district peoples
-
గల్ఫ్‌లో ఆగినగుండెలు
బుగ్గారం/మేడిపల్లి: ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో గల్ఫ్‌బాట పట్టిన వలసకార్మికులను గుండెపోటు కబళించింది. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన చిన్నకట్ట శంకరయ్య (45), మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన దౌడ భూమగంగారాం (40) గల్ఫ్‌లో గుండెపోటుతో మృతిచెందారు. దీంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. బుగ్గారం మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన చిన్నకట్ట శంకరయ్య స్థానికంగా ఉపాధి లభించకపోవడంతో ఆరేళ్ల క్రితం సౌదీఅరేబియా వెళ్లాడు. రెండునెలల క్రితం వచ్చి కూతురుకు వివాహం జరిపించి తిరిగి వెళ్లాడు. అక్కడ పనిఒత్తిడి పెరిగిపోవడంతో నిత్యం మదనపడుతున్నాడు. ఈ క్రమంలో గుండెపోటుతో మంగళవారం చనిపోయినట్లు ఇక్కడి కుటుంబసభ్యులకు అక్కడి కార్మికులు సమాచారం చేరవేశారు. దీంతో మృతుడి భార్య గంగవ్వ, ఇద్దరు కుమారులు రంజిత్(16), రోహిత్ (12), కూతురు రస్మిత, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. శంకరయ్య మృతివార్త తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. వెళ్లిన 15 రోజులకే.. మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన దౌడ భూమగంగారాం (40) భార్య లక్ష్మి, కొడుకు రమేశ్, కూతుళ్లు రమ్య, రుచిత ఉన్నారు. గ్రామ పంచాయతీలో ఫట్టర్ పనిచేసిన ఆయన కుటుంబ పోషణభారం కావడంతో 12 ఏళ్ల క్రితం దుబాయికి వలసబాట పట్టాడు. అప్పటినుంచి వస్తూపోతూ ఉన్నాడు. అప్పులు పెరిగిపోవడంతో కొడుకు రమేశ్‌ను సైతం దుబాయి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఇంటికొచ్చిన గంగారాం.. కొడుకుకు పాస్‌పోర్టు సైతం తీయించాడు. డిసెంబర్ 30న తిరిగి దుబాయి వెళ్లిన ఆయన.. కొడుకును ఈనెల 9న దుబాయ్‌కి రప్పించుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 15న తను ఉంటున్న గదిలో పనిచేస్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడని, ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడని అక్కడి కార్మికులు ఇక్కడకు సమాచారం చేరవేశారు. దీంతో కుటుంబసభ్యులు బోరుమన్నారు. గంగారాం భార్య లక్ష్మి కూలీపనులు చేస్తోంది. పెద్ద కూతురు రమ్య ఇంటర్ ప్రథమ సంవత్సరం, చిన్నకూతురు రుచిత ఏడోతరగతి చదువుతున్నారు. గంగారాం మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. -
రైల్వే బడ్జెట్లో కేటాయింపులు అరకొర
రైల్వే బడ్జెట్ ఈసారి కూడా నిరాశకు గురిచేసింది. పాత ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు అరకొరే కాగా కొత్త ప్రాజెక్టుల ఊసే లేదు. ఏటా ఆశించడం ప్రజలు వంతుకాగా.. ఉసూరుమనిపించడం కేంద్రం బాధ్యతగా మారింది. గురువారం రైల్వే మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో జిల్లా ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. ప్రసంగ పాఠాన్ని వినడానికి ఆసక్తి కనబరిచారు. జిల్లాకు సంబంధించి ప్రాజెక్టుల మంజూరు, నిధుల కేటాయింపుపై దృష్టి పెట్టారు. అక్కన్నపేట, మనోహరాబాద్ మార్గాలకు అరకొర ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్‌కు రూ.20 కోట్లు, అక్కన్నపేట-మెదక్ మార్గానికి రూ.5 కోట్లు కేటాయించడంపై పెదవి విరిచారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాత్రం పనులు చేపడతామంటున్నారు. మరిన్ని నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తామంటున్నారు. కొత్తపల్లి-మనోహరాబాద్‌కు రూ.20 కోట్లు ⇒అక్కన్నపేట-మెదక్ మార్గానికి రూ.5 కోట్లు ⇒మొక్కుబడి నిధులపై జిల్లా వాసుల పెదవి విరుపు ⇒పనులు ప్రారంభిస్తామంటున్న ప్రజాప్రతినిధులు మెదక్: వ్యయం కొండంత... మంజూరు గోరంత అన్నట్లుంది అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్‌కు కేటాయించిన బడ్జెట్. గురువారం కేంద్ర రైల్వేమంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ కోసం రూ.5 కోట్లు విడుదల చేశారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్లకే ఎక్కువ బడ్జెట్ వస్తుందన్న ఆశతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనలు పంపారు. మొక్కుబడిగా రూ.5 కోట్లు మాత్రమే నిధులు కేటాయించడంతో రైల్వేలైన్ పనులు ఏ మేరకు ముందుకు కదులుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కన్నపేట-మెదక్‌కు 17.2 కిలో మీటర్ల మేర రైల్వేలైన్ మంజూరు చేస్తూ 2012-13 బడ్జెట్లో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు గాను మొత్తం రూ.129.32 కోట్లు అవసరమని నిర్ణయించారు. ఇందులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ... ఉచితంగా భూ సేకరణ చేసివ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 19 జనవరి 2014న రైల్వేలైన్‌కు అప్పటి ఎంపీ విజయశాంతి, మంత్రి సునీతారెడ్డిలు శంకుస్థాపన చేశారు. 2012-13లో రూ.కోటి, 2013-14లో రూ.1.10 కోట్లు, 2014-15లో రూ.10 కోట్లు కలిసి మొత్తం రూ.12.10 కోట్లు మంజూరయ్యాయి. కాగా రాష్ట్ర వాటాకింద 2012-13లో రూ.కోటి, 2012-14లో రూ.75 లక్షలు కలిపి మొత్తం రూ.1.75 కోట్లు మంజూరయ్యాయి. గత జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.25.26 కోట్లు, భూ సేకరణ కోసం రూ.10 కోట్లు తన వాటా కింద మంజూరు చేసింది. దీంతో భూ సేకరణ పోనూ రైల్వేలైన్ పనుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మొత్తం రూ.24.60 కోట్లు మంజూరు చేసినట్లయింది. అయితే ఇంతవరకు భూ సేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈసారైనా కేంద్రం ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరు చేస్తుందని ఆశపడ్డప్పటికీ కేవలం రూ.5 కోట్లు మాత్రమే కేటాయించడంతో మెదక్ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కల నెరవేరుతుంది.. అక్కన్నపేట-మెదక్, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ల ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కల. ఉద్యమ సమయం నుంచి ఆయన రైల్వేలైన్ల ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అక్కన్నపేట-మెదక్‌కు రూ.5 కోట్లు, కొత్తపల్లి-మనోహరబాద్‌కు రూ.20 కోట్లు మంజూరు చేయడం సంతోషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి నిధులు మంజూరయ్యాయి. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో వేసిన రైల్వేలైన్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నిధులతో రైల్వేలైన్ పనులు ప్రారంభించవచ్చు. భవిష్యత్తులో అధిక కేటాయింపులు జరిగేలా కృషి చేస్తా. - కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రాజెక్టులు సాధించుకుంటాం.. రైల్వే బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం తీవ్ర నిరాశ పర్చింది. కేవలం పెండింగ్ ప్రాజెక్టులకే ప్రాధాన్యత నిచ్చి, కొత్త వాటి ఊసెత్తక పోవడం సరికాదు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోగా రైల్వే కొత్త ప్రాజెక్టులను సాధించుకుంటాం. జహీరాబాద్-సికింద్రాబాద్, బోధన్-బీదర్ మధ్య కొత్త రైలు మార్గాల ఏర్పాటుకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వే మంత్రిని కోరుతా. కొత్త ప్రాజెక్టులకు మంజూరు లభిస్తుందనే నమ్మకముంది. - బీబీ పాటిల్, జహీరాబాద్ ఎంపీ పనులు ప్రారంభిస్తాం.. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనుల కోసం బడ్జెట్లో కేటాయించింది రూ.5 కోట్లే. ఇది చాలా తక్కువ. మరిన్ని నిధులు కేటాయిస్తే బాగుండేది. అయినా పనులు ప్రారంభిస్తాం. రైల్వేలైన్ పనులు ప్రారంభించే అంశంపై చర్చించేందుకు మార్చి 3న సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేయనున్నాం. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి, అటవీశాఖ చీఫ్ సెక్రెటరీ, రైల్వేబోర్డు ప్రతినిధి, జిల్లా కలెక్టర్ పాల్గొంటారు. ఉన్న నిధులతో భూ సేకరణ పూర్తిచేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడతాం. కేంద్రమిచ్చిన రూ.5 కోట్లకు రాష్ట్ర వాటా కింద మరో రూ.5 కోట్లు మంజూరు చేయాలని సీఎంను కోరతాం. - పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ (మెదక్ ఎమ్మెల్యే) వైఎస్ హయాంలోనే రాష్ట్ర వాటాకు సంసిద్ధత అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్ కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లోనే ఎంతో చొరవ తీసుకున్నారు. ఇందులో సగం వాటాను రాష్ట్రం తరఫున భరించేందుకు ఆయన సంసిద్ధతను వ్యక్తం చేశారు. అప్పట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ లైన్ కోసం వైఎస్‌కు విజ్ఞప్తి చేశా. ఈ మేరకు రూ.120 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు రూపొందాయి. ప్రస్తుత బడ్జెట్లో మంజూరు చేసిన రూ.5 కోట్లు ఏ పనికి కొరగావు. ఇప్పటివరకు భూ సర్వే, సేకరణ పూర్తి కాలేదు. పూర్తిస్థాయి సర్వేకూడా జరగలేదు. గత మూడేళ్లుగా మంజూరైన నిధులు కూడా అరకొరే. కనుక పెండింగ్ ప్రాజెక్ట్‌ల నిధులను అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులకు మళ్లించాలి. - పి.శశిధర్‌రెడ్డి, పీసీసీ అధికారి ప్రతినిధి -
రగులుతున్న సరిహద్దు
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల సరిహద్దు తుంగభద్ర నదీతీర ం నిత్యం ఘర్షణలకు కేంద్రబిందువైంది. ఇక్కడ మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల ప్రజలు ప్రతిచిన్న విషయానికి గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం మరోసారి తుంగభద్ర నదిలో ఇసుక తరలించే విషయమై ఇరుప్రాంతాలకు చెందిన ఇసుకమాఫియా ఘర్షణకు దిగింది. ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడటంతో నలుగురు గాయపడ్డారు. మానవపాడు మండలం పుల్లూరు గ్రామ సరిహద్దు వద్ద తుంగభద్ర తీరంలోకి ఇసుకను తవ్వుకునేందుకు కొంతమంది కర్నూలు జిల్లా మునుగాలపాడు గ్రామహద్దులోకి వెళ్లారు. అక్కడే మరికొందరు ఇక్కడ తవ్వకాలు జరుపొద్దంటూ హెచ్చరించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో చిన్న స్వాములు, రమేష్, మద్దిలేటి, రాముడులు గాయపడ్డారు. ఆర్డీఎస్ రగడ 20 ఏళ్లుగా ఆర్డీఎస్ నీటి వాటా విషయంలో కూడా ఇరుప్రాంతాల రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంటుంది. 1992లో కర్నూలు జిల్లాకు చెందిన కొందరు నాయకులు ఆర్డీఎస్‌పై చిచ్చురేపారు. ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం కోసం అన్వేషణ జరుగుతున్న తరుణంలో ఈ ప్రాంతంలోని తుంగభద్ర నదిలో నిర్మితమవుతున్న ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అడ్డుతగిలి మరోసారి ప్రాంత విధ్వేషాలను రెచ్చగొట్టారు. ఈ సంఘటన మాయక ముందే అక్రమ ఇసుక తరలింపుల్లో రెండు ప్రాంతాల మధ్య సరిహద్దు విషయమై వివాదాలు చెలరేగి ఘర్షణకు ఆజ్యం పోసింది. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఏర్పడిన నాటి నుంచి సీమాంధ్రలో సమైక్య ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతానికి చెందిన కొందరు అలంపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన సరిహద్దు బోర్డును తొలగించారు. ఈ సంఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన ఏడుగురిపై కేసు కూడా నమోదైంది. సరిహద్దులో ఘర్షణలు ఇలా.. 2011 ఫిబ్రవరి 2న మానవపాడు మండలం పుల్లూరు, కర్నూలు జిల్లా నిడ్జూరు గ్రామాల మధ్య ఇసుకతరలింపు విషయంలో ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరువర్గాల మధ్య మాటలయుద్ధం పెరిగి దాడులకు దిగారు. చివరకు ఇరుప్రాంతాల పెద్ద మనుషులు కలుగజేసుకుని సమస్యను సద్దుమణిచారు. ఇదే ఏడాది మార్చి 10న మరో సారి ఈ రెండు గ్రామాల మధ్య ఇదే ఇసుక తరలింపుల్లో ఘర్షణ చోటుచేసుకుంది. నిడ్జూరు గ్రామానికి చెందిన సుమారు 200 మంది పుల్లూరు గ్రామస్తులపై మూకుమ్మడిగా దాడిచేశారు. 2012 మే 2న వడ్డేపల్లి మండలం తూర్పుగార్లపాడు గ్రామం వద్ద నిర్మితమైన ఎత్తిపోతల పథకం పనులకు అంతరాయం కలిగించడంతో వివాదం చెలరేగింది. 2009లో తూర్పుగార్లపాడు గ్రామంలోని 210 ఎకరాలకు సాగునీటిని అందించే ఎత్తిపోతల పథకం కొట్టుకుపోయింది. దీంతో 2010లో ఎత్తిపోతల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.06 కోట్లు మంజూరు చేసింది. నిధులు మంజూరు కావడంతో తుంగభద్ర నదిలో ఎత్తిపోతల పథకంను పునఃనిర్మించే పనులు మొదలుపెట్టారు. నిర్మాణ పనుల్లో భాగంగా నదిలో జాక్వెల్ నిర్మాణం కొనసాగుతుండగా సీమ ప్రాంతానికి చెందిన దూద్యాల, కొంతలపాడు గ్రామస్తులు జాక్వెల్ కోసం ఏర్పాటు చేసిన సరుగుడు కర్రలను తొలగించి విధ్వంసం సృష్టించారు. చివరకు పోలీసుల రక్షణ పనులు కొనసాగించాల్సి పరిస్థితి. 2011 అక్టోబర్ 23న ఆర్డీఎస్ వద్ద రైతుల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. మానవపాడు, వడ్డేపల్లి, అయిజ మండలాల్లో ఆర్డీఎస్‌పై ఆధారపడి రైతులు పంటలు సాగు చేశారు. కానీ ఆర్డీఎస్ నీళ్లు అందక వేసిన పంటలు వేసినట్లు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో అప్పటి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ సీతారామిరెడ్డి సుమారు 800 మంది రైతులతో కలిసి అధికారులు అనుమతితో ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ వద్ద ఉన్న కరకట్టపై ఇసుక బస్తాలు వేసి 30 నుంచి 40 క్యూసెక్కుల నీటిని మళ్లీంచే ప్రయత్నం చేశారు. 800 క్యూసెక్కుల ఇండెంట్ పెట్టిన తర్వాత కూడా రాయలసీమకు చెందిన నాయకులు అడ్డుకున్నాడు. దీంతో ఇక్కడ ఇరుప్రాంతాల మద్య ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. కర్ణాటక ప్రాంత పోలీసులు ఇరుప్రాంతాల రైతులను నాయకులను అడ్డుకుని అప్పట్లో గొడవను వారించారు.