సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనాయకులు, నేతల తీరు మారడం లేదు. ‘ఎవరికీ వారే.. యమునా తీరే’లా ఉంది సీనియర్ల పరిస్థితి. టీపీసీసీ, క్రమశిక్షణ సంఘం దృష్టికి వెళ్లినా మార్పులేకపోగా.. రోజురోజుకూ వివాదాలు పెరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు ముదిరి పాకాన పడుతున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువై గొడవలకు దారి తీస్తోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మొదలైన పరస్పర బహిష్కరణల ప్రకటనల పర్వం ఇప్పుడు జనగామ నియోజకవర్గం వరకు పాకింది. సుమారు తొమ్మిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటున్నా.. పార్టీ కార్యక్రమాలపై సరిగా దృష్టి సారించని కొందరు.. అధిష్టానం సూచనలు, నిర్ణయాలను పెడచెవిన పెడుతున్నారు. వారిని కట్టడి చేయడంలో అధిష్టానం సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత విబేధాలు తారస్థాయికి చేరుతున్నాయి.
కాంగ్రెస్‌లో హీటెక్కిన పాలిటిక్స్..
● ములుగు నియోజకవర్గం మినహా మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రూపు విబేధాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. వర్ధన్నపేటలో నమిండ్ల శ్రీనివాస్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తుండగా పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యలు దృష్టి పెట్టినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది.
● స్టేషన్‌ఘన్‌పూర్ విషయానికి వస్తే గతంలో అక్కడ పోటీ చేసిన సింగాపురం ఇందిర టికెట్ ఆశిస్తుండగా, దొమ్మాటి సాంబయ్య, సిరిసిల్ల రాజయ్యల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
● పరకాల, భూపాలపల్లిలనుంచి ఇనుగాల వెంకట్రాంరెడ్డి, గండ్ర సత్యనారాయణరావుల పేర్లుండగా. రెండో టికెట్ కోసం పరకాలపై కొండా సురేఖ దంపతులు చేస్తున్న ప్రయత్నాలు ఆగలేదన్న చర్చ ఉంది. దీంతో పరకాలలో ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కొండా సురేఖ దంపతుల మధ్య గ్రూపుల వైరం సాగుతూనే ఉంది.
● మహబూబాబాద్ నుంచి మురళీనాయక్, బెల్లయ్యనాయక్, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్‌లు, డోర్నకల్ నుంచి రాంచంద్రనాయక్, నెహ్రునాయక్‌లు పోటాపోటీగా అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం.
● పాలకుర్తి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడక్కడ ససేమిరా అంటున్న జంగా రాఘవరెడ్డి.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ దాదాపుగా నాయిని రాజేందర్‌రెడ్డి ఖరారైనట్లేనన్న ప్రచారం జరుగుతున్నా తాను సైతం పోటీలో ఉంటానంటున్నారు.
● వరంగల్ తూర్పు, నర్సంపేటల నుంచి కొండా సురేఖ, దొంతి మాధవరెడ్డిల పేర్లుండగా, పాలకుర్తిలో ఎవరన్నది ఇంకా తేలడం లేదు.
కొనసాగుతున్న బహిష్కరణల పర్వం..
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డిల నడుమ వైరం మొదలైంది. చినికి చినికి గాలివానగా మారిన రాజకీయవైరం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లింది. చివరకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డిని పార్టీనుంచి తొలగిస్తూ అధిష్టానానికి లేఖ రాశారు.
ఆ మరుసటి రోజే పోటీగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రాఘవరెడ్డి తనను బహిష్కరించే అధికారం నాయినికి లేదని కౌంటర్ ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్ర సమయంలో ఈ వివాదం చోటుచేసుకోగా ఇటీవల సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌మార్చ్ సందర్భంగా పునరావృతం కాలేదు. దీంతో పరిస్థితి చక్కబడిందని భావిస్తున్న సమయంలో జనగామ కాంగ్రెస్‌లో కయ్యం మొదలైంది.
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డిల వర్గాల మధ్య విభేధాలు తారస్థాయికి చేరాయి. కొమ్మూరి ప్రతాపరెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జనగామ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరిట ప్రకటన చేశారు.
దీని వెనుక పొన్నాల లక్ష్మయ్య హస్తం ఉందని, అసలు డీసీసీ వర్కింగ్ కమిటే లేనప్పుడు సస్పెండ్ చేసే అధికారం ఎక్కడిదంటున్న కొమ్మూరి వర్గీయులు మరో ప్రెస్‌మీట్‌లో కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాపరెడ్డిలు పోటాపోటీగా మీడియా సమావేశాల్లో ఘాటైన వ్యాఖ్యలు చేసుకున్నారు. శుక్రవారం జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అబ్దుల్‌నాగారంలో భట్టి విక్రమార్క పాదయాత్రకు స్వాగతం పలికే సందర్భంగా ఇద్దరు నాయకులు, వారి అనుచరుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా పోలీసులు చెదరగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment