సొంత రాష్ట్రానికి తరలిన బాలకార్మికులు
హైదరాబాద్: పాత బస్తీలోని అనేక పరిశ్రమల్లో ప్రమాదకర పరిస్థితుల మధ్య పనిచేస్తూ పోలీసుల కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో దొరికిన చిన్నారులను వారి స్వస్థలాలకు పంపే కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ప్రస్తుతం రామంతాపూర్ డాన్బాస్కోలో ఆశ్రమం పొందుతున్న 271 మంది బాల కార్మికులలో మొదటి విడతగా 82 మందిని ఉదయం 10 గంటలకు పాట్నా ఎక్స్ప్రెస్లో పంపించారు. రైలులో వెళుతున్న బాల కార్మికులకు పర్యవేక్షకులుగా డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారి, ఆరుగురు సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు బాలల సంరక్షణాధికారులు వెళ్లారని జిల్లా బాలల సంరక్షణాధికారి ఇంతియాజ్ తెలిపారు.
పాట్నాలో స్థానిక పోలీస్ స్టేషన్ అధికారుల సమక్షంలో ఈ బాల కార్మికులను వారి వారి తల్లిదండ్రులకు బాలల రక్షణాధికారులు అప్పగిస్తారని ఆయన తెలిపారు. ప్రస్తుతం డాన్బాస్కోలో ఉన్న 129 మంది బాల కార్మికులను వచ్చే వారం రోజుల్లో వారి వారి స్వస్థలాలకు తరలిస్తామన్నారు.