తెలంగాణ: ప్రభుత్వ కేంద్రాల్లో నేడు టీకా బంద్‌‌ | Telangana: Corona Vaccine Closed Today | Sakshi
Sakshi News home page

తెలంగాణ: ప్రభుత్వ కేంద్రాల్లో నేడు టీకా బంద్‌‌

Published Sun, Apr 18 2021 4:08 AM | Last Updated on Sun, Apr 18 2021 12:11 PM

Telangana: Corona Vaccine Closed Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా టీకా కొరత కారణంగా సర్కారు ఆస్పత్రుల్లో ఆదివారం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అయితే అధికారికంగా అలా ప్రకటించకుండా ఆదివారం సెలవు కాబట్టి నిలిపి వేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు ఓ ప్రకటన జారీ చేశారు. సోమవారం నుంచి టీకా వేస్తామని ఆయన తెలిపారు.

అయితే ఆదివారం కేంద్రం నుంచి 2.7 లక్షల టీకాలు వస్తేనే మరుసటిరోజు వ్యాక్సినేషన్‌ కొనసాగే అవకాశముంది. లేకుంటే ఆ రోజు కూడా కొనసాగుతుందా లేదా అన్నది తెలియడంలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా టీకా నిల్వలు తగ్గిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఎక్కడైనా ఉంటే నిర్దేశిత వయసుల వారు వేసుకోవచ్చని, లేదంటే వారు కూడా నిలిపివేస్తారని అంటున్నారు. అయితే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ టీకాల కార్యక్రమం ఆదివారం నిలిచిపోయే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

సెకండ్‌ డోస్‌కే ప్రాధాన్యం.. 
మరో పక్క వ్యాక్సిన్ల కొరత వల్ల రాష్ట్రంలో కరోనా మొదటి డోస్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ వేశారు. ఇక నుంచి కొత్తవారికి టీకా వేయకూడదని వైద్య, ఆరోగ్య శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ల కొరత కారణంగా ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను సెకండ్‌ డోస్‌ వారికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం అవసరమైనంత మేరకు స్టాక్‌ పంపించాక మళ్లీ మొదటి డోస్‌ టీకా ప్రక్రియ ప్రారంభిస్తామని.. అప్పటివరకు ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. వాస్తవంగా ప్రభు త్వం వద్ద ప్రస్తుతం లక్షన్నర వరకు మాత్ర మే టీకా డోస్‌లు ఉన్నాయి. మరో 2.7 లక్షల డోస్‌లు ఆదివారం కేంద్రం నుంచి వస్తాయి. అయితే రెండో డోస్‌ లబ్ధిదారులకు టీకాను తప్పనిసరిగా వేయాల్సిన అవసరముంది. ఇప్పుడు ఉన్నవి వారికే సరిపోవడం కష్టంగా ఉంది. వారికి సకాలంలో వేయకపోతే మొదటి డోస్‌ వేసి కూడా ప్రయోజనం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటివరకు 29.44 లక్షల మందికి టీకా..
శనివారం సాయంత్రానికి రాష్ట్రంలో 29.44 లక్షల టీకాలు వేశారు. అందులో 25.78 లక్షల మందికి మొదటి డోస్‌ వేయగా, 3.66 లక్షలు రెండో డోస్‌ వేశారు. రాష్ట్రంలో మొత్తం 1,147 ప్రభుత్వ, 225 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో టీకాలు వేస్తున్నారు. మొదట కోవాగ్జిన్‌ వేసుకున్నవారికి నాలుగైదు వారాల్లో, అలాగే కోవిషీల్డ్‌ వేసుకున్నవారికి 6–8 వారాల్లో రెండో డోస్‌ టీకా వేయాలి. అయితే ఉన్న టీకాలు ఒక్క రోజుకే సరిపోతాయి. మళ్లీ వచ్చే 2.7 లక్షల టీకాలు రెండ్రోజులకు కూడా సరిపోవు.

కాబట్టి మొదటి డోస్‌కు తాత్కాలిక బ్రేక్‌ ఇచ్చి, రెండో డోస్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకోసం కొన్ని టీకా కేంద్రాలను కూడా తాత్కాలికంగా మూసేయనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, కరోనా విజృంభిస్తుండడంతో అనేకమంది టీకా కోసం ఎగబడుతున్నారు. తమకు తెలిసినవారి ద్వారా పైరవీలు చేయించుకుంటున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తమ వారి కోసం టీకాలు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement