ముంబై: ఆరోగ్య బీమా పాలసీదారులు త్వరలోనే అన్ని రకాల ఆస్పత్రుల్లోనూ నగదు రహిత వైద్యం పొందే దిశగా అడుగులు పడుతున్నాయి. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఇందుకు సంబంధించి ‘క్యాష్‌లెస్ ఎవ్రీవేర్’ కార్యక్రమాన్ని ప్రకటించింది. జాబితాలో లేని హాస్పిటళ్లలోనూ పాలసీదారులకు నగదు రహిత వైద్యాన్ని అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని తెలిపింది.
కనీసం 15 పడకలు ఉండి, ఆయా రాష్ట్రాల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద రిజిస్టర్ అయినవి నగదు రహిత వైద్యాన్ని ఆఫర్ చేయవచ్చు. దీంతో పాలసీదారులు ఆస్పత్రిలో చేరాల్సి వస్తే తమ పాకెట్ నుంచి ఎలాంటి చెల్లింపులు చేయక్కర్లేదు. చికిత్సల వ్యయాలను బీమా కంపెనీలు చెల్లిస్తాయి. క్లెయిమ్ అనుమతించడంపై చెల్లింపులు ఆధారపడి ఉంటాయని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ పేర్కొంది. కొన్ని షరతులకు లోబడి పాలసీదారులు నగదు రహిత వైద్యం కోసం ఏ ఆస్పత్రిని అయినా ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది.
నాన్ ఎంపానెల్డ్ (బీమా సంస్థ జాబితాలో లేని) హాస్పిటల్‌లో చేరడానికి 48 గంటల ముందు లేదా, చేరిన 48 గంటల్లోపు బీమా సంస్థకు తెలిజేయాల్సి ఉంటుందని పేర్కొంది. బీమా సంస్థ నెట్‌వర్క్‌లో లేని ఆస్పత్రుల్లో చికిత్స పొందినప్పుడు పాలసీదారులపై భారం పడకుండా చూడడమే దీని ఉద్దేశ్యమని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ చైర్మన్ తపన్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40వేల ఆస్పత్రుల్లోనే నగదు రహిత వైద్యం పాలసీదారులకు అందుబాటులో ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment