Dhirendra Kumar CEO
-
ఒకే విడతలో రూ.3 లక్షలు ఇన్వెస్ట్.. ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా?
పదేళ్లకు మించి నేను సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయగలను. నా ఈక్విటీ పెట్టుబడుల్లో 50 శాతం నుంచి 60 శాతం మేర స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – ఉమేష్ యాదవ్ దీర్ఘకాల పెట్టుబడులకు సంబంధించి ఈక్విటీలకు పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం సరైనది. ఒకే రకం ఫండ్ లేదా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోనే ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి దూరంగా ఉండాలి. 50–60% మేర మిడ్, స్మాల్ క్యాప్స్ పెట్టుబడులతో ప్రధాన పోర్ట్‌ఫోలియో నిర్మించుకోవడం అన్నది సూచనీయం కాదు. దీనికి బదులు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే మిడ్, స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 25– 30 శాతానికి పరిమితం అవుతాయి. లార్జ్‌క్యాప్ పెట్టుబడులు 70% మేర ఉంటాయి. వృద్ధికితోడు, స్థిరత్వాన్ని ప్రదర్శించే స్టాక్స్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. రిస్క్ ఎక్కువగా ఉండే సాధనాలకు తక్కువ కేటాయింపులు చేసుకోవాలి. మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ అనేవి దీర్ఘకాలంలో ఫ్లెక్సీక్యాప్ కంటే ఎక్కువ రాబడులను ఇస్తాయి. కానీ, స్వల్పకాలంలో తీవ్ర అస్థిరతల మధ్య చలిస్తాయి. కనుక వీటిల్లో రిస్క్ ఎ క్కువగా ఉంటుంది. అందుకే వీటికి 50–60% కేటాయింపులు చేయడం వల్ల పెట్టుబడుల్లో అధిక భాగం అస్థిరతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక అస్థితరలు ఉన్నా సరే, దీర్ఘకాలంలో అధిక రాబడులు కో రుకుంటే అప్పుడు ఫ్లెక్సీక్యాప్తోపాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను ఒకే విడతలో రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా? లేదా నెలవారీ, త్రైమాసికం వారీ ఆదాయం వచ్చేలా ఎస్‌డబ్ల్యూపీ ఎంపిక చేసుకోవాలా? – శంకర్ నారాయణన్ ఇండెక్స్ ఫండ్ అనేది నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ తదితర సూచీల్లో (ఇండెక్స్‌ల్లో) ఇన్వెస్ట్ చేసేది. మరోవైపు సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) అనేది పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకునే సాధనం. ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే సంబంధిత సూచీ రాబడులకు అనుగుణంగానే ఉంటాయి. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా మీరు కోరుకున్నంత ప్రతి నెలా ఉపసంహరించుకోవచ్చు. రూ.లక్షను 10 నెలల్లో ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంటే ప్రతి నెలా రూ.10వేలను ఎస్డబ్ల్యూపీగా ఎంపిక చేసుకోవాలి. మీ దగ్గర కొంత మొత్తం ఫండ్ ఉండి, ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటుంటే దాన్ని ఒకే విడత కాకుండా ఆరు నుంచి 12 నెలల పరిధిలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా ఆదాయ మార్గం ఏర్పాటు చేసుకోవాలంటే.. మూడింట ఒక వంతును ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రిస్క్ వద్దనుకునే వారు లార్జ్‌క్యాప్ ఫండ్ లేదా ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒక ఏడాది అవసరాలకు సరిపడా (మొత్తం పెట్టుబడిలో 6 శాతం మించకుండా) లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్లో, అది కూడా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టుకోవాలి. ఏడాదికోసారి మీ ఈక్విటీ పెట్టుబడులు 33–35 శాతం మించకుండా, తగ్గకుండా రీబ్యాలన్స్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఏటా ఏడాది అవసరాలకు సరిపడా మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లోకి మళ్లించుకోవాలి. ఈ మొత్తాన్ని ఏటా 5 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. అలాగే, ఉపసంహరించుకునే మొత్తం ఏటా పెట్టుబడిలో 6 శాతం మించకుండా చూసుకోవాలి. -
రిటైర్మెంట్ అవసరాలకు...బెస్ట్ ప్లాన్
మిడ్‌క్యాప్ ఫండ్స్ పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, వాటిల్లో సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)ల ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తున్నాను. భవిష్యత్తులో మంచి రాబడులు పొందవచ్చనే ఆలోచనే దీనికి కారణం. ఇది సరైన నిర్ణయమేనా? – సుధీర్, విజయవాడ ఇది సరైన నిర్ణయమని చెప్పలేము. అలాగే కాదని కూడా చెప్పలేం. మిడ్ క్యాప్ ఫండ్స్ ఎప్పుడు మంచి రాబడులనిస్తాయో, ఎప్పుడు నష్టాలను మిగులుస్తాయో ఖచ్చితంగా అంచనా వేయలేం. సాధారణంగా మార్కెట్ బాగున్నప్పుడు లార్జ్, మిడ్, స్మాల్– ఈ మూడు కేటగిరీల మ్యూచువల్ ఫండ్స్ పనితీరు సంతృప్తికరంగానే ఉంటుంది. ఫండ్స్ పనితీరును మదింపు చేసి, దానికనుగుణంగా ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. అన్ని సమయాల్లో మార్కెట్ ఎలా ఉండబోతుందో అంచనా వేయడం కొంచెం కష్టసాధ్యమైన విషయమే. 2017లో మార్కెట్ అప్‌ట్రెండ్‌లో ఉన్నప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్స్‌తో సహా అన్ని రకాల ఫండ్స్ మంచి రాబడులనిచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించిన ప్రధాన సూత్రమేమిటంటే.. వీలైనంత వరకూ మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డైవర్సిఫై చేయడమే. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విభిన్నరకాల ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందవచ్చు. కేవలం ఒక మిడ్‌క్యాప్ ఫండ్స్‌కే మీ పెట్టుబడులను పరిమితం చేస్తే, డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందలేరు. మార్కెట్ కదలికలకు అనుగుణంగా, లేక ఒక్క మిడ్ క్యాప్ ఫండ్స్‌ల్లోనే ఇన్వెస్ట్ చేయాలని మీరు అనుకుంటే, మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కేవలం 20 శాతం పెట్టుబడులను మాత్రమే మిడ్‌క్యాప్ ఫండ్స్ కోసం కేటాయించండి. మిగిలిన 80 శాతం మొత్తాన్ని డైవర్సిఫికేషన్ అధికంగా ఉన్న, వ్యయాలు తక్కువగా ఉన్న, మంచి ఫండ్ మేనేజర్ నిర్వహణలో ఉన్న, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మల్టీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. నేను గత కొంత కొలంగా మూడు మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతినెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎస్బీఐ బ్లూచిప్ ఫండ్, ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్‌క్యాప్ ఫండ్, ఎస్బీఐ మ్యాగ్నమ్ మల్టీక్యాప్ ఫండ్–ఈ మూడు ఫండ్స్‌లో ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్‌క్యాప్ ఫండ్ పనితీరు గత రెండేళ్ల నుంచి సంతృప్తికరంగా లేదు. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమంటారా? లేక ఆపేయమంటారా? – కిరణ్మయి, హైదరాబాద్ ఒకే ఫండ్ హౌస్‌కు చెందినవి కాకుండా వివిధ మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు చెందిన మల్టీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు అధికంగా పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో లార్జ్ క్యాప్ ఫండ్స్ మంచి రాబడులనివ్వవచ్చు. మరికొన్ని సందర్భాల్లో స్మాల్‌క్యాప్ ఫండ్స్ మంచి లాభాలనివ్వవచ్చు. ఇప్పుడు మంచి రాబడులనిచ్చాయి కదాని స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి, కొన్నేళ్ల తర్వాత లార్జ్ క్యాప్ ఫండ్స్ మంచి రాబడులనిస్తున్నాయని వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు పొందే ప్రయోజనాలు పెద్దగా ఉండకపోవచ్చు. ఇక మీ విషయానికొస్తే, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్ మూడూ మంచి ఫండ్సే. మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ పరిమితుల దృష్ట్యా ఇతర కేటగిరీల ఫండ్స్‌తో పోల్చితే ఈ ఫండ్స్ పనితీరు కొంత అసంతృప్తినివ్వవచ్చు. మల్టీ క్యాప్ ఫండ్స్ వాటికున్న సౌలభ్యం దృష్ట్యా ఇతర ఫండ్స్‌తో పోల్చితే ఒకింత మెరుగైన రాబడులనిచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. మరొక ఏడాది వేచి చూసి, అప్పుడు కూడా ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్‌క్యాప్ ఫండ్ పనితీరు మీరు ఆశించిన స్థాయిలో లేకపోతే, అప్పుడు నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మీరు వేరే ఫండ్‌లోకి మారాలనుకుంటే, వేరే మ్యూచువల్ ఫండ్ సంస్థకు చెందిన మల్టీక్యాప్ ఫండ్స్‌ను ఎంచుకోండి. రిటైర్మెంట్ అవసరాల కోసం పన్ను ఆదా చేసే ఫండ్స్‌లో సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇలా చేయడం సరైనదేనా? – హరీశ్, విశాఖపట్టణం రిటైరైన తర్వాత వచ్చే అవసరాల కోసం 15–20 ఏళ్ల పాటు సిప్ మార్గంలో పన్ను ఆదా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదే. మీరు కనుక 30 ఏళ్లపాటు ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయగలిగితే, ఇదే మంచి రిటైర్మెంట్ ప్లాన్ అవుతుంది. పన్ను ఆదా ఫండ్స్‌కు మూడేళ్ల లాక్–ఇన్ పీరియడ్ ఉంటుంది. దీని వల్ల మీకు ప్రయోజనమే కలుగుతుంది. ఒక ఈక్విటీ ఫండ్‌లో మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మూడేళ్ల కాలంలో ఈక్విటీల పనితీరు ఎలా ఉంటుందో మీకు అవగతమవుతుంది. మార్కెట్ పట్ల, ఈక్విటీ ఫండ్స్ పనితీరు పట్ల మీకు ఒక అవగాహన వస్తుంది. మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈ ఫండ్స్ మంచి రాబడులనిస్తాయి. మార్కెట్ తగ్గుతున్నప్పుడు వీటి పనితీరు అంతంతమాత్రంగానే ఉంటుంది. కొండొకచో నష్టాలు కూడా రావచ్చు. మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్సాహభరితంగానే ఉంటుంది. కానీ, మార్కెట్ పతనబాటలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి మనస్సు రాదు. కానీ మార్కెట్ ఉత్థాన, పతనాలతో సంబంధం లేకుండా ఈ ఫండ్స్‌లో సిప్‌లు కొనసాగించండి. ఈక్విటీ ఫండ్స్‌కు మూడేళ్ల లాక్–ఇన్ పీరియడ్ విధించడం వెనక అసలు ఉద్దేశం కూడా ఇదే. -
అప్పుడు ఈఎల్ఎస్ఎస్లు ఆకర్షణీయం కాదు
నేను గత కొంతకాలంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో 3 లేదా 4 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలకు చెందిన ఫండ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఒక ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాలిక మూలధన లాభాలపై రూ. 1 లక్ష వరకూ మి నహాయింపు ఉంది కదా ! ఈ మినహాయింపు అన్నింటికీ కలిపి వర్తిస్తుం దా ? ఒక్కో మ్యూచువల్ ఫండ్ సంస్థ ఇన్వెస్ట్‌మెంట్స్‌కే వర్తిస్తుందా ? –రవీందర్, విజయవాడ అన్నింటికీ కలిపి వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల విక్రయాలపై వచ్చిన లాభాలపై రూ. లక్ష వరకూ మినహాయింపు ఉంటుంది. ఒక వేళ ఒక ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్ల విక్రయాలపై దీర్ఘకాల మూలధన లాభాలు రూ. లక్షకు మించాయనుకోండి. మీరు రూ. లక్షకు మించిన లాభాలపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీకు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. లక్షన్నర దీర్ఘకాలిక మూలధన లాభాలు వచ్చాయనుకుందాం. మినహాయింపు రూ. 1 లక్ష పోను, రూ.50,000పై 10 శాతం చొప్పున రూ.5,000 దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీర్ఘకాలంలో ఈక్విటీ, ఫండ్స్‌పై మంచి రాబడులే వస్తాయి కాబట్టి, ఈ 10 శాతం పన్ను విషయమై భయపడాల్సిన పని లేదు. నా వయస్సు 50 సంవత్సరాలు. నేను మొత్తం ఆరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. అవి...ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మనీ మేనేజర్, ఎల్ అండ్ టీ ట్యాక్స్ అడ్వాండేజ్, రిలయన్స్ ఈక్విటీ హైబ్రిడ్, రిలయన్స్ లార్జ్ క్యాప్, ఎస్బీఐ బ్లూ చిప్‌లు. ఇది డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో అవునా? కాదా ? నేను మరో పదేళ్ల వరకూ ఇన్వెస్ట్ చేయగలను. ఈ ఫండ్స్ యూనిట్లను విక్రయించి, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా వివిధ మ్యూచువల్ ఫండ్స్‌కు చెందిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. దీని కోసం ముందుగా వివిధ మ్యూచువల్ ఫండ్స్‌కు చెందిన లిక్విడ్ ఫండ్స్‌లోకి నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేసి ఆ తర్వాత ఈక్విటీ ఫండ్స్‌లోకి మార్చుకోమంటారా? –ఫిలిప్స్, సికింద్రాబాద్ మీరు మీ పోర్ట్‌ఫోలియోను మరింత సరళం చేయాల్సిన అవసరం ఉంది. దీని కోసం మీ పోర్ట్‌ఫోలియోలో 2–3 మల్టీక్యాప్ ఫండ్స్ ఉంటే సరిపోతుంది. ఇక మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌లోకి ఎస్టీపీ ద్వారా బదిలీ చేసుకోవచ్చు. ప్రస్తుతం మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ, వివిధ మ్యూచువల్ ఫండ్స్‌కు చెందిన వివిధ లిక్విడ్ ఫండ్స్‌లోకి కాకుండా ఒకే లిక్విడ్ ఫండ్‌లోకి మార్చుకోండి. ఈ ఫండ్ నుంచి ఎస్‌డబ్ల్యూపీ (సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్) ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మీ బ్యాంక్ ఖాతాలోకి వచ్చేలా చూసుకోండి. ఈ బ్యాంక్ ఖాతా నుంచి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) ప్లాన్ ద్వారా 2–3 మంచి ఈక్విటీ ఫండ్స్‌లోకి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేసుకోండి. ఈ విధంగా ఒక్కసారి సూచనలు ఇస్తే, ప్రతి నెలా ఆటోమేటిక్‌గా లిక్విడ్ ఫండ్ నుంచి ఎస్‌డబ్ల్యూపీ ద్వారా విక్రయాలు జరిగి, సిప్ ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి మీ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్లిపోతాయి. చాలా మంది పన్ను ప్రయోజనాల కోసమే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే నాకు పన్ను ఆదా చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ? –బషీర్, విశాఖ పట్టణం జ: మీరు ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసినా, మరే ఇతర మల్టీక్యాప్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినా ఒకటే తేడా ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ల్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ మూడేళ్ల వరకూ లాక్–ఇన్ అవుతాయి. మల్టీక్యాప్ ఈక్విటీ ఫండ్స్‌కు ఎలాంటి లాక్ ఇన్ పీరియడ్ ఉండదు. ఈఎల్ఎస్ఎస్లకు ఈ మూడేళ్ల లాక్–ఇన్ పీరియడ్ నిబంధన కారణంగా ఈఎల్ఎస్ఎస్ ఫండ్ మేనేజర్‌పై రిడంప్షన్(ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయించడం) ఒత్తిడి ఉండదు. ఫలితంగా సదరు ఫండ్ మేనేజర్ దీర్ఘకాలం దృష్ట్యా ఇన్వెస్ట్మెంట్స్ వ్యూహాన్ని అమలు చేస్తాడు. అయితే సాధారణ మ్యూచువల్ ఫండ్స్‌కంటే ఈఎల్ఎస్ఎస్లు మంచి రాబడులు ఇచ్చిన దాఖలాలు పెద్దగా లేవు. పన్ను ప్రయోజనాలు ప్రాధాన్యం కానప్పుడు ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. ఎందుకు అనవసరంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ మూడేళ్ల వరకూ లాక్ అయి ఉండటం ?మీరు ఎంచుకోవడానికి ఎన్నో ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి కదా ! క్రమం తప్పకుండా దీర్ఘకాలం పాటు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఏదైనా మంచి ఈక్విటీ ఫండ్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల(రిటైర్మెంట్ నిధి ఏర్పాటు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, పిల్లల ఉన్నత చదువులు)ను సునాయాసంగా సాధించవచ్చు. పన్ను ఆదా మీకు అవసరం లేని విషయమైతే, మీరు లిక్విడిటీ విషయమై ఎందుకు అనవసరంగా రాజీ పడటం ? అందుకని పన్ను ఆదా చేయాల్సిన అవసరం లేనప్పుడు ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న మీ నిర్ణయం సరైనది కాదని చెప్పవచ్చు. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఈ పతనంలో ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి ?
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ పతన బాటలో నడుస్తోంది కదా ! ఈ కరెక్షన్ నుంచి ప్రయోజనం పొందాలనుకుంటున్నాను. రూ. లక్ష వరకూ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. దీర్ఘకాలం పాటు ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలన్నది నా ఆలోచన. నేను ఇన్వెస్ట్ చేయడానికి తగిన ఫండ్స్‌ను సూచించండి. –ప్రియ భావన, హైదరాబాద్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ నష్టాల్లో ఉంది కదాని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోవడం మంచిదే. కానీ మరింతగా పడిపోదన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు కదా ! అందుకని ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి కొన్ని నియమాలను అందరూ పాటించాల్సి ఉంటుంది. మార్కెట్ పెరుగుతున్పప్పుడూ, పతనమవుతున్నప్పుడూ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలి. మీరు దీర్ఘకాలం పాటు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలనుకుంటున్నారు. కాబట్టి, మీకు రెండు మార్గాలు సూచిస్తున్నాను. మొదటిది మీరు ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్ సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేయకపోతే, ఏదైనా మంచి బ్యాలన్స్డ్ ఫండ్‌ను ఎంచుకోండి.మీ దగ్గరున్న మొత్తాన్ని ఐదు సమాన భాగాలుగా చేసి, ఒక్కో భాగాన్ని ఒక్కో నెలలో ఇన్వెస్ట్ చేయండి.మొత్తం సొమ్ములను ఒకేసారి ఇన్వెస్ట్ చేయవద్దు. మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఎప్పుడూ ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఇక రెండో మార్గం మీరు ఇప్పటికే స్టాక్ మార్కెట్ సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన అనుభవం మీకు ఉందనుకోండి. లేదా కొంచెం నష్ట భయాన్ని భరించగలిగితే,..., ఏదైనా మల్టీక్యాప్ ఫండ్‌ను ఎంచుకోండి. మీరు కనుక స్టాక్ మార్కెట్ సంబంధిత సాధనాల్లో 2–3 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, మార్కెట్ ఒడిదుడుకుల గురించి మీకు ఒక అవగాహన ఉంటుంది. అందుకని మల్టీక్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్, హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఒక మల్టీక్యాప్ ఫండ్స్ కోసమైతే, మిరా అసెట్ ఇండియా ఈక్విటీ, ఎస్బీఐ మేగ్నమ్ మల్టీక్యాప్లను పరిశీలించవచ్చు. వడ్డీరేట్లకు, బాండ్ల రాబడులకు మధ్య సంబంధం ఎలా ఉంటుంది ? బాండ్లలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ విషయాలను పరిశీలించాలి ? –వెంకట్, గుంటూరు బాండ్ల ధరలకు, వడ్డీరేట్లకు విలోమ సంబంధం ఉంటుంది. వడ్డీరేట్లు పెరిగినప్పుడు బాండ్ల ధరలు తగ్గుతాయి. అలాగే వడ్డీరేట్లు తగ్గితే బాండ్ల ధరలు పెరుగుతాయి. వడ్డీ రేట్లు పెరిగితే, బాండ్ల ధరలు తగ్గుతాయి. కాబట్టి బాండ్లలో ఇన్వెస్ట్ చేసే బాండ్ ఫండ్స్ రాబడులు కూడా తగ్గుతాయి. అలాగే వడ్డీరేట్లు తగ్గితే, బాండ్ల ధరలు పెరుగుతాయి. అందుకని వడ్డీరేట్లు తగ్గితే, ఓపెన్–ఎండ్ బాండ్ ఫండ్స్‌కు ప్రయోజనం కలుగుతుంది. అయితే ఇది స్వల్పకాలిక అంశం. బాండ్ల విలువ మదింపు సాధారణమైన లెక్క లాంటిదే. దీనిని సులభంగానే అంచనా వేయవచ్చు. భవిష్యత్తు నగదు ప్రవాహాలను డిస్కౌంట్ చేయవచ్చు. ఇవి ఈక్విటీ ఫండ్స్లాగా కాదు. బాండ్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. బాండ్ ఎంత మంచిది ? ఎంత వడ్డీరేటును ఆ బాండ్ చెల్లిస్తుంది ? ఆ బాండ్ కాలపరిమితి ఎంత ? ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకొని బాండ్ల విలువను మదింపు చేయవచ్చు. అందుకని వడ్డీరేట్లు పెరిగినప్పుడు, తగ్గినప్పుడు బాండ్ల ధరలు తగ్గడం, పెరగడం సంభవిస్తుంది. ఈ తరుగుదల లేదా పెరుగుదలను మనం ముందుగానే అంచనా వేయగలం. నేను దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అందుకని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకున్నాను. అయితే నా పోర్ట్‌ఫోలియోలో డెట్ ఇన్వెస్ట్మెంట్ సాధనాలు ఏమీ లేవు. డెట్ విభాగంలో కూడా ఇన్వెస్ట్ చేసే నిమిత్తం ఒక హైబ్రిడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. –షరీఫ్, విజయవాడ మీ పోర్ట్‌ఫోలియోలో డెట్ కూడా భాగం ఉండాలనే ఆలోచన మంచిదే. అసలు ఒక ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో డెట్ విభాగం(బాండ్లు, బ్యాంక్ డిపాజిట్లు, కంపెనీల డిపాజిట్లు, పీపీఎఫ్, ఈపీఎఫ్, తదితర ) తప్పనిసరిగా ఉండాల్సిందే. దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒక ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో డెట్ విభాగం తప్పనిసరిగా ఉండాల్సిందే. మార్కెట్ ఒడిదుడుకుల నుంచి ఈ విభాగం ఇన్వెస్టర్‌కు రక్షణనిస్తుంది. సాధారణంగా రెండు అంశాల కోసం డెట్ విభాగంలో ఇన్వెస్ట్ చేయాలి. మొదటిది ఎమర్జన్సీ ఫండ్...అత్యవసర సమయాల్లో అవసరమయ్యే నిధి ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ నిధులు మార్కెట్ రిస్క్‌లకు గురి కాకుండా ఉండాలి. మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్లో ఇది కొంత శాతంగా ఉండకూడదు. మీ ఆరు నెలల అవసరాలకు సరిపడేలా.. రూ. 50,000 నుంచి రూ. లక్ష వరకూ ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మీకు చిన్న పిల్లలు ఉన్నా, మీ కుటుంబంలో పెద్ద వయస్సు వాళ్లు ఉన్నా, ఈ అత్యవసర నిధి కోసం మరింతగా కేటాయింపులు జరపాలి. ఇక రెండోది మీ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలన్స్ చేయడానికి డెట్ విభాగంలో ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న దాంట్లో 10% డెట్ ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. మిగిలిన మొత్తాన్ని మీరు అనుకున్నట్లుగానే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీరు రిటైర్మెంట్కు దగ్గరగా వచ్చినప్పుడు అంటే... 2–3 ఏళ్ల కాలంలో రిటైర్ కాబోతున్నారనుకుందాం.. అప్పుడు ఈక్విటీ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లోకి మళ్లించండి. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఫండ్స్‌ను ఎప్పుడు విక్రయించాలి?
నేను కొన్ని మంత్లీ ఇన్కమ్ ప్లాన్లు(గ్రోత్ ఆప్షన్), డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. వీటిపై పన్నులు ఎలా ఉంటాయి? – ఫరూక్, హైదరాబాద్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్లు(గ్రోత్ ఆప్షన్), డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై పన్నులు ఒకే విధంగా ఉంటాయి. మీరు ఏదైనా డెట్ ఫండ్ గ్రోత్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మూడేళ్లలోపే మీరు ఈ ఫండ్ యూనిట్లను విక్రయిస్తే, మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చిన రాబడులను మీ మొత్తం ఆదాయానికి కలిపి మీకు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఫండ్ యూనిట్లను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే, వీటిపై వచ్చే రాబడులను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ రాబడులపై ఇండెక్సేషన్ ప్రయోజనాలతో 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి? ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాలపై కొంత అవగాహన ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక ఇన్వెస్టర్‌గా నేను ఏం చేయాలి? ఫండ్ పనితీరు బాగా లేకపోతే ఆ ఫండ్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలా ? లేదా వేరే ఫండ్‌లోకి మారిపోవాలా? అసలు మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఏ ఏ సందర్భాల్లో విక్రయించాలో చెబుతారా ? – శైలజ, విజయవాడ ఒక మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను దీర్ఘకాలం కొనసాగిస్తే, సంపద అదే పెరిగిపోతుందని చాలా మంది ఇన్వెస్టర్లు అనుకుంటారు. అయితే ఇది అన్ని ఫండ్స్‌కు వర్తించదు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ ఫండ్స్ పనితీరును తప్పనిసరిగా మదింపు చేయాలి. మంచి రాబడులు ఇస్తుందా లేక ప్రతికూలంగా ఉందా గమనించాలి. ఫండ్ పనితీరు అంచనాలకు అనుగుణంగా లేకపోయినా, ఈ కేటగిరిలోని ఇతర ఫండ్స్ కన్నా అధ్వానంగా ఉన్నా ఈ ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్‌లోకి బదిలీ చేయాలి. దశాబ్దాలుగా మంచి పనితీరు కనబరిచిన ఫండ్స్ పనితీరు అధ్వానంగా ఉంటే పనితీరు మెరుగుపడేదాకా వెయిట్ చేయడం ఉత్తమం. ఫండ్ మేనేజర్ మార్పు కూడా పరిగణనలోకి తీసుకోదగిన విషయమే. మీ ఫండ్ మేనేజర్‌ను సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ తొలగించి వేరే ఫండ్ మేనేజర్‌ను నియమించిందనుకుందాం. వెంటనే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చేయాల్సిన పనిలేదు. కొత్త ఫండ్ మేనేజర్ట్రాక్ రికార్డ్‌ను పరిశీలించండి. కొత్త ఫండ్ మేనజర్ నేతృత్వంలో మీ ఫండ్ పనితీరును కనీసం ఆరు నెలల పాటు అయినా మదింపు చేయండి. ఆ ఫండ్ పనితీరు సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు ఆ ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్‌లోకి మార్చుకోవచ్చు. మీరు రెండు, అంతకంటే ఎక్కువ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకుందాం. ఒకటికి మించిన ఫండ్ పోర్ట్‌ఫోలియో స్టాక్ హోల్డింగ్స్ దాదాపు ఒకే విధంగా ఉంటే, ఏదో ఒక ఫండ్ నుంచి వైదొలగడమే ఉత్తమం. ఫండ్ పోర్ట్‌ఫోలియోలు ఒకే విధంగా ఉంటే, డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు మీకు లభించవు. మీ పోర్ట్‌ఫోలియోలో అధిక సంఖ్యలో మ్యూచువల్ ఫండ్స్ ఉంటే, తక్కువ రాబడులు వచ్చే, పనితీరు బాగా లేని ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవచ్చు. మీ పోర్ట్‌ఫోలియోలో ఐదు కంటే ఎక్కువ ఫండ్స్ ఉండకపోవడమే మంచిది. ఇక మీ అంచనాలకు అనుగుణంగా లేని ఫండ్స్‌ను కూడా విక్రయించవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే.. సొంత ఇల్లు కొనుగోలు చేయడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు, పిల్లల ఉన్నత చదువులు తదితర ఆర్థిక లక్ష్యాలను సాకారం చేసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, మంచి రాబడులు వస్తాయి. మరోవైపు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మా నాన్నగారి వయసు 75 సంవత్సరాలు. ఆయనకు బేసిక్ మెడిక్లెయిమ్ పాలసీ రూ.1.5 లక్షలకు ఉంది. ఆయన కోసం రూ.5 లక్షల టాప్ అప్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి ? – కరుణాకర్, విశాఖ పట్టణం హాస్పిటలైజేషన్‌ను కవర్ చేసే బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని టాప్ అప్ పాలసీగా చెప్పుకోవచ్చు. స్వల్ప అదనపు వ్యయంతో ఆరోగ్య బీమా కవర్‌ను పెంచుకోవడానికి ఇది అత్యుత్తమ మార్గం. వైద్య ఖర్చులు ఒక పరిమితికి మించితేనే ఈ టాప్ అప్ పాలసీలు పనిచేస్తాయి. చాలా టాప్ అప్ పాలసీలకు గరిష్ట వయసు పరిమితి 65 సంవత్సరాలు. ఐసీఐసీఐ లొంబార్డ్ హెల్త్ కేర్ ప్లస్వంటి కొన్ని ప్లాన్లకు గరిష్ట వయోపరిమితి లేదు. ఇలాంటి టాప్ అప్ ప్లాన్లకు ప్రీమియమ్ కూడా అధికంగానే ఉంటుంది. అంతే కాకుండా మీ నాన్నగారి ఆరోగ్య పరిస్థితులను బట్టి కూడా ప్రీమియమ్ ఆధారపడి ఉంటుంది. అందుకని అధిక వయసు వ్యక్తులకు వివిధ సంస్థలు అఫర్ చేస్తున్న టాప్ అప్ ప్లాన్లన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి మీ బడ్జెట్‌కు సరిపడే ప్లాన్‌ను ఎంచుకోండి. -
టర్మ్ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి..?
యూటీఐ డివిడెండ్ ఈల్డ్‌లో 2011 ఆగస్టు నుంచి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. కానీ ఈ ఫండ్‌పై రాబడులు తక్కువగా వస్తున్నాయి. దీంతో ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను 2014 అక్టోబర్ నుంచి ఆపేశాను. నా నిర్ణయం సరైనదేనా? ఈ ఫండ్‌లో చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్‌కు మార్చాలనుకుంటున్నాను. ఎలా మార్చుకోవాలో వివరిస్తారా? -శర్మిష్ట, హైదరాబాద్ అధిక డివిడెండ్లు చెల్లించే కంపెనీల నుంచి నిలకడైన రాబడులు ఆశించే సాంప్రదాయిక ఇన్వెస్టర్లకు అనువైన ఫండ్‌గా యూటీఐ డివిడెండ్ ఈల్డ్‌ను చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఈ ఫండ్ పనితీరు బాగాలేని మాట వాస్తవమే. కానీ ఈ ఒక్క కారణంతో ఈ ఫండ్ నుంచి వైదొలగడం సరైనది కాదు. డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ బుల్ మార్కెట్లో మంచి పనితీరు కనబరచకపోవడమనేది సాధారణమైన విషయమే. మీ నిర్ణయంపై పునరాలోచించండి. ఈ ఫండ్ నుంచి వైదొలగాలని పూర్తి స్థాయిలో మీరు నిర్ణయించుకుంటే, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా యూటీఐ డివిడెండ్ ఈల్డ్ ఫండ్ నుంచి వేరే కొత్త ఫండ్‌కు మారవచ్చు. నేనొక టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. కానీ మార్కెట్లో చాలా టర్మ్ ప్లాన్లున్నాయి. ప్రీమియం విషయానికొస్తే, 70 నుంచి 80 శాతం వరకూ తేడా ఉంది. రిలయన్స్, అవైవా, ఏఎక్స్ఏ, ఎస్బీఐ లైఫ్‌ల్లో ఏది ఎంచుకోవాలో సలహా ఇస్తారా? - నవనీత్, విశాఖ పట్టణం బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, బీమా తీసుకున్న మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేయడమనే ఒకే ఒక లక్ష్యంతో టర్మ్ ప్లాన్లు రూపొందిస్తారు. వివిధ కంపెనీలు వివిధ అంశాల ఆధారంగా ప్రీమియమ్‌లను నిర్ణయిస్తాయి. అందుకే వాటిల్లో తేడాలుంటాయి. బీమా కంపెనీల గతంలోని క్లెయిమ్‌ల నిష్పత్తిని బట్టి, ఇతర బీమా కంపెనీల ప్రీమియమ్‌లతో ఉన్న తేడాలను బట్టి టర్మ్ ప్లాన్లను ఎంచుకోవాలి. ఈ అంశాలన్నింటి పరంగా చూస్తే, భారతీ ఏఎక్స్ఏ లైఫ్ ఈప్రొటెక్ట్, అవైవా ఐ-లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఈ-షీల్డ్-లెవల్ కవర్... ఈ టర్మ్ ప్లాన్లను పరిశీలించవచ్చు. ఇవన్నీ ఆన్లైన్ టర్మ్ ప్లాన్లు. మీ వయస్సుకు ఎంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందో, లెక్కలేసుకొని, మీ బడ్జెట్‌కు అనుగుణంగా టర్మ్ ప్లాన్‌ను ఎంచుకోండి. నేను 2007 నుంచి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ స్మార్ట్‌కిడ్ యులిప్(మ్యాక్సిమైజర్)లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఏడాదికి రూ.10,000 ప్రీమియం చొప్పున ఎనిమిది సంవత్సరాల పాటు మొత్తం రూ.80,000 చెల్లించాను. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ విలువ రూ.1,42,000గా ఉంది. ఇప్పుడు ఈ పాలసీని సరెండర్ చేయాలనుకుంటున్నాను. ఈ వచ్చిన మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లోనూ, ఎంపిక చేసిన షేర్లలోనూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా? ఈ పాలసీని సరెండర్ చేస్తే టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుందా? వివరించగలరు. -జబ్బార్, వరంగల్ బీమా, పెట్టుబడులకు ఒకే పాలసీని తీసుకోవడం సరికాదని ఎప్పటి నుంచో చెపుతూనే ఉన్నాము. మీరు ఈ పాలసీని సరెండర్ చేసి, ఆ వచ్చిన మొత్తాన్ని ఏదైనా డైవర్సిఫైడ్ ఈక్విటీ, లేదా బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీ పాలసీ ఐదేళ్లు దాటింది కాబట్టి, మీరు ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన పని లేదు. ఇక ఈ పాలసీని సరెండర్ చేస్తే మీరు టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. నేను గత ఏడాది మేలో డీఎస్పీ బ్లాక్‌రాక్ ఎఫ్ఎంపీ సిరీస్154లో రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. ఇది ఈ నెలలో మెచ్యూర్ అవుతోంది. నేను పది శాతం ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాను. నేను ఎంత పన్ను చెల్లించాల్సి ఉం టుంది? దీనిని మరికొంత కాలం పొడిగించుకోవచ్చా? -కుమార స్వామి, విజయవాడ మీరు ఈ ఫండ్‌లో పొందిన లాభాలపై 10 శాతం చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డెట్ ఫండ్స్ ద్వారా మూడేళ్లలోపు పొందిన రాబడులను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఒక క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్‌ను ఇన్వెస్టర్ పొడిగించడానికి వీలులేదు. మ్యూచువల్ ఫండ్ సంస్థ మాత్రమే ఫండ్ మెచ్యూరిటీని పొడిగించే వీలు ఉంది. అలా చేసినప్పుడు సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ మీకు సమాచారమిస్తుంది. అలాంటి సమాచారం మీకు అందితే, మీకు తక్షణం ఈ డబ్బులు అవసరం లేకపోతే, ఈ ప్లాన్‌ను ఎలాంటి అనుమానాలు లేకుండా పొడిగించుకోండి.