Divide Country
-
తాతయ్య చివరి కోరిక కోసం..
‘అమ్మా... ఆ చెట్టును నువ్వొకసారి తాకి రావాలి’ అని కోరాడు ఆమె తాత చనిపోయే ముందు. అమ్మమ్మలు, తాతయ్యల మాటల్ని చాదస్తంగా తీసి పారేసేవారు ఉన్న ఈరోజుల్లో ఆ మనవరాలు తాత చివరి కోరిక నెరవేర్చడానికి పాకిస్తాన్‌కు వెళ్లింది. దేశ విభజనకు ముందు తన తాత ఏ చెట్టునైతే పొలంలో తన నీడగా చేసుకున్నాడో ఆ చెట్టును తాకింది.తన పూర్వీకుల స్వగ్రామంలోని మట్టిని మూట గట్టుకుంది. ఇంకా అక్కడే ఉన్న తన వాళ్లను చూసి ఆనందబాష్పాలు రాల్చింది. పెద్దవాళ్ల గుండెల్లో గాఢంగా కొన్ని కోరికలు ఉంటాయి. వాటిని వారు జీవించి ఉండగానే నెరవేరిస్తే ఆనందం. మరణించాక నెరవేరిస్తే మనశ్శాంతి.‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు వచ్చి, ఇంత పేరు గడించినా సినీ కవి గుల్జార్‌కి గుండెలో ఒక కోరిక ఉండిపోయింది. అది పాకిస్తాన్‌లోని తన పూర్వీకుల సొంత ఊరిని చూసి రావాలనేది. ఒకటి రెండుసార్లు ప్రయత్నించినా అతనికి అనుమతి దొరకలేదు. చనిపోయేలోపు చూస్తానో లేదో అంటాడాయన. దేశ విభజన వల్ల రాత్రికి రాత్రి కుటుంబాలు చెదిరిపోయి కొందరు ఇండియా చేరారు... కొందరు పాకిస్తాన్‌లోనే ఉండిపోయారు. ఇరు దేశాలలో సెటిల్ అయిన వారి తలపోతల గురించి ఎంతో సాహిత్యం వచ్చింది. రాకపోకలు జటిలం అయ్యాక ఇక బంధాలు ఫోన్లకు పరిమితం అయ్యాయి. పంజాబీలు అధికంగా ఈ ఎడబాటును భరించారు. రెండేళ్ల క్రితం 90 ఏళ్ల వయసున్న రీనా చిబ్బేర్ అనే ఆమె ‘రావల్పిండిలో మా పూర్వీకుల ఇల్లు చూసి రావడానికి అనుమతి ఇవ్వండి’ అని వేడుకుంటే ప్రభుత్వం అనుమతి ఇస్తే ఆమె ఎంతో సంబరంగా వెళ్లడం ప్రధాన వార్తాంశం అయ్యింది. అయితే దేశ విభజన సమయంలో జలంధర్‌కు వచ్చి స్థిరపడిన బహదూర్ సింగ్‌కి మాత్రం అలాంటి కోరిక నెరవేరలేదు. 1947లో అతను తన చిన్న తమ్ముణ్ణి తీసుకుని ఇండియా వచ్చేశాడు. నడిమి తమ్ముడు అక్కడే ఉండిపోయాడు. ‘మా తాత చనిపోయే వరకూ కూడా పాకిస్తాన్లో ఉన్న తమ్ముణ్ణి గుర్తు చేసుకుని ఏడ్చేవాడు. ఆ అన్నదమ్ములు మళ్లీ జీవితంలో కలవకుండానే కన్ను మూశారు’ అని తెలిపింది కరమ్‌జిత్ కౌర్. ఆమె ఇటీవలే తాత కోరిక నెరవేర్చడానికి పాకిస్తాన్‌లోని సియోల్‌కోట్‌కు దగ్గరగా ఉన్న తమ పల్లెను దర్శించింది.ఆ ఇల్లు... ఆ చెట్టు‘మా తాతది సియోల్‌కోట్ దగ్గర ఉన్న పల్లెటూరు. ఆయన పొలంలో పెద్ద రావిచెట్టు ఉంది. ఆ ఇంటిని, చెట్టును ఆయన ఎప్పుడూ గుర్తు చేసుకునేవారు. వాటి గురించి కథలు కథలు చెప్పేవారు. ఆ చెట్టును ఒకసారి తాకి రావాలి. తల్లీ అనేవారు నాతో. జలంధర్ వచ్చేశాక ఆయన తన తమ్ముడికి ఎన్నో ఉత్తరాలు రాశారు. కానీ 1986లో గాని వాటికి జవాబు రాలేదు. అప్పటికే మా తాత నడిమి తమ్ముడు ఇస్లాంలోకి మారాడు. అయితే మా ఇంటి పేరును ‘గుమర్’ని వదలకుండా తన పేరు గులామ్ ముహమ్మద్ గుమర్ అని పెట్టుకున్నాడు. ఆ ఇంటిని ఆ చెట్టును అలాగే కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన చనిపోయాక ఆయన కొడుకు కుటుంబం మా జ్ఞాపకాలను పదిలంగా ఉంచిందని అర్థమయ్యాక ఎలాగైనా వెళ్లాలని తాతయ్య కోరిక నెరవేర్చాలని నిశ్చయించుకున్నాను’ అంది కరమ్‌జిత్ కౌర్.ఘన స్వాగతం‘నేను పాకిస్తాన్ వెళుతున్నానంటే మా అత్తగారి కుటుంబం వద్దంటే వద్దంది. నాక్కూడా చాలా భయాలు కలిగాయి. కాని అక్కడ నేను అడుగు పెట్టగానే మా నడిమి తాత కుమారుడు నన్ను పట్టుకుని గట్టిగా ఏడ్చేశాడు. నా పెళ్లి కార్డు జాగ్రత్తగా దాచుకుని ఉన్నారు. మా తాత రాసిన ఉత్తరాలు ఉన్నాయి. అప్పట్లో మా ఇంట్లో వాడిన తిరగలి అలాగే ఉంది. మా పొలంలో రావిచెట్టు సంగతి చెప్పనక్కర్లేదు. కళకళలాడుతోంది. మా బంధువులు, రక్త సంబంధీకులు అందరూ కన్నీటి పర్యంతం అయ్యి మర్యాదలు చేశారు. మా వూరి మట్టి తీసుకుని తిరిగి వస్తున్నాను’ అని తెలిపింది కరమ్‌జిత్ కౌర్.కష్టసాధ్యమైన తాత కోరికను కొద్దిగా అయినా తీర్చిందీ మనవరాలు. ‘ఒరేయ్... కాశీ చూపించరా’, ‘మా ఊరు చూపించరా’, ‘ఫలానా బంధువు ఇంటికి తీసుకెళ్లరా’ అని పెద్దవాళ్లు కోరితే కాదనవద్దు. ఆ కోరిక లోతు మనకు తెలియదు. చెప్పినా అర్థం కాదు. చేయవలసిందల్లా కోరింది తీర్చడమే.కుటుంబాలు కలిపే సంస్థతాత మరణించాక లండన్‌లో స్థిరపడిన కరమ్‌జిత్‌కు... కఠినమైన వీసా నియమాల వల్ల పాకిస్తాన్‌కు వెళ్లడం అంత సులువు కాలేదు. అయితే దేశ విభజన సమయంలో విడిపోయిన పంజాబీ కుటుంబాలను తిరిగి కలిపేందుకు ‘జీవే సంఝా పంజాబ్’ పేరుతో ఒక సంస్థ పని చేస్తోంది. ఆ సంస్థ ప్రయత్నంతో వాఘా బోర్డర్ మీదుగా పాకిస్తాన్లోకి అడుగు పెట్టేందుకు కరమ్‌జిత్ కౌర్‌కు అనుమతి లభించింది. ‘నేను పాకిస్తాన్‌కు వెళుతున్నానని తెలిసి మా చిన్నతాత కుమారుడు తనని కూడా తీసుకెళ్లమని ఎంతో ఏడ్చారు. కాని ఆయన వయసు రీత్యా వీల్‌చైర్‌లో ఉన్నారు. నీ కోసం మన ఊరి మట్టి తీసుకొస్తానులే పెదనాన్నా అని చెప్పి వచ్చాను’ అంటుందామె భావోద్వేగంతో. -
PM Narendra Modi: సమాజాన్ని విభజించాలని చూస్తున్నారు
అహ్మదాబాద్: భారత సమాజాన్ని విభజించి ముక్కలుచెక్కలు చేయడానికి జాతివ్యతిరేక శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కులగణన పేరిట దేశంలోని భిన్న కులస్తుల మధ్య విపక్షాల ‘ఇండియా’ కూటమి చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ విమర్శల వేళ మోదీ పరోక్షంగా ఆ అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. సోమవారం గుజరా త్‌లోని అహ్మదాబాద్‌లో శ్రీ స్వామి నారా యణ్ ఆలయం 200వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఖేడా జిల్లాలోని వడ్తాల్లో జరిగిన కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగించారు. అభివృద్ధిభారత్కు ఐక్యతే పునాది‘‘ఐక్యమత్యంతో పనిచేసే పౌరులు, దేశ సమగ్ర తతోనే భారత్ 2047 సంవత్సరంలో అభివృద్ధి చెందిన ఆధునిక భారత్‌గా అవతరించగలదు. దురదృష్టవశాత్తు కొందరు సమాజా న్ని కులం, మతం, ప్రాంతం,జాతి, లింగం, స్వస్థలం పేరిట విభజి స్తున్నారు. సంకుచిత మనస్తత్వంతో కొన్ని విభజన శక్తులు చేస్తున్న జాతవ్యతిరేక కుట్ర లివి. ఈ జాతివ్యతిరేక శక్తుల ఉద్దేశాలు ఎంత ప్రమాద కరమో మనం గమనించాలి. కుట్రల పర్యావసానాలను ఊహించాలి. ఈ దుష్టశక్తుల ఆటకట్టించేందుకు మనందరం ఐక్యంగా నిలబడదాం. పోరాడి వాటిని ఓడిద్దాం’’ అని అన్నారు. ఆత్మనిర్భరత మంత్రంతో ముందుకుసాగి అభివృద్ధిభారత్ను సాక్షాత్కారం చేసుకుందాం’’ అని పిలుపునిచ్చారు.ఆలయంతో ఆత్మీయ అనుబంధం‘‘నాటి దుర్భర పరిస్థితులకు ప్రజలు తమను తామే నిందించుకుంటూ కడుపేదరికంలో, బానిసత్వంలో బతు కీడుస్తున్న కాలంలో స్వామినారాయణ అవతరించారు. ఆపత్కాలంలో స్వామినారాయణ, సాధువులు భారతీయు లకు తమ కర్తవ్యబోధ చేసి ఆత్మగౌరవం గొప్పతనాన్ని తెలియజెప్పారు. దీంతో నూతన ఆధ్యాత్మిక శక్తితో ప్రజలు తమ అసలైన గుర్తింపును తెల్సుకోగలిగారు. వడ్తాల్ స్వామి నారాయణ్ ఆలయంతో నాకు దశాబ్దాల అనుబంధం ఉంది. ముఖ్యమంత్రిని అయ్యాక బంధం బలపడింది. 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్రప్రభుత్వం సైతం స్మారక నాణెంను ఆవిష్కరించింది’’ అని గుర్తుచేశారు. -
కులమతాల చిచ్చు పెడుతున్నారు
ఇటానగర్: కులం, మతం ప్రాతిపదికన దేశ ప్రజలను మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ విడగొడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లో అడుగుపెట్టిన సందర్భంగా దోయ్‌ముఖ్‌లో రాహుల్ స్థానికులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ దేశంలో విద్వేషం చిమ్మడమే బీజేపీ పని. తమ కులం, మతం గొప్పదంటూ దేశ ప్రజలు తమలో తాము ఘర్షణలుపడేలా బీజేపీ కుట్రలు చేస్తోంది. కొద్ది మంది పారిశ్రామికవేత్తల కోసమే బీజేపీ పనిచేస్తోంది. జనం కష్టాలు ఆ పారీ్టకి పట్టవు. ప్రజాసమస్యల పరిష్కారం కోసమే వారి ఐక్యత కోసం కాంగ్రెస్ కృషిచేస్తోంది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. కొద్దిరోజులుగా అస్సాంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర మార్గమధ్యంలో శనివారం పాపుం పరే జిల్లా గుండా అరుణాచల్ ప్రదేశ్‌లో అడుగుపెట్టింది. అరుణాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ నబాం టుకీ రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు. శనివారం ఒక్కరోజు మాత్రమే అరుణాచల్‌లో యాత్ర కొనసాగి ఆదివారం మళ్లీ అస్సాంలోకి అడుగుపెట్టనుంది -
సరైన దారిలో నడవండి: చైనా
బీజింగ్: ‘ఇప్పటికీ సమయం మించిపోయిందేమీ లేదు.. మీరు ప్రత్యేక వాదాన్ని విడిచి పెట్టి సరైన దారిలో నడవండి’ అని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు చైనా పిలుపునిచ్చింది. టిబెట్ వివాదానికి స్వస్తి పలికే ఉద్దేశంలో మధ్యేమార్గంగా టిబెట్‌కు స్వయంప్రతిపత్తి కల్పించాలని దలైలామా చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హాంగ్ లీ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘దలైలామా చైనాను విడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికీ సమయం మించిపోయింది లేదు. మీరు ప్రత్యేక వాదాన్ని విడిచి సరైన మార్గంలో నడవండి’ అని హితబోధ చేశారు. తమకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్ పై గతంలో టిబెట్ తో చైనా చర్చలు జరిపిన విఫలమయ్యాయి. గత కొన్నేళ్లు రెండు వైపుల చర్చలు లేవు. మరోవైపు ధర్మశాల (హిమాచల్‌ప్రదేశ్) నుంచి దలైలామా తిరిగి రావాలని కోరుతూ ఇటీవల కాలంలో 120 మందిపైగా టిబెటన్లు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారు.