తెలుగువాకిట 700 థియేటర్లలో ‘కబాలి’
భీమవరం : సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రాన్ని శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని 700 థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్టు భీమవరం పట్టణానికి చెందిన షణ్ముఖ ఫిలింస్ అధినేత కొత్తపల్లి ప్రవీణ్‌కుమార్ వర్మ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ హక్కులను పొందిన ప్రవీణ్‌కుమార్ వర్మ బుధవారం భీమవరంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రచారం పొందుతున్న కబాలి సినిమాను ఏడువేల థియేటర్స్‌లో విడుదల చేయనున్నారన్నారు.
తన మిత్రునితో కలిసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శాటిలైట్‌తో షణ్ముఖ ఫిలింస్ హక్కులు పొందినట్టు చెప్పారు. గత నాలుగున్నరేళ్లుగా తమ సంస్థ ఆధ్వర్యంలో సింహా, లెజెండ్, సర్దార్ గబ్బర్‌సింగ్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, సోగ్గాడే చిన్ని నాయనా వంటి 40 సూపర్ హిట్ చిత్రాలను పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం కబాలి సినిమాపై రజనీ అభిమానులు, ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయని, తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలైతో పాటు అనేక భాషల్లో చిత్రం రిలీజ్ అవుతుందని ప్రవీణ్‌కుమార్ వర్మ చెప్పారు.