
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వ్యతిరేకంగా అఖిలపక్ష నేతలు ఉద్యమానికి సిద్దమయ్యారు. ఇందుకోసం బుధవారం సత్తెనపల్లి సీపీఎం కార్యాలయంలో కోడెల పాలనకు వ్యతిరేకంగా అఖిలపక్ష నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, కాంగ్రెస్, లోక్‌సత్తా, ప్రజా సంఘాలు, దళిత, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ తరఫున పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు ఇందులో పాల్గొన్నారు. ఈ నెల 15న కోడెల పాలనకు వ్యతిరేకంగా సత్తెనపల్లి తాలుకా సెంటర్‌లో నిరసన తెలపాలని అఖిలపక్ష నేతలు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. సత్తెనపల్లిలో కోడెల ఆటవిక పాలన కొనసాగుతుందని ఆరోపించారు. సత్తెనపల్లిలో ప్యాక్షన్ రాజకీయాలకు కోడెల తెరతీసారని మండిపడ్డారు. కోడెలకు వ్యతిరేకంగా ఈ నెల 15న అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నట్టు వెల్లడించారు. కోడెల, ఆయన కుటుంబం చేసిన అక్రమాలకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలతో కలిసి సమిష్టిగా పోరాడతమని తెలిపారు. కాగా, స్పీకర్ స్థానంలో ఉన్న కోడెల రాజకీయ ఉపన్యాసం చేయడం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment