DMHO Srinivasa Rao
-
రాష్ట్రంలో సెకండ్ వేవ్ ముగిసింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ముగిసిపోయిందని, కానీ థర్డ్ వేవ్ రాకుండా కోవిడ్ మార్గదర్శకాలను పాటించాల్సిందేనని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1.65 కోట్ల మందికి టీకాలిచ్చామన్నారు. 56 శాతం మందికి తొలి డోస్, 34 శాతం మందికి రెండో డోస్ పూర్తయిందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 90 శాతం మందికి తొలి డోసు వేయగా, హైదరాబాద్‌లో 100 శాతం సింగిల్ డోసు తీసుకున్నట్లు ఆయన బుధవారం మీడియాకు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటింటికీ తిరికి వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పోస్ట్ కోవిడ్‌తో ఆస్పత్రుల్లో ఎక్కువమంది ఉన్నారని, లాంగ్ టర్మ్ కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా మానసిక సమస్యలు పెరుగుతున్నాయన్నారు. అయితే అన్ని జ్వరాలను కరోనాగా భావించవద్దని, జ్వర లక్షణాలు ఉన్నోళ్లంతా వైద్యుడిని సంప్రదించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, అయితే ఈ వ్యాధులు పెరగకుండా వైద్య,ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోందన్నారు. రెండు జిల్లాల్లో అధికంగా డెంగీ కేసులు హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు అత్యధికంగా రాగా, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో మలేరియా కేసులు ఎక్కువగా వచ్చాయని శ్రీనివాసరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 220, ములుగు జిల్లాలో 120పైగా మలేరియా కేసులు నమోదైనట్లు చెప్పారు. గతేడాది రాష్ట్రంలో 2,173 డెంగీ కేసులు నమోదైతే, ఈ ఏడాది ఇప్పటికే 1,200 నమోదయ్యాయన్నారు. అందులో 448 డెంగీ కేసులు హైదరాబాద్‌లో నమోదయ్యాయన్నారు. దోమలు, లార్వా అభివృద్ధి చెందకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. లార్వాను సూచించే బృటా ఇండెక్స్ హైదరాబాద్‌లో 46 శాతం, రంగారెడ్డి జిల్లాలో 39.9 శాతం ఉందన్నారు. అనేక జిల్లాల్లో ఇది 35 శాతం కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. ‘ఎవరికైనా జ్వరం, విరేచనాలు, కళ్లు తిరగడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. పెద్ద ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. డెంగీ చికిత్స కోసం 24 ప్లేట్లెట్ ఎలక్ట్రిక్ యంత్రాలను సిద్ధంగా ఉంచాం. పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. డెంగీ దోమ పగటి వేళలోనే కుడుతుందని, అందువల్ల ఇళ్లలోకి దోమలు రాకుండా చూసుకోవాలన్నారు. 2025లోపు తెలంగాణను మలేరియారహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. చదవండి: ప్రేయసి కోసం ‘ఆమె’లా మారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన లవర్ చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ -
తెలంగాణ: ప్రభుత్వ కేంద్రాల్లో నేడు టీకా బంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టీకా కొరత కారణంగా సర్కారు ఆస్పత్రుల్లో ఆదివారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అయితే అధికారికంగా అలా ప్రకటించకుండా ఆదివారం సెలవు కాబట్టి నిలిపి వేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ఓ ప్రకటన జారీ చేశారు. సోమవారం నుంచి టీకా వేస్తామని ఆయన తెలిపారు. అయితే ఆదివారం కేంద్రం నుంచి 2.7 లక్షల టీకాలు వస్తేనే మరుసటిరోజు వ్యాక్సినేషన్ కొనసాగే అవకాశముంది. లేకుంటే ఆ రోజు కూడా కొనసాగుతుందా లేదా అన్నది తెలియడంలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా టీకా నిల్వలు తగ్గిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కడైనా ఉంటే నిర్దేశిత వయసుల వారు వేసుకోవచ్చని, లేదంటే వారు కూడా నిలిపివేస్తారని అంటున్నారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ టీకాల కార్యక్రమం ఆదివారం నిలిచిపోయే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సెకండ్ డోస్‌కే ప్రాధాన్యం.. మరో పక్క వ్యాక్సిన్ల కొరత వల్ల రాష్ట్రంలో కరోనా మొదటి డోస్‌కు తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ఇక నుంచి కొత్తవారికి టీకా వేయకూడదని వైద్య, ఆరోగ్య శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ల కొరత కారణంగా ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను సెకండ్ డోస్ వారికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అవసరమైనంత మేరకు స్టాక్ పంపించాక మళ్లీ మొదటి డోస్ టీకా ప్రక్రియ ప్రారంభిస్తామని.. అప్పటివరకు ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. వాస్తవంగా ప్రభు త్వం వద్ద ప్రస్తుతం లక్షన్నర వరకు మాత్ర మే టీకా డోస్‌లు ఉన్నాయి. మరో 2.7 లక్షల డోస్‌లు ఆదివారం కేంద్రం నుంచి వస్తాయి. అయితే రెండో డోస్ లబ్ధిదారులకు టీకాను తప్పనిసరిగా వేయాల్సిన అవసరముంది. ఇప్పుడు ఉన్నవి వారికే సరిపోవడం కష్టంగా ఉంది. వారికి సకాలంలో వేయకపోతే మొదటి డోస్ వేసి కూడా ప్రయోజనం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు 29.44 లక్షల మందికి టీకా.. శనివారం సాయంత్రానికి రాష్ట్రంలో 29.44 లక్షల టీకాలు వేశారు. అందులో 25.78 లక్షల మందికి మొదటి డోస్ వేయగా, 3.66 లక్షలు రెండో డోస్ వేశారు. రాష్ట్రంలో మొత్తం 1,147 ప్రభుత్వ, 225 ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకాలు వేస్తున్నారు. మొదట కోవాగ్జిన్ వేసుకున్నవారికి నాలుగైదు వారాల్లో, అలాగే కోవిషీల్డ్ వేసుకున్నవారికి 6–8 వారాల్లో రెండో డోస్ టీకా వేయాలి. అయితే ఉన్న టీకాలు ఒక్క రోజుకే సరిపోతాయి. మళ్లీ వచ్చే 2.7 లక్షల టీకాలు రెండ్రోజులకు కూడా సరిపోవు. కాబట్టి మొదటి డోస్‌కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చి, రెండో డోస్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకోసం కొన్ని టీకా కేంద్రాలను కూడా తాత్కాలికంగా మూసేయనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, కరోనా విజృంభిస్తుండడంతో అనేకమంది టీకా కోసం ఎగబడుతున్నారు. తమకు తెలిసినవారి ద్వారా పైరవీలు చేయించుకుంటున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తమ వారి కోసం టీకాలు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
సెకండ్ వేవ్: తెలంగాణ మరో మహారాష్ట్ర కానుందా..!
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు బయటకు వెళ్లినప్పుడు మాత్రమే ధరించాలని చెబుతూ వచ్చామని, ఇక నుంచి ఇంట్లోనూ పెట్టుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన వీడియో క్లిప్‌ను మీడియాకు విడుదల చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నా సరే మాస్క్ ధరించాలని కోరారు. ‘బయటకు వెళ్లి ఇంటికి వచ్చాక మాస్క్ వేసుకోకపోవడం వల్ల మీ ద్వారా ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులకు సోకే ప్రమాదం ఉంటుంది. తద్వారా వారు ఆసుపత్రులపాలై ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని’ఆయన హెచ్చరించారు. ఇళ్లు ఇరుకుగా ఉంటే వైరస్ మరింత వేగంగా విస్తరిస్తుందన్నారు. వైరస్ ఇప్పుడు గాలి ద్వారా వ్యాపించే పరిస్థితులు దాపురించాయని, ఇదేమీ తాను అతిశయోక్తిగా చెప్పడం లేదన్నారు. కాబట్టి ప్రజలంతా కరోనా జాగ్రత్తలు పాటించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే మహారాష్ట్ర పరిస్థితులు.. గత నాలుగు వారాలుగా రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని డాక్టర్ శ్రీనివాస రావు పేర్కొన్నారు. రాబోయే నాలుగు నుంచి ఆరు వారాల్లో ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇలాగే వదిలేస్తే (ప్రజలు తేలికగా తీసుకుంటే) తెలంగాణ కూడా మహారాష్ట్ర మాదిరిగా తయారవుతుందని ఆయన హెచ్చరించారు. కేసులు పెరుగుతున్నందున అనేక ఆసుపత్రుల్లో ఇప్పటికే పడకలు దొరక్క కొందరు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా, ఎన్ని పడకలు ఏర్పాటు చేసినా పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి వస్తుందన్నారు. ప్రభుత్వం కర్ఫ్యూ, లాక్డౌన్ వైపు వెళ్లడం లేదంటే.. అంతా బాగుందని అర్థం కాదన్నారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల జీవనోపాధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దెబ్బతినొద్దని భావించి ప్రభుత్వం అలాంటి చర్యలకు పూనుకోవడం లేదని ఆయన వివరించారు. అలాగే ఇతరత్రా ఆంక్షలు పెట్టాలనుకోవడం లేదన్నారు. స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితులు మరింత విషమించే అవకాశం ఉందన్నారు. ఇప్పుడున్న వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోందని, ఇంట్లో ఎవరికైనా ఒకరికి వస్తే, కొన్ని గంటల్లోనో లేదా ఒకట్రెండు రోజుల్లోనే అందరికీ సోకుతోందన్నారు. ప్రజారోగ్య వ్యవస్థ సిబ్బంది కూడా లక్షలాది మందిని కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. చదవండి: ‘కేసీఆర్, జానారెడ్డిలు తోడుదొంగలే..’ -
రోడ్డుపైనే గిరిజన మహిళ ప్రసవం
కాన్పు కోసం వెళ్తే నీళ్లులేవని వెనక్కి పంపిన ఆస్పత్రి సిబ్బంది ► మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట పీహెచ్సీలో ఘటన నవాబుపేట: ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు సురక్షి తం, సుఖవంతం.. ఇదీ ప్రభుత్వం, అధికారులు పదేపదే చెబుతున్న మాట. కానీ ఆస్పత్రిలో నీళ్లు లేవని కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణిని వెనక్కి పం పించారు సిబ్బంది. పురిటినొప్పులతో బాధపడు తున్న ఆమె నడిరోడ్డుపైనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండలంలోని నాగమ్మగడ్డ తండాకు చెందిన శారదమ్మ మూడో కాన్పు కోసం భర్త పున్యానాయక్, పక్కింటి మహిళ మల్లమ్మతో కలసి ఆదివారం రాత్రి నవాబుపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి ఆటో లో వచ్చింది. ప్రసవం చేయాల్సిన ఆస్పత్రి సిబ్బంది.. ‘ఇక్కడ నీళ్లు లేవు.. మరో ఆస్పత్రికి వెళ్లండి’ అంటూ ఉచిత సలహా ఇచ్చి పంపించేశారు. దీంతో వారు స్థానిక బస్టాండ్ ప్రాంగణానికి చేరుకున్నారు. స్థానికు లు ఆమె ఇబ్బందిని గమనించి ‘108’ అంబులెన్స్ వాహనానికి సమాచారం ఇచ్చారు. నొప్పులు మరీ అధికమవడంతో అక్కడే ఉన్న ఆటోడ్రైవర్ తదితరు లు చీరను అడ్డుపెట్టగా కాన్పు చేశారు. శారదమ్మ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సిబ్బందిపై డీఎంహెచ్ఓ ఆగ్రహం ఆస్పత్రి సిబ్బంది తీరుపై డీఎంహెచ్ఓ శ్రీనివాస్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం నవాబు పేట పీహెచ్‌సీని సందర్శించి, నిర్లక్ష్యంగా వ్యవహరిం చిన మండల వైద్యాధికారి మోహన్‌పై చర్యలు తీసుకుని, కలెక్టర్‌కు నివేదిక ఇస్తామన్నారు.