difference of opinion
-
వరంగల్: కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. ఎవరికి వారే.. యమునా తీరే
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనాయకులు, నేతల తీరు మారడం లేదు. ‘ఎవరికీ వారే.. యమునా తీరే’లా ఉంది సీనియర్ల పరిస్థితి. టీపీసీసీ, క్రమశిక్షణ సంఘం దృష్టికి వెళ్లినా మార్పులేకపోగా.. రోజురోజుకూ వివాదాలు పెరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువై గొడవలకు దారి తీస్తోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మొదలైన పరస్పర బహిష్కరణల ప్రకటనల పర్వం ఇప్పుడు జనగామ నియోజకవర్గం వరకు పాకింది. సుమారు తొమ్మిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటున్నా.. పార్టీ కార్యక్రమాలపై సరిగా దృష్టి సారించని కొందరు.. అధిష్టానం సూచనలు, నిర్ణయాలను పెడచెవిన పెడుతున్నారు. వారిని కట్టడి చేయడంలో అధిష్టానం సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత విబేధాలు తారస్థాయికి చేరుతున్నాయి. కాంగ్రెస్‌లో హీటెక్కిన పాలిటిక్స్.. ● ములుగు నియోజకవర్గం మినహా మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రూపు విబేధాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. వర్ధన్నపేటలో నమిండ్ల శ్రీనివాస్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తుండగా పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యలు దృష్టి పెట్టినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. ● స్టేషన్‌ఘన్‌పూర్ విషయానికి వస్తే గతంలో అక్కడ పోటీ చేసిన సింగాపురం ఇందిర టికెట్ ఆశిస్తుండగా, దొమ్మాటి సాంబయ్య, సిరిసిల్ల రాజయ్యల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ● పరకాల, భూపాలపల్లిలనుంచి ఇనుగాల వెంకట్రాంరెడ్డి, గండ్ర సత్యనారాయణరావుల పేర్లుండగా. రెండో టికెట్ కోసం పరకాలపై కొండా సురేఖ దంపతులు చేస్తున్న ప్రయత్నాలు ఆగలేదన్న చర్చ ఉంది. దీంతో పరకాలలో ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కొండా సురేఖ దంపతుల మధ్య గ్రూపుల వైరం సాగుతూనే ఉంది. ● మహబూబాబాద్ నుంచి మురళీనాయక్, బెల్లయ్యనాయక్, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్‌లు, డోర్నకల్ నుంచి రాంచంద్రనాయక్, నెహ్రునాయక్లు పోటాపోటీగా అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం. ● పాలకుర్తి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడక్కడ ససేమిరా అంటున్న జంగా రాఘవరెడ్డి.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ దాదాపుగా నాయిని రాజేందర్‌రెడ్డి ఖరారైనట్లేనన్న ప్రచారం జరుగుతున్నా తాను సైతం పోటీలో ఉంటానంటున్నారు. ● వరంగల్ తూర్పు, నర్సంపేటల నుంచి కొండా సురేఖ, దొంతి మాధవరెడ్డిల పేర్లుండగా, పాలకుర్తిలో ఎవరన్నది ఇంకా తేలడం లేదు. కొనసాగుతున్న బహిష్కరణల పర్వం.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డిల నడుమ వైరం మొదలైంది. చినికి చినికి గాలివానగా మారిన రాజకీయవైరం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లింది. చివరకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డిని పార్టీనుంచి తొలగిస్తూ అధిష్టానానికి లేఖ రాశారు. ఆ మరుసటి రోజే పోటీగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రాఘవరెడ్డి తనను బహిష్కరించే అధికారం నాయినికి లేదని కౌంటర్ ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్ర సమయంలో ఈ వివాదం చోటుచేసుకోగా ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌మార్చ్ సందర్భంగా పునరావృతం కాలేదు. దీంతో పరిస్థితి చక్కబడిందని భావిస్తున్న సమయంలో జనగామ కాంగ్రెస్‌లో కయ్యం మొదలైంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డిల వర్గాల మధ్య విభేధాలు తారస్థాయికి చేరాయి. కొమ్మూరి ప్రతాపరెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జనగామ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరిట ప్రకటన చేశారు. దీని వెనుక పొన్నాల లక్ష్మయ్య హస్తం ఉందని, అసలు డీసీసీ వర్కింగ్ కమిటే లేనప్పుడు సస్పెండ్ చేసే అధికారం ఎక్కడిదంటున్న కొమ్మూరి వర్గీయులు మరో ప్రెస్మీట్లో కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాపరెడ్డిలు పోటాపోటీగా మీడియా సమావేశాల్లో ఘాటైన వ్యాఖ్యలు చేసుకున్నారు. శుక్రవారం జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అబ్దుల్‌నాగారంలో భట్టి విక్రమార్క పాదయాత్రకు స్వాగతం పలికే సందర్భంగా ఇద్దరు నాయకులు, వారి అనుచరుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా పోలీసులు చెదరగొట్టారు. -
ములుగు జాతీయ రహదారి పనుల్లో ఫారెస్ట్ X రెవెన్యూ
ములుగు: జాతీయ రహదారి విస్తరణ పనుల్లో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు పొంతన కుదరడం లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. ఆరెపల్లి నుంచి ములుగు మండలం గట్టమ్మ ఆలయం వరకు రోడ్డు విస్తరణకు అనుమతులు రావడంతో సంబంధిత శాఖ టెండర్ పిలిచి పనులు చేపట్టింది. ములుగు మండల పరిధిలోని మహ్మద్‌గౌస్ పల్లి నుంచి మల్లంపల్లి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కెనాల్ వరకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. జాకారం ఫారెస్ట్ కంపార్ట్మెంట్ 598, 599, 680 పరిధిలోని కెనాల్ నుంచి జాకారం సాంఘీక సంక్షేమ గురుకులం పక్కన ఉన్న నాగిరెడ్డికుంట వరకు, గట్టమ్మ ఆలయం నుంచి పానేస కాల్వ వరకు పనులు నిలిచిపోయాయి. ఈ భూమి మాదంటే మాది అంటూ అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు భీష్మించుకుని కూర్చోవడంతో సమస్య ఉత్పన్నం అయ్యింది. వేరే దగ్గర భూమి ఇవ్వాలని.. వాస్తవానికి కెనాల్ నుంచి ఇరువైపులా ఉన్న భూమి అన్యాక్రాంతం కాకుండా కొన్ని సంవత్సరాలుగా అటవీ శాఖ సంరక్షించుకుంటూ వస్తోంది. ఎన్‌హెచ్ రోడ్డు పక్కన విలువైన టేకు, కొడిశ, నల్లమద్ది, ఏరుమద్ది, బిలుగు, సండ్ర, గుల్మోహర్, సిస్సు, నెమలినార, నారేప, చిందుగ వంటి చెట్లను ఇతరులు కొట్టకుండా ఈ ప్రదేశం చుట్టూ ట్రెంచ్ వేసింది. అయితే ఇప్పుడు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 53/2, 53/19 భూమి రెవెన్యూకు సంబంధించిన ఆస్తి అని పంచాయతీని మొదటికి తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఇరు శాఖల అధికారులు తమతమ దగ్గర ఉన్న ఆధారాలతో పలుమార్లు చర్చలు జరిపారు. అయినా విషయం కొలిక్కి రాలేదు. జాతీయ రహదారి పక్కన ఉన్న భూమి మా దేనని, ఒక వేళ విస్తరణకు భూమిని తీసుకుంటే ఇరువైపులా 12.5 మీటర్ల చొప్పున 11.34 ఎకరాల భూమిని మరోచోట అప్పగించాలని అటవీ శాఖ ప్రపోజల్ పెట్టింది. అయితే దీనికి రెవెన్యూ శాఖ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉన్న చెట్లను కొట్టేసే క్రమంలో కాంపన్స్ట్రేషనరీ ఎఫారెస్ట్రేషన్ కింద రూ.16 లక్షలు చెల్లించాలని పెట్టిన ప్రపోజల్స్‌కు సైతం ససేమీరా ఒప్పుకోకపోవడంతో అప్పటి డీఎఫ్ఓ కిష్టాగౌడ్ పలుమార్లు పనులకు అడ్డుతగిలినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో డీఎఫ్‌ఓపై ఫిర్యాదులు అందాయని, ఆయన బదిలీకి ఇది ఒక కారణమని తెలుస్తుంది. గతంలోనూ అంతే.. సమీకృత కలెక్టరేట్ కార్యాలయ పనుల్లో భాగంగా స్థల సేకరణ సమయంలో రెవెన్యూ–అటవీ అధికారులకు భూమి హద్దుల విషయంలో ఇదే విధంగా జరిగింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేపట్టడం అటవీ అధికారులు అడ్డుకోవడం పలుమార్లు జరిగింది. దీంతో అటవీ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్, అధికారులపై ఎఫ్‌సీ–1980 చట్టం కింద కేసు పెట్టారు. ప్రస్తుతం అది కొనసాగుతోంది. ఎన్‌హెచ్ అధికారులకు నోటీసులు ఎన్‌హెచ్ విస్తరణ విషయం లోలోపల చిలికిచిలికి గాలివానగా మారుతుందని ఇరుశాఖల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులతో ఇటు పీసీసీఎఫ్, అటు సీఎస్‌కు ఫైల్స్ అందాయని సమాచారం. దీంతో స్పందించిన పీసీసీఎఫ్ నేషనల్ హైవే వరంగల్ డివిజన్ అధికారులకు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్(ఎఫ్‌సీ)–1980 ప్రకారం నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు నేషనల్ హైవే ఇరువైపులా చెట్లకు సంబంధించిన సర్వే చేపట్టకూడదని సిరికల్చర్, హార్టికల్చర్ అధికారులకు ఎఫ్‌సీ యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చింది. అయినా అధికారులు చెట్లకు నంబరింగ్ ఇస్తున్నట్లుగా అటవీ అధికారవర్గాలు చెబుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడితే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని అటవీ అధికారులు పట్టుపట్టి కూర్చున్నారు. ఈ విషయంలో ఇరుశాఖల రాష్ట్రస్థాయి అధికారులు రాజీకి వస్తే తప్పా కెనాల్ నుంచి నాగిరెడ్డి కుంట వరకు, డీబీఎం–38 కెనాల్(పానేసా కాల్వ) నుంచి గట్టమ్మ మధ్యలో విస్తరణ పనులు జరిగేలా కనిపించడం లేదు. -
క్లిప్పింగులు ఎలా వచ్చాయో తెలీదు: కోడెల
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల వీడియో క్లిప్పింగ్‌లు బయటకు ఎలా వచ్చాయో తనకు తెలియదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. అవి సోషల్ మీడియాకు అందడం దురదృష్టకరమని, దానిపై విచారణకు ఆదేశిస్తున్నానని స్పీకర్ తెలిపారు. గురువారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజా సస్పెన్షన్‌తో పాటు పలు అంశాల గురించి వివరించారు. శాసనసభ సమావేశాల కార్యక్రమాలకు సంబంధించిన ఎలాంటి వివరాలు (సీడీలు, స్క్రిప్ట్) బయటకు ఇవ్వొద్దని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించానని, కానీ అవి బహిర్గతం కావటంతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయని అన్నారు. దీనిపై తాను విచారణ ప్రారంభించగా, మూడు నాలుగు రకాల వాదనలు వినిపించాయని చెప్పారు. సభ నుంచి బయటకు సీడీల రూపంలో బహిర్గతమై ఉండాలి లేదంటే ఫోను, ఐ ప్యాడ్లలలో రికార్డు చేసి ఎవరైనా బహిర్గతం చేసి ఉండాలన్నారు. శాసనసభ కార్యకలాపాలకు సంబంధించిన సీడీలు తాను అన్ని పార్టీల వారికి ఇచ్చానని, అయితే అవి రహస్యమా.. బహిర్గతమా అని మాత్రం ఎవరికీ చెప్పలేదన్నారు. తాను అందించిన సీడీలను ఆ తర్వాత వారు ఏం చేసుకున్నారో తెలియదన్నారు. రోజా సస్పెన్షన్‌పై భిన్నాభిప్రాయాలు... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని ప్రభుత్వం తీర్మానించిందని, ఆ నిర్ణయంపై వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయన్నారు. రోజాను ఏడాది పాటు బహిష్కరించడం అనేది ఎక్కువ సమయమా, తక్కువ సమయమా అన్నది ఇంకా తేలాల్సి ఉందన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడం వల్లే వారిని సభ నుంచి సస్పెండ్ చేశామన్నారు. సభలో జరిగిన పరిణామాలు తనను ఎంతో ఆవేదనకు గురి చేశాయని, తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దృశ్యాలు ఎపుడూ చూడలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఒక కమిటీ వేస్తున్నానని, దీనికి డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ చైర్మన్‌గా, మూడు పార్టీల నుంచి ముగ్గు రు సభ్యులు ఉంటారని చెప్పారు. ఈ కమిటీ వచ్చే సమావేశాలలోగా ప్రివిలేజ్ కమిటీకి నివేదిక సమర్పిస్తుందన్నారు. ప్రివిలేజ్ కమిటీ చర్చించి సభకు నివేదిస్తుందని, తదుపరి నిర్ణయాలు ఉంటాయన్నారు. అధికారపార్టీవారు కూడా దూషించినట్లు ప్రతిపక్ష వైఎస్సార్‌కాం గ్రెస్ సభ్యులు అంటున్నారని, ఆధారాలు సమర్పిస్తే వారిపైనా చర్య తీసుకుంటానన్నారు. అవిశ్వాసం సభ్యుల హక్కు... తనపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన అవిశ్వాసం నోటీసుపై స్పందిస్తూ సభలోని సభ్యులకు అవిశ్వాసం నోటీసు ఇచ్చే హక్కు ఉందన్నారు. అవిశ్వాసం నోటీసుపై ఏం చేయాలన్న దానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయని, వాటి ప్రకారం నడుచుకుంటామన్నారు. గత సమావేశాల్లో కొందరు సభ్యుల సస్పెన్షన్‌కు ప్రభుత్వం ప్రతిపాదించినా ఆ సభ్యుల వివరణ ఆధారంగా దాన్ని ఉపసంహరించుకున్నానని చెప్పారు. రోజాను సస్పెండ్ చేసిన తరువాత ఆ చర్యను ఉపసంహరించుకోవాల్సిందిగా తనను కలిసి ఆమె కోరారని చెప్పారు. వైఎస్సార్సీపీ ఇదే అంశంపై తనకు రాసిన లేఖలో రోజాపై సస్పెన్షన్ వ్యవహారంలో తప్పు అంతా తనదేనని పేర్కొన్నారని, ఈ పరిస్థితుల్లో ఎలా స్పందించాలని ప్రశ్నించారు.