‘మోదీనే అత్యుత్తముడు’
లండన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశాంగ విధానంపై ప్రచురితమైన ఒక పుస్తకాన్ని లండన్లోని భారత హై కమిషన్లో ఆవిష్కరించారు. ‘ద మోదీ డాక్ట్రైన్: న్యూ పారాడైమ్స్ ఇన్ ఇండియాస్ ఫారిన్ పాలసీ’ (మోదీ సిద్ధాంతం: భారత విదేశాంగ విధానంలో కొత్త మార్పులు) అనే ఈ పుస్తకంలో మోదీ నాయకత్వంలో భారత్ వివిధ దేశాలతో నెరిపిన సంబంధాలపై పలువురు ప్రముఖ రచయితల వ్యాసాలను సంపుటీకరించారు.
బీజేపీ విదేశీ వ్యవహారాల విభాగం అధిపతి విజయ్ చౌతయ్వాలే మాట్లాడుతూ ‘ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసాన్ని ఆయా రంగాల్లోని నిపుణులు రాశారు. కాబట్టి దీనికి విశ్వసనీయత, నిష్పాక్షికత ఉంటాయి’ అన్నారు. ‘బ్రిటన్ ప్రధాని థెరెసా మే ద్వైపాక్షిక సంబంధాల కోసం తన తొలి ఐరోపాయేతర పర్యటనకు భారత్కు వెళ్లారు. ఇదే మోదీ గురించి ఎంతో చెబుతోంది. భారత్కు ఉన్న రాయబారుల్లో మోదీనే అత్యుత్తముడు’ అని యూకేలో భారత తాత్కాలిక హైకమిషనర్ దినేష్ పట్నాయక్ అన్నారు.