టర్మ్ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి..? | Dhirendra Kumar CEO Value Research | Sakshi
Sakshi News home page

టర్మ్ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి..?

Published Mon, Jun 1 2015 2:20 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

టర్మ్ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి..?

టర్మ్ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి..?


 యూటీఐ డివిడెండ్ ఈల్డ్‌లో 2011 ఆగస్టు నుంచి  సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. కానీ ఈ ఫండ్‌పై రాబడులు తక్కువగా వస్తున్నాయి. దీంతో ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను 2014 అక్టోబర్ నుంచి ఆపేశాను. నా నిర్ణయం సరైనదేనా? ఈ ఫండ్‌లో చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్‌కు మార్చాలనుకుంటున్నాను. ఎలా మార్చుకోవాలో వివరిస్తారా?
 -శర్మిష్ట, హైదరాబాద్

 
 అధిక డివిడెండ్‌లు చెల్లించే కంపెనీల నుంచి నిలకడైన రాబడులు ఆశించే సాంప్రదాయిక ఇన్వెస్టర్లకు అనువైన ఫండ్‌గా యూటీఐ డివిడెండ్ ఈల్డ్‌ను చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఈ ఫండ్ పనితీరు బాగాలేని మాట వాస్తవమే. కానీ ఈ ఒక్క కారణంతో ఈ ఫండ్ నుంచి వైదొలగడం సరైనది కాదు. డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ బుల్ మార్కెట్లో మంచి పనితీరు కనబరచకపోవడమనేది సాధారణమైన విషయమే. మీ నిర్ణయంపై పునరాలోచించండి. ఈ  ఫండ్ నుంచి వైదొలగాలని పూర్తి స్థాయిలో మీరు నిర్ణయించుకుంటే, సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ) ద్వారా యూటీఐ డివిడెండ్ ఈల్డ్ ఫండ్ నుంచి వేరే కొత్త ఫండ్‌కు మారవచ్చు.

 నేనొక టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. కానీ మార్కెట్లో చాలా టర్మ్ ప్లాన్‌లున్నాయి. ప్రీమియం విషయానికొస్తే, 70 నుంచి 80 శాతం వరకూ తేడా ఉంది. రిలయన్స్, అవైవా, ఏఎక్స్‌ఏ, ఎస్‌బీఐ లైఫ్‌ల్లో ఏది ఎంచుకోవాలో సలహా ఇస్తారా?
 - నవనీత్, విశాఖ పట్టణం

 
 బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, బీమా తీసుకున్న మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేయడమనే ఒకే ఒక లక్ష్యంతో టర్మ్ ప్లాన్‌లు రూపొందిస్తారు. వివిధ కంపెనీలు వివిధ అంశాల ఆధారంగా ప్రీమియమ్‌లను నిర్ణయిస్తాయి. అందుకే వాటిల్లో తేడాలుంటాయి. బీమా కంపెనీల గతంలోని క్లెయిమ్‌ల నిష్పత్తిని బట్టి, ఇతర బీమా కంపెనీల ప్రీమియమ్‌లతో ఉన్న తేడాలను బట్టి టర్మ్ ప్లాన్‌లను ఎంచుకోవాలి. ఈ అంశాలన్నింటి పరంగా చూస్తే, భారతీ ఏఎక్స్‌ఏ లైఫ్ ఈప్రొటెక్ట్, అవైవా ఐ-లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ ఈ-షీల్డ్-లెవల్ కవర్... ఈ టర్మ్ ప్లాన్‌లను పరిశీలించవచ్చు. ఇవన్నీ ఆన్‌లైన్ టర్మ్ ప్లాన్‌లు. మీ వయస్సుకు ఎంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందో, లెక్కలేసుకొని, మీ బడ్జెట్‌కు అనుగుణంగా టర్మ్ ప్లాన్‌ను ఎంచుకోండి.

 నేను 2007 నుంచి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ స్మార్ట్‌కిడ్ యులిప్(మ్యాక్సిమైజర్)లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఏడాదికి రూ.10,000 ప్రీమియం చొప్పున ఎనిమిది సంవత్సరాల పాటు మొత్తం రూ.80,000  చెల్లించాను. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ విలువ రూ.1,42,000గా ఉంది. ఇప్పుడు ఈ పాలసీని సరెండర్ చేయాలనుకుంటున్నాను. ఈ వచ్చిన మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లోనూ, ఎంపిక చేసిన షేర్లలోనూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా? ఈ పాలసీని సరెండర్ చేస్తే టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుందా? వివరించగలరు.
 -జబ్బార్, వరంగల్

 
 బీమా, పెట్టుబడులకు ఒకే పాలసీని తీసుకోవడం సరికాదని ఎప్పటి నుంచో చెపుతూనే ఉన్నాము. మీరు ఈ పాలసీని సరెండర్ చేసి, ఆ వచ్చిన మొత్తాన్ని ఏదైనా డైవర్సిఫైడ్ ఈక్విటీ, లేదా బ్యాలెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీ పాలసీ ఐదేళ్లు దాటింది కాబట్టి, మీరు ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన పని లేదు. ఇక ఈ పాలసీని సరెండర్ చేస్తే మీరు టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.

 నేను గత ఏడాది మేలో డీఎస్‌పీ బ్లాక్‌రాక్ ఎఫ్‌ఎంపీ సిరీస్154లో రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. ఇది ఈ నెలలో మెచ్యూర్ అవుతోంది.  నేను పది శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్నాను. నేను ఎంత పన్ను చెల్లించాల్సి ఉం టుంది? దీనిని మరికొంత కాలం పొడిగించుకోవచ్చా?
 -కుమార స్వామి, విజయవాడ

 
 మీరు ఈ ఫండ్‌లో పొందిన లాభాలపై 10 శాతం చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డెట్ ఫండ్స్ ద్వారా మూడేళ్లలోపు పొందిన రాబడులను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఒక క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్‌ను ఇన్వెస్టర్ పొడిగించడానికి వీలులేదు. మ్యూచువల్ ఫండ్ సంస్థ మాత్రమే ఫండ్ మెచ్యూరిటీని పొడిగించే వీలు ఉంది. అలా చేసినప్పుడు సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ మీకు సమాచారమిస్తుంది. అలాంటి సమాచారం మీకు అందితే, మీకు తక్షణం ఈ డబ్బులు అవసరం లేకపోతే, ఈ ప్లాన్‌ను ఎలాంటి అనుమానాలు లేకుండా పొడిగించుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement