
వరి పంటలో తెల్లకంకి
ఖానాపురం: అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతుల కష్టాన్ని వడగళ్ల వాన గద్దలా తన్నుకుపోయింది. మరో 20 రోజుల్లో పంట చేతికి అందుతుందనుకున్న రైతుల ఆశలపై నీళ్లుచల్లింది. వరి పంట తెల్లకంకి రూపంలో దర్శనమిస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పాకాల ఆయకట్టు ధాన్యాగార కేంద్రంగా గుర్తింపు పొందింది. అధికారికంగా, అనధికారికంగా 30 వేల ఎకరాల్లో వరి పంటలు సాగయ్యాయి. పుష్కలంగా నీటి వసతి ఉండడంతో రైతులు సంతోషపడ్డారు. చేతిలో ఉన్న డబ్బుతో పాటు బ్యాంకులు, తెలిసిన వారి వద్ద అప్పులు తెచ్చి మరీ సాగు చేశారు. ఇటీవల వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో సుంకంతా రాలిపోయి తెల్లకంకిగా మారిపోయింది. వడగళ్ల వానతో పంటలు సైతం నేలవాలాయి. ధాన్యం రాలిపోయింది. పాకాల ఆయకట్టు కింద సుమారు ఐదువేల ఎకరాల వరకు వరిపంట తెల్ల కంకిగా మారి కోలుకోలేని నష్టాన్ని మిగిల్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు వాపోతున్నారు.
వాతావరణంలో మార్పులే కారణం
పాకాల ఆయకట్టు రైతులకు తీవ్ర నష్టం