digital bill payment
-
ఇకపై చిన్న ఆసుపత్రుల్లోనూ క్యాష్‌లెస్ వైద్యం
ముంబై: ఆరోగ్య బీమా పాలసీదారులు త్వరలోనే అన్ని రకాల ఆస్పత్రుల్లోనూ నగదు రహిత వైద్యం పొందే దిశగా అడుగులు పడుతున్నాయి. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఇందుకు సంబంధించి ‘క్యాష్‌లెస్ ఎవ్రీవేర్’ కార్యక్రమాన్ని ప్రకటించింది. జాబితాలో లేని హాస్పిటళ్లలోనూ పాలసీదారులకు నగదు రహిత వైద్యాన్ని అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని తెలిపింది. కనీసం 15 పడకలు ఉండి, ఆయా రాష్ట్రాల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్టర్ అయినవి నగదు రహిత వైద్యాన్ని ఆఫర్ చేయవచ్చు. దీంతో పాలసీదారులు ఆస్పత్రిలో చేరాల్సి వస్తే తమ పాకెట్ నుంచి ఎలాంటి చెల్లింపులు చేయక్కర్లేదు. చికిత్సల వ్యయాలను బీమా కంపెనీలు చెల్లిస్తాయి. క్లెయిమ్ అనుమతించడంపై చెల్లింపులు ఆధారపడి ఉంటాయని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ పేర్కొంది. కొన్ని షరతులకు లోబడి పాలసీదారులు నగదు రహిత వైద్యం కోసం ఏ ఆస్పత్రిని అయినా ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. నాన్ ఎంపానెల్డ్ (బీమా సంస్థ జాబితాలో లేని) హాస్పిటల్లో చేరడానికి 48 గంటల ముందు లేదా, చేరిన 48 గంటల్లోపు బీమా సంస్థకు తెలిజేయాల్సి ఉంటుందని పేర్కొంది. బీమా సంస్థ నెట్‌వర్క్‌లో లేని ఆస్పత్రుల్లో చికిత్స పొందినప్పుడు పాలసీదారులపై భారం పడకుండా చూడడమే దీని ఉద్దేశ్యమని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ చైర్మన్ తపన్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40వేల ఆస్పత్రుల్లోనే నగదు రహిత వైద్యం పాలసీదారులకు అందుబాటులో ఉండడం గమనార్హం. -
త్వరలో రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ ప్లాట్‌ఫాంకు లింక్
ముంబై: దేశీయంగా మూడో వంతు జనాభా డిజిటల్ చెల్లింపులకు మళ్లితేనే నగదు వినియోగం తగ్గుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఎండీ, సీఈవో దిలీప్ అస్బే తెలిపారు. ప్రస్తుతం ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) వంటి సర్వీసులను జనాభాలో దాదాపు అయిదో వంతు ప్రజలే వినియోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే తీరు కొనసాగితే చలామణీలో ఉన్న నగదు పరిమాణం చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గడానికి 12–18 నెలలు పట్టొచ్చని దిలీప్ చెప్పారు. కొన్నాళ్లుగా ఇటు డిజిటల్ చెల్లింపులు అటు చలామణీలో ఉన్న నగదు (సీఐసీ) పరిమాణం ఒకే తరహాలో పెరుగుతుండటం ఒక పజిల్‌గా మారిన నేపథ్యంలో దిలీప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో 2016లో స్థూల దేశీయోత్పత్తిలో సీఐసీ 12 శాతంగా ఉండగా .. ప్రస్తుతం ఇది 14 శాతానికి పెరిగింది. సంపన్న దేశాల్లో ఇది సింగిల్ డిజిట్ స్థాయిలోనే ఉంటోంది. దేశీయంగా చిత్రమైన పరిస్థితి నెలకొనడంపై దిలీప్ వివరణ ఇచ్చారు. నగదు బదిలీ స్కీముల వంటి పథకాల సొమ్ము నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమ అవుతున్నప్పటికీ వారు డిజిటల్ చెల్లింపులను ఎంచుకోకుండా .. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకుని వాడుకుంటుండటం కూడా సీఐసీ పెరగడానికి ఒక కారణమని ఆయన తెలిపారు. మరోవైపు, భవిష్యత్తులో భారతీయులు రోజుకు వంద కోట్ల పైగా డిజిటల్ చెల్లింపు లావాదేవీలు నిర్వహిస్తారని దిలీప్ చెప్పారు. మరికొద్ది నెలల్లో రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ ప్లాట్‌ఫాంనకు అనుసంధానించనున్నట్లు వివరించారు. దీనిపై ఎస్బీఐ కార్డ్స్, బీవోబీ కార్డ్స్, యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ మొదలైన వాటితో చర్చలు జరుగుతున్నాయన్నారు. -
రేషన్ దుకాణాల్లో డిజిటల్ సేవలు
దురాజ్‌పల్లి (సూర్యాపేట) : బియ్యం, కిరోసిన్, సరుకుల పంపిణీకి పరిమితమైన రేషన్ దుకాణాల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజల అవసరాలను తీర్చే ఈ–సేవ కేంద్రాలుగా రేషన్ దుకాణాలు అవతరించనున్నాయి. నిత్యావసర సరుకులతోపాటు సాంకేతిక సేవలను అందించేందుకు డీలర్లను, డిజిటల్æ లావాదేవీలను వినియోగదారులకు అలవాటు చేసేందుకు ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. టీ–వ్యాలెట్æ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు పౌర సరఫరాల అధికారులకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. సేవల కేంద్రంగా.. రేషన్ దుకాణం ఇక సేవల కేంద్రంగా మారబోతుంది. కేవలం రేషన్ బియ్యమే కాకుండా ప్రజల అవసరాలు తీర్చే ఈ–సేవ కేంద్రాలుగా మారబోతున్నాయి. జిల్లాలో 609 రేషన్ దుకాణాల పరిధిలో 3,15,443 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరికి ఈ–పాస్ విధానం ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారు. నూతన విధానం అమల్లోకి వచ్చాక ప్రభుత్వానికి రూ.లక్షల విలువైన బియ్యం మిగులుతోంది. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకుల పంపిణీ జరుగుతోంది. ఆ తర్వాత డీలర్లకు ఎలాంటి పనిలేక ఉపాధి లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలోనే కమీషన్‌కు బదులుగా తమకు నెల వేతనం ఇచ్చి ఇతర సదుపాయాలతో అదనపు ఆదాయ మార్గాన్ని చూపాలని డీలర్లు ఆందోళన చేస్తూ వచ్చారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న డీలర్ల సాదకబాధకాలు గుర్తించిన ప్రభుత్వం, రేషన్ దుకాణాల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు చిన్న మొత్తం ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకులను, మీ–సేవ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై రేషన్ దుకాణానికి వెళితే చాలు, ఈ విధానం ద్వారా మొబైల్ రీచార్చ్, నగదు బదిలీ, విద్యుత్ బిల్లులు, ఇంటి పన్నులు, బస్సు టికెట్, సర్వీస్ చార్జీల చెల్లింపు సేవలు పొందవచ్చు. తద్వారా డీలర్లకు అదనపు ఆదాయంతో పాటు వినియోగదారులకుఆయా సేవలు మరింత చేరవయ్యే అవకాశం ఉంది. ఇప్పకే ఈ–పాస్ యంత్రాల్లో కార్డుదారుల ఆధార్ సంఖ్యను అనుసంధానించడంతో జిల్లాలో 3,15,443 కుటుంబాలకు రేషన్ దుకాణాల్లో ఈ–సేవ కేంద్రాల మాదిరిగా సేవలు అందనున్నాయి. శిక్షణకు ప్రణాళిక సిద్ధం సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ పెరిగి పోతుండటంతో అందుకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకొని డీలర్లకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందులో భాగంగా ఈ–పాస్ విధానానికి టీ–వ్యాలెట్‌ను అనుసంధానం చేయనున్నారు. జిల్లాలో 23 మండలాలు ఉండగా, ఈ పాస్ విధానంలో సరుకులు పంపిణీ చేస్తున్న డీలర్లు 609 మంది ఉన్నారు. వీరందరికీ టీ–వ్యాలెట్ ద్వారా కార్డుదారులకు ఎలాంటి సేవలు అందించవచ్చు. ఆ సేవలను ఎలా అందించాలి, అందుకు ఏం చేయాలన్న దానిపై శిక్షణ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అక్టోబర్ 15 నుంచి జిల్లాలోని రేషన్ డీలర్లకు శిక్షణ ఇవ్వడానికి పౌర సరఫరాల శాఖ షెడ్యూల్‌ను రూపొందించింది. దీంతోపాటు టీ–వ్యాలెట్ పరికరాలు అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక వ్యాలెట్ సేవలు అందుబాటులోకి రావచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. టీ– వ్యాలెట్ అమలులోకి వస్తే రేషన్ దుకాణాలు 30 రోజులు తెరిచి ఉండనున్నాయి. -
పంచాయితీల్లో డిజిటల్ లావాదేవీలు
సాక్షి, నల్లగొండ : గ్రామ పంచాయతీల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రజాప్రతినిధులు అయోమయానికి గురవుతున్నారు. చెక్ పవర్ వ్యవహారాన్ని తేల్చిన ప్రభుత్వం మరిన్ని సమస్యలను సృష్టించి పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీల్లో చేసిన పనులకు బిల్లులు తీసుకోవాలన్నా, నిధులు డ్రా చేసుకోవాలన్నా సర్పంచుల తల ప్రాణం తోకకు వచ్చేలా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీలో చేసిన పనులకు సంబంధించిన వివరాలన్నీ యాప్‌లోనే అప్లోడ్ చేయాలన్న నిబంధన పెట్టారు. అలా అప్లోడ్ చేశాకే ఆన్లైన్లోనే డిజిటల్ చెక్కులు పొందే విధంగా కొత్త పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో గ్రామ పంచాయతీలో ఎలాంటి పనిచేసినా ఆ పనికి సంబంధించి డబ్బులు డ్రా చేయాలంటే పెద్ద తతంగమే జరగాల్సి ఉంది. డిజిటల్ చెక్కు పొందేందుకు సర్పంచ్, ఉప సర్పంచులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం చెక్‌పవర్ ఇచ్చినా, డిజిటల్ యాప్ అందుబాటులోకి రాని కారణంగా డబ్బులు డ్రా చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 837 గ్రామ పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. సర్పంచులు ఆయా పంచాయతీల్లో కొలువుదీరారు. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో 7 గ్రామ పంచాయతీలకు అప్పట్లో ఎన్నికలు ఆలస్యంగా జరగడంతో పాత సర్పంచులే కొనసాగుతున్నారు. వీరికి వచ్చే ఏడాది జనవరి వరకు పదవీ కాలం ఉంది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పంచాయతీ నూతన చట్టం కారణంగా పంచాయతీల్లో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. సర్పంచులకు చెక్ పవర్ విషయంలోనే ఆచితూచి అడుగులు వేసింది. ఈ ఏడాది జనవరిలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. కాగా, ఆ తర్వాత నూతన పంచాయతీ పాలనపై సర్పంచులకు నాలుగు విడతల్లో జిల్లా వ్యాప్తంగా నెల రోజులపాటు శిక్షణ కూడా ఇచ్చారు. చెక్‌పవర్‌పై తర్జన భర్జనలు పంచాయతీ పాలనకు గాను తీసుకొచ్చిన నూతన పంచాయతీ చట్టం ప్రకారం జాయింట్ చెక్ పవర్ ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపై పెద్ద తతంగమే నడిచింది. జనవరిలో ఎన్నికలు పూర్తికాగా, ఫిబ్రవరిలో శిక్షణ కూడా నిర్వహించారు. గతంలో మాదిరిగా సర్పంచ్‌కి , కార్యదర్శికి చెక్‌పవర్ ఇవ్వాలా..? లేక సర్పంచ్, ఉప సర్పంచ్‌కి కలిపి ఇవ్వాలా అనే అంశంపై ప్రభుత్వం పలు విధాలుగా తర్జనభర్జనలు చేసింది. ఇక, 14వ ఆర్థిక సంఘం నిధులు గత పాలకవర్గాల హయాంలోనే మంజూరయ్యాయి. కాని ప్రభుత్వం ఫ్రీజింగ్పెట్టి నిలిపివేసింది. ఆ పాలకవర్గాలు ఆ నిధులను డ్రా చేయలేక పోయాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు సైతం తాము ఎన్నికై నాలుగు నెలలు గడిచినా, అందుబాటులో నిధులు ఉన్నా, చివరకు వేసవిలో అత్యవసర పనులకు కూడా నిధులు డ్రా చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. గ్రామంలో అత్యవసరమైన తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు వంటి వాటికి కొందరు సర్పంచ్‌లు అప్పులు చేసి, మరికొందరు సొంత డబ్బులు ఖర్చు చేశారు. నిధులు ఉన్నా, ప్రభుత్వం చెక్‌పవర్ విషయం తేల్చని కారణంగా అప్పులు చేసి పనులు చేయాల్సి వచ్చింది. గత నెల 22వ తేదీన తేలిన చెక్ పవర్ గత నెల 22వ తేదీన ప్రభుత్వం చెక్ పవర్ అంశాన్ని తేల్చేసింది. సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ ఇస్తూ గెజిట్ జారీ చేసింది. జిల్లా పంచాయతీ అధికారి జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలకు చెక్ పవర్‌పై ప్రొసీడింగ్స్‌ను ఈ నెల 3వ తేదీన ఇచ్చారు. వాటన్నింటినీ జిల్లా ట్రెజరీ కార్యాలయానికి పంపడంతో పాటు జిల్లాలోని 31 మండలాల ఎంపీడీఓలకు చెక్ పవర్ ప్రొసీడింగ్స్‌ను పంపించారు. చెక్ పవర్ వచ్చినా .. డిజిటల్ కిరికిరి ప్రభుత్వం ఎట్టకేలకు సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం యాప్‌ను నేటికీ విడుదల చేయలేదు. దీంతో చెక్ పవర్ వచ్చినా అది ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి ఆన్లైన్లో మీ–సేవా కేంద్రం నుంచి అప్లోడ్ చేయాలి. ప్రభుత్వం విడుదల చేసే ఆ యాప్‌ను డౌన్లోడ్ చేయాలి. అందులోకి వెళ్లి ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన కోడ్‌ను నమోదు చేయాలి. సంబంధిత పని వివరాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాలి. ఆ తర్వాత ఆ పనికి సంబంధించి ఎంబీ రికార్డు నంబర్‌ను నమోదు చేయాలి. ఆ పని ఎంత విలువైందో ఆ మొత్తాన్ని కూడా అందులో నమోదు చేయాలి. అప్పుడు ఆ అప్లికేషన్ పూర్తయినట్లవుతుంది. ఆ తర్వాత ఆన్లైన్లో సర్పంచ్, ఉపసర్పంచ్ సంతకాలతో కూడిన డిజిటల్ చెక్కు బయటికి వస్తుంది. ఆ చెక్ రాగానే సర్పంచ్, ఉప సర్పంచ్ సెల్‌ఫోన్ నంబర్లకు ఓటీపీ నంబర్ వెళ్తుంది. దాన్ని తీసుకొని డీటీఓ, ఎంపీడీఓల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఎంపీడీఓ వద్దకు వెళ్లి సర్పంచ్, ఉపసర్పంచ్లు మూడు మూడు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కాగితంపై ఎంపీడీఓ సర్పంచ్, ఉపసర్పంచ్ కలిసి వచ్చి తన ముందే సంతకాలు చేశారని ధ్రువీకరిస్తూ ఎస్టీఓకు లెటర్ పంపిస్తాడు. ఆ లెటర్ తీసుకొని ఎస్టీఓ వద్దకు వెళ్లాలి. ఎస్టీఓ సర్పంచ్, ఉపసర్పంచ్ సెల్‌లకు వచ్చిన ఓటీపీ నంబర్లను అడుగుతారు. ఎంపీడీఓ ఇచ్చిన లెటర్‌ను తీసుకొని దానిపై ఎస్టీఓ ముందు మళ్లీ సర్పంచ్, ఉపసర్పంచ్ ఇరువురూ రెండు చొప్పున సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు పూర్తి స్థాయిలో బిల్లుకోసం ప్రక్రియ పూర్తయినట్లు అవుతుంది. ఎస్టీఓ ఆ బిల్లును పాస్ చేస్తాడు. ప్రస్తుతం చెక్ పవర్ విషయంలో ఇప్పటికే డీపీఓ ఎస్టీఓ, ఎంపీడీఓలకు పంపిన ప్రొసీడింగ్ల ఆధారంగా అన్ని గ్రామాల్లోని సర్పంచ్, ఉప సర్పంచుల డిజిటల్ సంతకాలను తీసుకుంటున్నారు. ఆ సంతకాలే డిజిటల్ చెక్ మీద రానున్నాయి. మొత్తానికి ప్రభుత్వం ఓ పక్క చెక్‌పవర్ ఇచ్చినా, ఈ డిజిటల్ యాప్ రాని కారణంగా చెక్‌పవర్ ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డిజిటల్ విధానంతో సర్పంచులకు డబ్బుల డ్రా విషయంలో కిరికిరి తప్పేలా లేదు. చెక్ పవర్‌పై పునరాలోచన చేయాలి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ విషయంలో ప్రభుత్వం పునారాలోచన చేయాలి. ఉప సర్పంచ్‌కు బదులు కార్యదర్శిని భాగస్వాములను చేస్తే భయం ఉంటుంది. ఖర్చులు చేయడంలో సర్పంచ్‌కు ధైర్యం ఉంటుంది. ఇద్దరు ప్రజాప్రతినిధులకు చెక్‌పవర్ ఇవ్వడం వల్ల గ్రామాల్లో ఘర్షణలు, పంచాయితీలు ఎక్కువవుతాయి. ఈ విషయంలో సర్కార్ పునరాలోచన చేయాలి. – పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, సర్పంచ్, నకిరేకల్ చెక్ పవర్లేక అప్పుల పాలయ్యాను మునుగోడు: ఆరు నెలల క్రితం సర్పంచ్‌గా ఎన్నికైన నేను ప్రజలకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటుకు అప్పులు తెచ్చా ను. దాదాపు రూ. 20 లక్షలకు పైగా అప్పు చేశా. సాధ్యమైనంత త్వరగా చెక్ పవర్ అంది స్తే బాగుండు. పేరుకు సర్పంచ్లమైనా ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో ప్రజలతో ఇబ్బందులు పడుతున్నాం. – మిర్యాల వెంకన్న, సర్పంచ్, మునుగోడు -
ఆర్టీజీఎస్, నెఫ్ట్ చార్జీల రద్దు
ముంబై: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్టీజీఎస్, నెఫ్ట్‌పై చార్జీలను ఎత్తివేయాలంటూ నందన్ నీలేకని ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆర్బీఐ అమలుపరిచింది. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ (నెఫ్ట్) ద్వారా చేసే నగదు బదిలీలపై చార్జీలను తొలగిస్తూ, బ్యాంకులు సైతం కస్టమర్లకు దీన్ని బదలాయించాలని కోరింది. రూ.2 లక్షల వరకు నిధుల బదిలీకి నెఫ్ట్‌ను వినియోగిస్తుండగా, రూ.2 లక్షలకు పైన విలువైన లావాదేవీలకు ఆర్టీజీఎస్ వినియోగంలో ఉంది. దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ నెఫ్ట్ లావాదేవీలపై రూ.1–5 వరకు, ఆర్టీజీఎస్‌పై రూ.5–50 వరకు చార్జ్ చేస్తోంది. డిజిటల్ రూపంలో నిధుల బదిలీకి ప్రోత్సాహం ఇచ్చేందుకు చార్జీలను ఎత్తివేయాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ పేర్కొంది. వాస్తవానికి ఆర్టీజీఎస్, నెఫ్ట్‌లపై చార్జీలను ఎత్తివేయడమే కాకుండా, రోజులో 24 గంటల పాటు ఈ సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, దిగుమతి చేసుకునే పీవోఎస్ మెషిన్లపై సుంకాలు ఎత్తివేయాలని, ఇలా ఎన్నో సూచనీలను నీలేకని కమిటీ సిఫారసు చేసింది. కానీ, ఇతర అంశాలపై ఆర్బీఐ స్పందించినట్టు లేదు. ఏటీఎం చార్జీల సమీక్షపై కమిటీ ఏటీఎంల వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో వీటి లావాదేవీల చార్జీలను సమీక్షించాలన్న బ్యాంకుల వినతులను మన్నిస్తూ ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీఈవో చైర్మన్‌గా, భాగస్వాములు అందరితో కలసి ఈ కమిటీ ఉంటుందని తెలిపింది. తొలిసారి భేటీ అయిన తేదీ నుంచి రెండు నెలల్లోపు ఈ కమిటీ నివేదికను సమర్పించాల్సిన ఉంటుందని పేర్కొంది. -
డిజిటల్ బిల్లు పేమెంట్లకు బీఎస్ఎన్ఎల్ రెడీ!
డిజిటల్ బిల్లు పేమెంట్ల ప్రోత్సహకానికి ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 15వేల పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ల(పీఓఎస్)ను లీజుకు తీసుకోవాలని యోచిస్తోంది. వీటి ద్వారా ప్రస్తుతమున్న డిజిటల్ పేమెంట్లను రెండితలు చేసుకోవాలనుకుంటోంది. 2017 మార్చి వరకు తమ అన్ని బిల్లు చెల్లింపుల్లో డిజిటల్ లావాదేవీలు 40 శాతం పెంచుకోవాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. ఎలక్ట్రానిక్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు కస్టమర్ సర్వీసు సెంటర్ల కోసం 15వేల పీఓఎస్ మిషన్లను అద్దెకు తీసుకుంటున్నామని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ చెప్పారు. తమ టెలికాం జిల్లాలో 20 నుంచి 50 కస్టమర్ సర్వీసు సెంటర్లను కలిగి ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీసు సెంటర్లలో 1,500 నుంచి 2000 పీఓఎస్ మిషన్లున్నాయి. కంపెనీ డిజిటల్ బిల్లు చెల్లింపులు మొత్తం చెల్లింపులలో 20 శాతం కంటే తక్కువగానే ఉన్నాయి. మార్చి 31 లోపలే మొబైల్, ల్యాండ్ లైన్, బ్రాండ్ బ్యాండ్, ఫైబర్ టూ హోమ్ సర్వీసుల వరకు తమ బిల్లు చెల్లింపులు 40 శాతం వరకు డిజిటల్లోనే జరిగేలా చూసుకుంటామని శ్రీవాస్తవ చెప్పారు.