క్లిప్పింగులు ఎలా వచ్చాయో తెలీదు: కోడెల
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల వీడియో క్లిప్పింగ్‌లు బయటకు ఎలా వచ్చాయో తనకు తెలియదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. అవి సోషల్ మీడియాకు అందడం దురదృష్టకరమని, దానిపై విచారణకు ఆదేశిస్తున్నానని స్పీకర్ తెలిపారు. గురువారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజా సస్పెన్షన్‌తో పాటు పలు అంశాల గురించి వివరించారు. శాసనసభ సమావేశాల కార్యక్రమాలకు సంబంధించిన ఎలాంటి వివరాలు (సీడీలు, స్క్రిప్ట్) బయటకు ఇవ్వొద్దని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించానని, కానీ అవి బహిర్గతం కావటంతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయని అన్నారు.
దీనిపై తాను విచారణ ప్రారంభించగా, మూడు నాలుగు రకాల వాదనలు వినిపించాయని చెప్పారు. సభ నుంచి బయటకు సీడీల రూపంలో బహిర్గతమై ఉండాలి లేదంటే ఫోను, ఐ ప్యాడ్లలలో రికార్డు చేసి ఎవరైనా బహిర్గతం చేసి ఉండాలన్నారు. శాసనసభ కార్యకలాపాలకు సంబంధించిన సీడీలు తాను అన్ని పార్టీల వారికి ఇచ్చానని, అయితే అవి రహస్యమా.. బహిర్గతమా అని మాత్రం ఎవరికీ చెప్పలేదన్నారు. తాను అందించిన సీడీలను ఆ తర్వాత వారు ఏం చేసుకున్నారో తెలియదన్నారు.
రోజా సస్పెన్షన్‌పై భిన్నాభిప్రాయాలు...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని ప్రభుత్వం తీర్మానించిందని, ఆ నిర్ణయంపై వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయన్నారు. రోజాను ఏడాది పాటు బహిష్కరించడం అనేది ఎక్కువ సమయమా, తక్కువ సమయమా అన్నది ఇంకా తేలాల్సి ఉందన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడం వల్లే వారిని సభ నుంచి సస్పెండ్ చేశామన్నారు. సభలో జరిగిన పరిణామాలు తనను ఎంతో ఆవేదనకు గురి చేశాయని, తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దృశ్యాలు ఎపుడూ చూడలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఒక కమిటీ వేస్తున్నానని, దీనికి డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ చైర్మన్‌గా, మూడు పార్టీల నుంచి ముగ్గు రు సభ్యులు ఉంటారని చెప్పారు.
ఈ కమిటీ వచ్చే సమావేశాలలోగా ప్రివిలేజ్ కమిటీకి నివేదిక సమర్పిస్తుందన్నారు. ప్రివిలేజ్ కమిటీ చర్చించి సభకు నివేదిస్తుందని, తదుపరి నిర్ణయాలు ఉంటాయన్నారు. అధికారపార్టీవారు కూడా దూషించినట్లు ప్రతిపక్ష వైఎస్సార్‌కాం గ్రెస్ సభ్యులు అంటున్నారని, ఆధారాలు సమర్పిస్తే వారిపైనా చర్య తీసుకుంటానన్నారు.
అవిశ్వాసం సభ్యుల హక్కు...
తనపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన అవిశ్వాసం నోటీసుపై స్పందిస్తూ సభలోని సభ్యులకు అవిశ్వాసం నోటీసు ఇచ్చే హక్కు ఉందన్నారు. అవిశ్వాసం నోటీసుపై ఏం చేయాలన్న దానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయని, వాటి ప్రకారం నడుచుకుంటామన్నారు. గత సమావేశాల్లో కొందరు సభ్యుల సస్పెన్షన్‌కు ప్రభుత్వం ప్రతిపాదించినా ఆ సభ్యుల వివరణ ఆధారంగా దాన్ని ఉపసంహరించుకున్నానని చెప్పారు.
రోజాను సస్పెండ్ చేసిన తరువాత ఆ చర్యను ఉపసంహరించుకోవాల్సిందిగా తనను కలిసి ఆమె కోరారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఇదే అంశంపై తనకు రాసిన లేఖలో రోజాపై సస్పెన్షన్ వ్యవహారంలో తప్పు అంతా తనదేనని పేర్కొన్నారని, ఈ పరిస్థితుల్లో ఎలా స్పందించాలని ప్రశ్నించారు.