ఏపీఎస్ఆర్టీసీ ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం
సాక్షి,తిరుపతి: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి దృష్టా గత రెండేళ్ల కాలంపాటు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనాలను రద్దుచేసిన విషయం తెలిసిందే. అనంతరం భక్తుల కోసం దర్శనాలను పరిమితం చేసింది.. క్రమంగా భక్తుల సంఖ్యను పెంచుతూ ఉచిత దర్శనాలు,వీఐపీ బ్రేక్, రూ.300 దర్శనాలు కరోనా నిభందన మేరకు అనుమతి ఇస్తోంది. ఈ క్రమంలోనే రూ. 300ల స్పెషల్ దర్శన టికెట్లను విడుదల చేశారు.
అయితే పరిమిత సంఖ్యలో టికెట్లు విడుదల చేస్తుండడంతో.. చాలా తక్కువ సమయంలో టికెట్లు కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో దేశ విదేశాల్లోని వెంకన్న భక్తులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే ఇలా టికెట్ దొరకని వారి కోసం టీటీడీ, ఏపీఎస్ ఆర్టీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని ఇటీవల టీటీడీ కల్పించింది .ఇందులో భాగంగా దేశంలోని పలు ప్రాంతాలు నుండి తిరుపతికి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణికులకు రోజుకు 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్లో టికెట్స్
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు దర్శనం కోసం వచ్చే భక్తులు www.apsrtconline.in వెబ్సైట్లో ప్రయాణ చార్జీలు, జీఎస్టీతో పాటు రూ. 300 చెల్లించి శీఘ్ర దర్శనం టికెట్‌ను పొందవచ్చు. ఇలా టికెట్ పొందిన వారికి ప్రతి రోజూ ఉదయం 11:00 గంటలకు, సాయంత్రం 4:00 గంటలకు తిరుమ శ్రీవారి దర్శనం కల్పిస్తారు. తిరుమల బస్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవడంలో ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయం చేస్తారు. ఇదిలా ఉంటే ఏపీఎస్ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడిపిస్తోంది.
భక్తుల సద్వినియోగం చేసుకోవాలి
టీటీడీ అధికారులు ఆధ్మాత్మిక కోణంలో ఆలోచించి ఇచ్చిన దర్శన అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలి.విజయవాడ,గుంటూరు, బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన ప్రధాన నగరాల నుంచి తిరుమల దర్శనం కోసం వచ్చే భక్తులు ఆన్లైన్ విధానంలో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఒరిజినల్ ఇడీ ప్రూఫ్,ఆర్టీసీ టికెట్స్ జిరాక్స్ కాఫీ,సాంప్రదాయ వస్త్ర దారణలో టీటీడీ నిభందనల మేరకు భక్తులను టీటీడీ అనుమతి ఇస్తోంది.
–ఆర్టీసీ రీజనల్ మేనేజర్ టి.చెంగల్ రెడ్డి
చదవండి: గోల్డెన్ ఫిష్ @ రూ.2.60 లక్షలు