‘నీ లంచం తిరిగి ఇచ్చేస్తున్నా..ఆల్ ద బెస్ట్’
విల్లింగ్టన్ : డ్రాగన్లపై పరిశోధన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఓ పదకొండేళ్ల బాలిక ఇవ్వజూపిన లంచాన్ని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డర్న్ తిరస్కరించారు. తన లాంటి చిన్న పిల్లలు ఇచ్చే సూచనలు, సలహాలు తప్పక పాటిస్తామని, అయితే పని చేయడం కోసం ఇలా డబ్బు ఇవ్వడం మంచిది కాదని సున్నితంగా హెచ్చరించారు. ఈ మేరకు..‘సైకిక్స్, డ్రాగన్స్ గురించి నువ్విచ్చే సలహాలు స్వీకరించేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధం. కానీ దురదృష్టవశాత్తూ మనం ఇప్పుడు వాటిపై పరిశోధనలు చేయడం లేదు. నువ్వు లంచంగా ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేస్తున్నా. టెలికినెసిస్, టెలిపతి, డ్రాగన్లపై నీకున్న ఇంటరెస్ట్ అమోఘం. ఆల్ ద బెస్ట్. నేను కూడా ఇక నుంచి డ్రాగన్లపై ఓ కన్నేసి ఉంచుతా. అవి సూట్ తొడుక్కుంటాయా’ అంటూ జెసిండా పేరిట ప్రధాని కార్యాలయం సదరు బాలికకు లేఖ రాసింది.
ఇంతకీ విషయమేమిటంటే.. విక్టోరియా అనే బాలికకు డ్రాగన్స్, టెలీపతి, మనుషుల మనస్సును చదివే అంశాలంటే ఎంతో ఆసక్తి. నెట్ఫ్లిక్స్లో ప్రసారమయ్యే స్కై ఫై సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ను వీక్షించినప్పటి నుంచి నిరంతరం వాటి గురించే ఆలోచిస్తోందని ఆమె సోదరుడు పేర్కొన్నాడు. డ్రాగన్ ట్రెయినర్గా మారాలన్నది తన కల అని తెలిపాడు. ఈ క్రమంలోనే అతీత శక్తులపై పరిశోధనలు జరపాలంటూ ప్రభుత్వాన్ని కోరడంతో పాటు.. ఇందుకు సంబంధించి రాసిన లేఖకు ఐదు డాలర్లు(న్యూజిలాండ్) జత చేసినట్లు పేర్కొన్నాడు.