మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల సరిహద్దు తుంగభద్ర నదీతీర ం నిత్యం ఘర్షణలకు కేంద్రబిందువైంది. ఇక్కడ మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల ప్రజలు ప్రతిచిన్న విషయానికి గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం మరోసారి తుంగభద్ర నదిలో ఇసుక తరలించే విషయమై ఇరుప్రాంతాలకు చెందిన ఇసుకమాఫియా ఘర్షణకు దిగింది. ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడటంతో నలుగురు గాయపడ్డారు.
మానవపాడు మండలం పుల్లూరు గ్రామ సరిహద్దు వద్ద తుంగభద్ర తీరంలోకి ఇసుకను తవ్వుకునేందుకు కొంతమంది కర్నూలు జిల్లా మునుగాలపాడు గ్రామహద్దులోకి వెళ్లారు. అక్కడే మరికొందరు ఇక్కడ తవ్వకాలు జరుపొద్దంటూ హెచ్చరించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో చిన్న స్వాములు, రమేష్, మద్దిలేటి, రాముడులు గాయపడ్డారు.
ఆర్డీఎస్ రగడ
20 ఏళ్లుగా ఆర్డీఎస్ నీటి వాటా విషయంలో కూడా ఇరుప్రాంతాల రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంటుంది. 1992లో కర్నూలు జిల్లాకు చెందిన కొందరు నాయకులు ఆర్డీఎస్‌పై చిచ్చురేపారు. ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం కోసం అన్వేషణ జరుగుతున్న తరుణంలో ఈ ప్రాంతంలోని తుంగభద్ర నదిలో నిర్మితమవుతున్న ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అడ్డుతగిలి మరోసారి ప్రాంత విధ్వేషాలను రెచ్చగొట్టారు. ఈ సంఘటన మాయక ముందే అక్రమ ఇసుక తరలింపుల్లో రెండు ప్రాంతాల మధ్య సరిహద్దు విషయమై వివాదాలు చెలరేగి ఘర్షణకు ఆజ్యం పోసింది. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఏర్పడిన నాటి నుంచి సీమాంధ్రలో సమైక్య ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతానికి చెందిన కొందరు అలంపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన సరిహద్దు బోర్డును తొలగించారు. ఈ సంఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన ఏడుగురిపై కేసు కూడా నమోదైంది.
సరిహద్దులో ఘర్షణలు ఇలా..
2011 ఫిబ్రవరి 2న మానవపాడు మండలం పుల్లూరు, కర్నూలు జిల్లా నిడ్జూరు గ్రామాల మధ్య ఇసుకతరలింపు విషయంలో ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరువర్గాల మధ్య మాటలయుద్ధం పెరిగి దాడులకు దిగారు. చివరకు ఇరుప్రాంతాల పెద్ద మనుషులు కలుగజేసుకుని సమస్యను సద్దుమణిచారు.
ఇదే ఏడాది మార్చి 10న మరో సారి ఈ రెండు గ్రామాల మధ్య ఇదే ఇసుక తరలింపుల్లో ఘర్షణ చోటుచేసుకుంది. నిడ్జూరు గ్రామానికి చెందిన సుమారు 200 మంది పుల్లూరు గ్రామస్తులపై మూకుమ్మడిగా దాడిచేశారు.
2012 మే 2న వడ్డేపల్లి మండలం తూర్పుగార్లపాడు గ్రామం వద్ద నిర్మితమైన ఎత్తిపోతల పథకం పనులకు అంతరాయం కలిగించడంతో వివాదం చెలరేగింది.
2009లో తూర్పుగార్లపాడు గ్రామంలోని 210 ఎకరాలకు సాగునీటిని అందించే ఎత్తిపోతల పథకం కొట్టుకుపోయింది. దీంతో 2010లో ఎత్తిపోతల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.06 కోట్లు మంజూరు చేసింది. నిధులు మంజూరు కావడంతో తుంగభద్ర నదిలో ఎత్తిపోతల పథకంను పునఃనిర్మించే పనులు మొదలుపెట్టారు. నిర్మాణ పనుల్లో భాగంగా నదిలో జాక్‌వెల్ నిర్మాణం కొనసాగుతుండగా సీమ ప్రాంతానికి చెందిన దూద్యాల, కొంతలపాడు గ్రామస్తులు జాక్‌వెల్ కోసం ఏర్పాటు చేసిన సరుగుడు కర్రలను తొలగించి విధ్వంసం సృష్టించారు. చివరకు పోలీసుల రక్షణ పనులు కొనసాగించాల్సి పరిస్థితి.
2011 అక్టోబర్ 23న ఆర్డీఎస్ వద్ద రైతుల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. మానవపాడు, వడ్డేపల్లి, అయిజ మండలాల్లో ఆర్డీఎస్‌పై ఆధారపడి రైతులు పంటలు సాగు చేశారు. కానీ ఆర్డీఎస్ నీళ్లు అందక వేసిన పంటలు వేసినట్లు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో అప్పటి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ సీతారామిరెడ్డి సుమారు 800 మంది రైతులతో కలిసి అధికారులు అనుమతితో ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ వద్ద ఉన్న కరకట్టపై ఇసుక బస్తాలు వేసి 30 నుంచి 40 క్యూసెక్కుల నీటిని మళ్లీంచే ప్రయత్నం చేశారు. 800 క్యూసెక్కుల ఇండెంట్ పెట్టిన తర్వాత కూడా రాయలసీమకు చెందిన నాయకులు అడ్డుకున్నాడు. దీంతో ఇక్కడ ఇరుప్రాంతాల మద్య ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. కర్ణాటక ప్రాంత పోలీసులు ఇరుప్రాంతాల రైతులను నాయకులను అడ్డుకుని అప్పట్లో గొడవను వారించారు.
రగులుతున్న సరిహద్దు
Published Thu, Nov 7 2013 4:21 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement