గాడిద అరెస్ట్..!
ముంబై: దేశవ్యాప్తంగా ఆవుపై చర్చ జరుగుతుండగా మహారాష్ట్ర పోలీసులు మాత్రం మరో మూగజీవం వెంట పడ్డారు. తిట్ల దండకంలో తరచుగా ప్రస్తావనకు వచ్చే గాడిదను మాలెగావె పోలీసులు పట్టుకున్నారు. రాజకీయ ర్యాలీలో పాల్గొనేందుకు రావడమే అది చేసిన నేరం.
మాలెగావ్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతిని వ్యతిరేకిస్తూ జేడీ(ఎస్) కార్యకర్తలు గురువారం రోడ్ షో తలపెట్టారు. ప్రత్యేక ఆకర్షణ కోసం గాడిదను కూడా తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. గాడిదతో పాటు దాన్ని తీసుకొచ్చిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ర్యాలీకి అనుమతి తీసుకున్నారని, అయితే గాడిదను తీసుకొస్తున్న విషయం ముందుగా తమకు తెలియదని మాలెగావ్ అదనపు ఎస్పీ సునీల్ కదాస్నే తెలిపారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని భావించి ఈ చర్యను అడ్డుకున్నామన్నారు. గాడిదను అదుపులో తీసుకున్న విషయాన్ని కోర్టుకు తెలుపుతామని చెప్పారు.
గాడిదను ఆటోలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆటో నుంచి దిగేందుకు గార్దభం మొరాయించడంతో పోలీసుల కష్టపడాల్సివచ్చింది. తర్వాత దానిని పంజ్రాలోని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.