.
కురుక్షేత్రం నాటకాన్ని ఈనెల 12న ప్రదర్శించారు. దుర్యోధనుడి వేషంలో ముగ్గురు, కృష్ణుడి పాత్రలో ఐదుగురు కనిపించారు.
రాజమహేంద్రవరానికి చెందిన ఉమాశ్రీవాణి కళానికేతన్ కళాకారులు ఎనిమిదో తేదీన ప్రదర్శించిన చింతామణి నాటకంలో ‘మసాలా’ పాలు ఎక్కువగా ఉంది. సుమారు శతాబ్దం వెనుక మహాకవి తాళ్లకూరి నారాయణరావు రచించిన ఈ నాటకం వేలాది ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. ఇందులో శ్రీహరి,చింతామణి, రాధ, చిత్ర పాత్రల్లో ఇద్దరేసి కళాకారులు నటించారు. సామాజికసందేశంతో నాటకం ముగుస్తుంది.
మాయల ఫకీర్‌గా మన్ననలు
25 ఏళ్లుగా బాలనాగమ్మ నాటకంలో మాయల ఫకీర్‌గా వందలాది ప్రదర్శనల్లో నటించి, ప్రేక్షకుల మన్ననలను అందుకున్నాను. ఇదే కథతో డాక్టర్.గోవిందరాజులు మాయల ఫకీర్‌గా ఒకసారి, ఎస్వీ రంగారావు మాయలఫకీరుగా మరోసారి సినిమాలు వచ్చాయి. సినిమా ప్రభావం నాటకం మీద లేదు. నాటకం ప్రభావమే సినిమా మీద ఉంది. కణ్వశ్రీ రచించిన ఈ నాటకం నేటికీ ప్రేక్షకులకు నిత్యనూతనమే.
– తవిటి నాయుడు. విజయవాడ
20 ఏళ్లుగా సంగుపాత్రలో
20 ఏళ్లుగా రంగస్థలంపై బాలనాగమ్మ నాటకంలో సంగు పాత్రను పోషిస్తున్నాను. కేవలం మాయలఫకీరును అలరించడానికే కాదు, సంగు పాత్రలో కథాపరంగా ఔచిత్యం ఉందని భావిస్తున్నాను.
– సురభి సువర్ణ, రాజమహేంద్రవరం
వ్యాపారం బాగుంది
దేవీచౌక్ ఉత్సవాలల్లో ప్రతిరోజు రాత్రి టీ అమ్ముతున్నాను.రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము మూడింటి వరకు ఉంటాను. రూ.5 చొప్పున సుమారు 200 టీలు అమ్ముతున్నాను.
– కృష్ణ చౌతన్య, టీ వ్యాపారి.
1500 నాటకాలు ఆడాను
మాది వ్యవసాయ కుటుంబం. కృష్ణా జిల్లా గుడివాడ మా స్వగ్రామం. హాస్య ప్రధానమైన చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి ప్రాత పోషిస్తాను. దాదాపు 1500 సార్లు ఈ వేషం వేశాను. మంచి గుర్తింపు వచ్చింది. ద్వందార్థాలు ఎక్కువగా తీయకుండా ప్రేక్షకులను మెప్పిస్తే ఇబ్బంది ఉండదు. దేవీచౌక్‌లో గత కొన్నేళ్లుగా నటిస్తున్నాను. – దాడిశెట్టి సుబ్బారావు
నాటకాలు చాలా బాగున్నాయి
చిన్నప్పటి నుంచి నాటకాలు చూస్తున్నాం. ఇప్పటి తరం టీవీలకు అతుక్కుపోతోంది. నాటకాల్లో మంచి సందేశం ఉంటుంది. ఇది తెలియజేయడానికి పిల్లలను కూడా తీసుకొస్తున్నాం. నాటకాలల్లో పాత్రలు, సందేశాన్ని వివరిస్తున్నాం. దేవీ చౌక్‌లో ఇలా నాటకాలు ఆడించడం చాలా బాగుంది.
– తంగెళ్ల భవాని, ప్రేక్షకురాలు, రాజమహేంద్రవరం
ఏడేళ్ల వయసు నుంచీ హార్మోనిస్టుగా..
ఏడేళ్ల వయస్సు నుంచి హార్మోనియం వాయిస్తున్నాను. నటుల గానానికి అనుగుణంగా మేము సంగీతం వినిపించాలి. లేకుంటే నటుడు ఇబ్బంది పడతాడు. నాటకం రక్తి కట్టదు. నాటకాలు ఉన్నా లేకున్నా ప్రతి రోజు ఆనం కళా కేంద్రం వద్దకు వెళ్లి సాధన చేస్తాను. నాటకాలే మాకు జీవనాధారం. – కె.వెంకట రమణ
నాటక నిర్వాహకుడిగా..
1974లో ఉమాశ్రీ వాణీనికేతన్ స్థాపించి, రాష్ట్రవ్యాప్తంగా నాటకాలు ఆడుతున్నాను. దేవీచౌక్ ఉత్సవ సమితి సూచనల మేరకు ఏటా ఇక్కడ జరిగే నాటకాలకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాను. నాటక నిర్వాహకుడిగా ఉన్నాను.
– పిడుగు సూర్యనారాయణ, నాటకాల ఆర్గనైజర్
సినిమా చూసి ఇరవై ఏళ్లు
మాది రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామం. దేవీచౌక్ నవరాత్ర ఉత్సవాలల్లో ప్రదర్శించే నాటకాలను చూడడానికి ముపె్పౖ ఏళ్లుగా వస్తున్నాను. నాటకాలంటే ఎనలేని ఆసక్తి. సినిమా చూసి 20 ఏళ్లు అవుతోంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావుల సినిమాలు చూశాను.
– ప్రగడ పద్మరాజు, ప్రేక్షకుడు
రిపోర్టింగ్ : వారణాసి సుబ్రహ్మణ్యం, పలుకూరి కోటేశ్వరరెడ్డి
ఎడిటింగ్ : వద్ది దుర్గారావు
డిజైనింగ్ : డి.ఎస్.వి.వి. ప్రసాద్