వివరాలతో కౌంటర్లు దాఖలు చేయండి
- అంబేడ్కర్ వర్సిటీ సేవల వివాదంపై హైకోర్టు
- ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకూ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంతీయ కేంద్రాలకు సేవల నిలుపుదల విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు గురువారం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందుకు రెండు వారాల గడువునిచ్చింది. అప్పటి వరకూ ప్రాంతీయ కేంద్రాలకు సేవలందించాలని టీ సర్కార్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ మేర కు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర విభజన తరువాత ఏపీలో అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ సేవలు నిలిచిపోవడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకమైం దని, ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ గత నెల 25న సాక్షి ‘కథనం’ ప్రచురించింది. దీన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టింది. ధర్మాసనం గురువారం ఈ వ్యాజ్యాన్ని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏజీ కొండం రామకృష్ణారెడ్డి ఏపీ తమతో ఒప్పందం కుదుర్చుకోనప్పుడు సేవలం దించాల్సిన అవసరం తమకు లేదన్నారు.
ఏపీ ఏజీ పరాంకుశం వేణుగోపాల్ వాదనలు విని పిస్తూ సార్వత్రిక వర్సి టీ కార్పస్ ఫండ్ కింద రూ.400 కోట్లు ఉన్నాయని చెప్పగా ‘కార్పస్ ఫండ్‌లో నుంచి కొంత మొత్తాన్ని ఏపీ ప్రాంతీ య కేంద్రాలకు వెచ్చించడానికి ఉన్న ఇబ్బంది ఏంటి?’ అని రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి ధర్మా సనం వ్యాఖ్యానించింది. సార్వత్రిక వర్సిటీ రెండేళ్ల ఆస్తిఅప్పుల పట్టీలను తమ ముందుం చాలని, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది.