Dhaka Attack
-
మావాడు క్లాస్ టాపర్.. ఉగ్రవాది అయ్యాడా?
ఢాకా: గత వారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన భారతీయ యువతి తరుషి జైన్ (19) తల్లిదండ్రులకు ఓ ఉగ్రవాది తండ్రి క్షమాపణ చెప్పారు. రోహన్ ఇంతియాజ్ అనే యువకుడు ఆ ఉగ్ర ఘటనలో అనుమానితుడు. అయితే ఆ నిందితుడి తండ్రి, బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ పార్టీ నేత అయిన ఇంతియాజ్ ఖాన్ బాబుల్ ఈ ఘటనపై క్షమాపణ కోరారు. తరుషి జైన్ కుటుంబానికి తాను మాత్రమే క్షమాపణ చెప్పగలనని, తానే చెప్పాలని, ఎందుకంటే మంచి తండ్రిని కాలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిజం చెప్పాలంటే క్షమాపణ చెప్పడానికి తనవద్ద మాటలు కరవయ్యాయని, ఏం చెప్పినా ఆ తల్లిదండ్రులకు తక్కువే అవుతుందని ఆయన పేర్కొన్నారు. తన కుమారుడు ఐఎస్ ఉగ్రవాది అని తెలిసి షాక్ కు గురయ్యానని చెప్పారు. గతేడాది డిసెంబర్ లో రోహన్ ఇంటినుంచి వెళ్లిపోయాక మళ్లీ తనకు కనిపించలేదని వెల్లడించారు. క్లాస్ టాపర్.. ఇలా దాడులు చేశాడా? మ్యాథ్స్ లో మాత్రమే కాదు క్లాస్ ఓవరాల్ టాపర్ తన కుమారుడని అయితే ఎందుకు ఇలా మారాడో తెలియదని చెప్పుకొచ్చారు. రోహన్ అదృశ్యంపై ఈ జనవరి 2న ఫిర్యాదు చేశాను. మొబైల్ స్విచాఫ్ చేసి ఉందని, సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా లేడని వివరించారు. రోహన్ జిహాదీ సాహత్యం చదవడం తాను ఎప్పుడూ చూడలేదని, తమ ఇద్దరికీ ఒక్కటే కంప్యూటర్ ఉండేదని మీడియాకు వెల్లడించారు. గత వారం ఢాకాలోని రెస్టారెంటుపై ఉగ్రవాదులు దాడిచేసి 20 మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే. -
'అతడు ఉగ్రవాదంటే నమ్మలేక పోతున్నా'
ఢాకా: కొన్నాళ్ల క్రితం తప్పిపోయిన తన కుమారుడు ఉగ్రవాది అని పోలీసులు నిర్థారించడంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యానని బంగ్లాదేశ్ లోని అవామీలీగ్ శాసన సభ్యుడు ఇంతియాజ్ ఖాన్ బాబుల్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు రోహన్ ఉగ్రవాదిగా మారడం ఊహించలేకపోయానన్నారు. మా ఇంట్లో ఉగ్రవాదానికి సంబంధించి ఎటువంటి సాహిత్యం లేదని, తన కుమారుడు ఈ దారుణానికి ఒడిగట్టి ఉండకపోవచ్చని ఖాన్ అన్నారు. శుక్రవారం ఢాకాలోని హోలీ అర్టిసాన్ బేకరీలోకి చోరబడిన సాయుధులు 60 మందిని బంధించి అందులో 20 మంది విదేశీయుల్ని అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన విషయం తెలిసిందే. నరమేధానికి కారణమైన ఆరుగురు ఉగ్రవాదుల్ని ఆర్మీ మట్టు పెట్టింది. ఇందులో ఐదుగురు ఉన్నత కుటుంబాలకు చెందిన వారున్నారు. వీరంతా 18 ఏళ్ల లోపున్న వారేనని, దేశీయ ఉగ్రవాద సంస్థ అయిన జమేతుల్ ముజాహుదీన్ బంగ్లాదేశ్(జేఎమ్ బీ) కి చెందిన వారని ప్రభుత్వం ప్రకటించింది. -
స్నేహితురాళ్ల కోసం ప్రాణాలర్పించాడు
న్యూఢిల్లీ: స్నేహితురాళ్ల కోసం బంగ్లాదేశ్ యువకుడు ప్రాణాలు ఫణంగా పెట్టాడు. తన ప్రాణాలు కాపాడుకునే వీలున్నా తన నేస్తాల కోసం తనువు చాలించాడు. స్నేహితురాళ్లను విడిపిపెట్టి ప్రాణాలు దక్కించుకోమని ఉగ్రవాదులు చెప్పినా వినకుండా ఫ్రెండ్స్ కోసం నిలిచి వారితో పాటే కడతేరిపోయాడు.స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ఢాకాలోని రెస్టారెంటుపై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ యువతి తరుషి జైన్(19)ను కాపాడేందుకు ఆమె ఫరాజ్ హుస్సేన్ స్నేహితుడు ప్రయత్నించాడని వెల్లడైంది. ఉగ్రవాదులు రెస్టారెంట్ లోకి చొరబడినప్పుడు తన ఇద్దరు స్నేహితులు ఫరాజ్ హుస్సేన్, అబింతా కబీర్ తో కలిసి రెస్టారెంటులోని వాష్ రూమ్ లో తరుషి దాక్కుంది. ప్రతిష్టాత్మక ఢాకా స్కూల్ లో చదువుతున్న ఈ ముగ్గురిని ఉగ్రవాదులు కిరాతకంగా హతమార్చారు. చంపడానికి ముందు బయటకు వెళ్లిపోయేందుకు ఫరాజ్ హుస్సేన్ కు ఉగ్రవాదులు అనుమతిచ్చారు. అయితే తన ఇద్దరు స్నేహితులను వదిలి వెళ్లనని చెప్పడంతో 20 ఏళ్ల హుస్సేన్ ను ముష్కరులు చంపేశారని 'ఇండియన్ ఎక్స్ప్రెస్' వెల్లడించింది. తరుషి, అబింత పాశ్చాత్య దుస్తులు ధరించడంతో వీరు ఎక్కడి నుంచి వచ్చారని హుస్సేన్ ను ఉగ్రవాదులు ప్రశ్నించగా... భారత్, అమెరికాకు చెందిన వారని అతడు సమాధానం ఇచ్చినట్టు తెలిపింది. ఉగ్రవాదులు చొరబడిన వెంటనే వాష్ రూములో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నానని కుక్ గా పనిచేస్తున్న సుమిర్ బరాయ్ వెల్లడించాడు. 'బెంగాలి మాట్లాడేవారంతా బయటకు రండి. బెంగాలీలు భయపడాల్సిన పనిలేదు. బెంగాలీలను చంపం. విదేశీయులను మాత్రమే చంపుతాం' అంటూ ఉగ్రవాదుల్లో ఒకడు గట్టిగా అరిచాడని 'న్యూయార్క్ టైమ్స్'తో బరాయ్ చెప్పాడు. తమ ఘాతుకాన్ని సోషల్ మీడియాలో చూడాలని ఉగ్రవాదులు ఉబలాటపడ్డారని వెల్లడించాడు. 'బందీలను చంపిన తర్వాత వై-ఫై ఆన్ చేయాలని రెస్టారెంట్ సిబ్బందితో చెప్పారు. కస్టమర్ల ఫోన్లు తీసుకుని మృతదేహాల ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేశార'ని బరాయ్ పేర్కొన్నాడు. -
’స్నేహం కోసం మా సోదరుడు ప్రాణం విడిచాడు’
కోల్కతా: తన సోదరుడిని వెళ్లిపొమ్మని ఉగ్రవాదులు చెప్పినా స్నేహితులను రక్షించుకునేందుకు వారితోనే ఉండి ప్రాణాలుకోల్పోయాడని ఢాకా ఉగ్రదాడిలో చనిపోయిన ఫరాజ్ సోదరుడు జరేఫ్ హుస్సేన్ తెలిపాడు. సమ్మర్ హాలీడేస్ కోసం ఢాకా వచ్చిన అతడు అనూహ్యంగా మృత్యువాత పడ్డాడని చెప్పి కంటతడి పెట్టాడు. ఢాకా ఉగ్రదాడిలో మొత్తం 20 మంది ప్రాణాలుకోల్పోయిన విషయం తెలిసిందే. వారిలో ఫరాజ్ అనే యువకుడు కూడా ఉన్నాడు. శుక్రవారం సాయంత్రం తమ మిత్రుడిని కలుసుకునేందుకు ఫరాజ్, తారుషి జైన్, అబింత కబీర్ కలిసి ఢాకాలోని హోలి ఆర్టిసన్ రెస్టారెంటుకు వెళ్లారు. అక్కడికి తమ మిత్రుడు మిరాజ్ అల్ హక్ ని రమ్మని చెప్పారు. మిరాజ్ లోపలికి వచ్చే సమయం కంటే ముందే ఉగ్రవాదులు ఆ రెస్టారెంటులోకి చొరబడి నరమేధం సృష్టించారు. ఈ సమయంలో ఖురాన్ చదివిన వారిని విడిచిపెడతామని ఉగ్రవాదులు హెచ్చరించారు. అయితే, ఆ విషయం తమ సోదరుడికి కష్టమైన పనేం కాదని, ఉగ్రవాదులు అతడిని వెళ్లిపొమ్మని చెప్పి ఉంటారని, అయితే, స్నేహితులకోసం అలా ఉండిపోయి ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని తెలిపాడు. -
ఢాకా మృతులకు షేక్ హసీనా నివాళి
ఢాకా: ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సోమవారం ఘనంగా నివాళులు అర్పించింది. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సైనిక అధికారులు, కేబినెట్ మంత్రులు బాధితులకు నివాళులు అర్పించారు. వివిధ దేశాలకు చెందిన దౌత్య అధికారులు సైతం ఈ కార్యక్రమానికి హాజరై... మృతులకు అంజలి ఘటించారు. ఢాకా ఉగ్రదాడిలో ఓ భారతీయ యువతితో పాటు, అమెరికన్ సహా 20మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మరోవైపు ఢాకా రెస్టారెంట్లో మారణహోమం సృష్టించిన ఆరుగురు ఉగ్రవాదుల ఫొటోలను బంగ్లాదేశ్ పోలీసులు విడుదల చేశారు. వీరంతా బంగ్లాలోని సంపన్న కుటుంబాలకు చెందిన విద్యావంతులని పేర్కొన్నారు. చనిపోయిన ఉగ్రవాదుల్లో బంగ్లాదేశ్ అధికార అవామి లీగ్ సీనియర్ నాయకుడి కుమారుడు కూడా ఉన్నట్టు స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది. దాడి నెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ హస్తం ఉన్నట్టు రక్షణశాఖ అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. దాడికి ఐఎస్ఐఎస్తో సంబంధం లేదని తొలుత బంగ్లా పోలీసులు ప్రకటించినా... ఫొటోలు విడుదలైన తర్వాత కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు విడుదలచేసిన ఛాయాచిత్రాలు.. ఐఎస్ఐఎస్ వెబ్సైట్లో పెట్టిన టెరరిస్టుల ఫొటోలతో సరిపోవడంతో ఉగ్రవాదులు బంగ్లాదేశ్లో ఐసిస్ సానుభూతిపరులు కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. -
టీవీ చానళ్లకు ప్రధాని వార్నింగ్
ఢాకా: ఉగ్రవాదుల దాడి సందర్భంగా బంగ్లాదేశ్ టీవీ చానళ్లు ప్రదర్శించిన అత్యుత్సాహంపై ప్రధాని షేక్ హసినా మండిపడ్డారు. టీవీ చానళ్ల లైసెన్సులు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. పలువురిని బందీలుగా పట్టుకున్న ఐసిఎస్ ముష్కరులను మట్టుబెట్టెందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను టీవీ చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. 'ఉగ్రవాదుల చెర నుంచి బందీలను విడిపించేందుకు మేము చేపట్టిన ఏర్పాట్లను వార్తా చానళ్లు లైవ్ ప్రసారం చేశాయి. ఈ ప్రసారాలు ఉగ్రవాదులు చూస్తారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. తమను అంతం చేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుందో తెలిస్తే ఉగ్రవాదులు తప్పించుకునే అవకాశముంటుంది. ఇలాంటి వ్యవహారాల్లో సంయమనం పాటించాలని వార్తా చానళ్ల యజమానులను కోరుతున్నా'నని హసినా అన్నారు. శనివారం సైనిక చర్య ముగిసిన కొద్దిసేపటికే ప్రధాని షేక్ హసీనా టెలివిజన్ ప్రసారంలో ప్రసంగించారు. సైనిక చర్య సందర్భంగా టీవీ చానళ్లు వ్యవహరించిన తీరును ఆమె విమర్శించారు. 'అమెరికాలో ఇలాంటి దాడులు జరిగినప్పుడు సీఎన్ఎన్ లేదా బీబీసీ ప్రభుత్వ చర్యలను పక్షపాతంతో చూపిస్తాయా? కానీ మన దేశంలో టీవీ చానళ్ల మధ్య ఎక్కువ ఉండడంతో అత్యుత్సాహం ప్రదర్శించాయి. ఇదేమి చిన్న పిల్లల ఆట కాదు. మా ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చింది. వాటిని రద్దు చేసే అధికారం కూడా మాకుంది. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరముంద'ని హసినా పేర్కొన్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరీ రెస్టారెంట్లో విదేశీయులను బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు ఒక భారతీయ యువతి సహా 20 మందిని అత్యంత కిరాతకంగా నరికి చంపారు. భద్రతాబలగాలు 10 గంటల పాటు సైనిక చర్య జరిపి ఆరుగురు ఉగ్రవాదులను తుదముట్టించాయి.