మావాడు క్లాస్ టాపర్.. ఉగ్రవాది అయ్యాడా?
ఢాకా: గత వారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన భారతీయ యువతి తరుషి జైన్ (19) తల్లిదండ్రులకు ఓ ఉగ్రవాది తండ్రి క్షమాపణ చెప్పారు. రోహన్ ఇంతియాజ్ అనే యువకుడు ఆ ఉగ్ర ఘటనలో అనుమానితుడు. అయితే ఆ నిందితుడి తండ్రి, బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ పార్టీ నేత అయిన ఇంతియాజ్ ఖాన్ బాబుల్ ఈ ఘటనపై క్షమాపణ కోరారు.
తరుషి జైన్ కుటుంబానికి తాను మాత్రమే క్షమాపణ చెప్పగలనని, తానే చెప్పాలని, ఎందుకంటే మంచి తండ్రిని కాలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిజం చెప్పాలంటే క్షమాపణ చెప్పడానికి తనవద్ద మాటలు కరవయ్యాయని, ఏం చెప్పినా ఆ తల్లిదండ్రులకు తక్కువే అవుతుందని ఆయన పేర్కొన్నారు. తన కుమారుడు ఐఎస్ ఉగ్రవాది అని తెలిసి షాక్ కు గురయ్యానని చెప్పారు. గతేడాది డిసెంబర్ లో రోహన్ ఇంటినుంచి వెళ్లిపోయాక మళ్లీ తనకు కనిపించలేదని వెల్లడించారు.
క్లాస్ టాపర్.. ఇలా దాడులు చేశాడా?
మ్యాథ్స్ లో మాత్రమే కాదు క్లాస్ ఓవరాల్ టాపర్ తన కుమారుడని అయితే ఎందుకు ఇలా మారాడో తెలియదని చెప్పుకొచ్చారు. రోహన్ అదృశ్యంపై ఈ జనవరి 2న ఫిర్యాదు చేశాను. మొబైల్ స్విచాఫ్ చేసి ఉందని, సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా లేడని వివరించారు. రోహన్ జిహాదీ సాహత్యం చదవడం తాను ఎప్పుడూ చూడలేదని, తమ ఇద్దరికీ ఒక్కటే కంప్యూటర్ ఉండేదని మీడియాకు వెల్లడించారు. గత వారం ఢాకాలోని రెస్టారెంటుపై ఉగ్రవాదులు దాడిచేసి 20 మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే.