drankandraiv
-
మత్తు దిగాల్సిందే..!
సిద్దిపేటకమాన్: ‘‘పట్టణంలో నివసిస్తూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న బండి సురేష్ (పేరు మార్చాం) తన స్నేహితులతో కలిసి పది రోజుల క్రితం పట్టణ శివారులో మందు తాగి పార్టీ చేసుకున్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. సిద్దిపేట ఎంపీడీవో చౌరస్తాలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో దొరికిపోయాడు. సీన్ కట్ చేస్తే.. మోతాదుకు మించి మద్యం సేవించిన సురేష్‌కు జరిమానా, రెండు రోజుల జైలు శిక్ష విధించారు.’’ ఇది ఈ ఒక్క సురేష్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలీసులు మందుబాబుల మత్తు వదిలిస్తున్నారు. గత నాలుగు నెలల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 751 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. అందులో అధిక మోతాదులో మద్యం సేవించిన 219 మందిని జైలుకు పంపించడం జరిగింది. అలాగే రూ.10,62,900 లను జరిమానా విధించారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురవ్వడమే కాకుండా, రోడ్డు వెంట వెళ్లే వారికి ప్రాణసంకటంగా మారుతున్న మందుబాబులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సిద్దిపేట పట్టణంతో పాటు కమిషనరేట్ పరిధిలో, ప్రముఖ కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తూ వాహనదారులను బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షిస్తున్నారు. మద్యం సేవించినట్లు తేలితే వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో పాటు ఆన్లైన్లో వారి వివరాలు నమోదు చేసి, కేసు ఫైల్ చేస్తున్నారు. పట్టుబడితే ఆన్లైన్లోనే మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. మద్యం తాగుతున్న వారిలో 70శాతం మంది ప్రమాదాలకు గురవుతుండడంతో వారిని గుర్తించి పట్టుబడిన వారి ప్రతి ఒక్కరి వివరాలు కంప్యూటరీకరిస్తున్నారు. అతిగా మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనం నడిపిన వారి వివరాలన్నీ ఫొటోతో సహా ఉంటాయి. దీంతో మరోసారి పట్టుబడినప్పుడు కేసుల భయంతో పేర్లు తప్పు చెప్పినా అప్పటికే వివరాలన్నీ ట్యాబ్‌లో వారి వద్ద ఉండడంతో తప్పించుకోలేని పరిస్థితి. ఒకటి అంతకు మించి పట్టుబడిన వివరాల ఆధారంగా న్యాయస్థానంలో వారిపై నివేదిక ఇవ్వడం ద్వారా జైలుశిక్ష, జరిమానా విధించనున్నారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి కేవలం నాలుగు నెలల్లోనే సిద్దిపేట జిల్లా పోలీసులు 417 మందిని డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా పట్టుకుని జరిమానా విధించడం, మరీ అధిక మోతాదులో మద్యం సేవించిన 94మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. వీరిలో ఒకరోజు, రెండు రోజులతో పాటు వారం రోజుల వరకు జైళు శిక్ష పడ్డవారు కూడా ఉన్నారు. నాలుగు నెలల్లో మందుబాబుల నుంచి రూ.7,00,900లను కోర్టు జరిమాన విధించింది. కాగా 2018లో 1055 కేసులు నమోదు చేసి 186 మందికి జైలు శిక్ష, రూ. 13,41,400 జరిమానా విధించడం జరిగింది. బీఏసీ లెక్కింపు ఇలా బ్రీత్ ఎనలైజర్లు వాహనం నడిపేవారి శరీరంలో ఉన్న ఆల్కహాల్ శాతాన్ని బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఎసీ) ద్వారా లెక్కిస్తాయి. ప్రతి వంద మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటే ఉల్లంఘన కింద లెక్క. అతిగా మద్యం సేవిస్తే బీఎసీ సుమారు 550 దాకా ఉంటుంది. 100 బీఎసీ కంటే ఎక్కువగా ఉంటే జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. జైలు శిక్ష.. లైసెన్స్‌లు రద్దు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై ఎంవీ యాక్ట్, సెక్షన్ 185 కింద కేసులు నమోదు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి రూ. 500 నుంచి రెండు వేల వరకు జరిమానాలు విధిస్తున్నారు. ఒక రోజు, రెండు రోజుల జైలు శిక్షతో పాటు నెల రోజుల వరకు జైళు శిక్ష విధిస్తున్నారు. రెండోసారి మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్‌ల రద్దు కోసం కూడా సిఫారసు చేస్తున్నారు. ఒకసారి లైసెన్స్ రద్దయితే మరో రెండేళ్ల వరకూ లైసెన్సులు పొందలేరు. ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం తరచూ నిర్వహిస్తున్న డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు సత్ఫలితాలను ఇస్తుంది. ద్విచక్ర వాహనదారులు, భారీ వాహనాలను మద్యం మత్తులో వాహనాలను నడిపే వారికి జరిమానా, జైలు శిక్ష విధించడంతో మార్పు వస్తుంది. మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల కలిగే అనర్థాల గురించి సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నాం. పట్టుబడిన వారిలో మార్పు రావడానికి వారి కుటుంబ సభ్యుల సవుక్ష్యంలో కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నం. – సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ -
తాగి నడిపితే జైలుకే..
మంచిర్యాలక్రైం: మద్యం తాగి వాహనాలు నడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ డ్రైవింగ్ ప్రమాదమని తెలిసినా మత్తులోనే వాహనం నడుపుతున్నారు. వారు ప్రమాదాలకు గురికావడమే కాకుండా ఇతరుల మరణాలకూ కారణమవుతున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం డ్రంక్‌అండ్‌డ్రైవ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ తాగి వాహనం నడిపే వారిని జైలుకు పంపిస్తున్నారు. పెరుగుతున్న కేసులు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రోజురోజుకు పెరుతుండడంతో ప్రభుత్వానికి కూడా అదే స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. మద్యం తాగి వాహనాలు నడపడంతో మంచిర్యాల జిల్లాలో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. జాతీయ రహదారిపై మంచిర్యాల జిల్లా మీదుగా వెళ్లడంతో మద్యం తాగి వాహనాలు నడిపే వారిని నియంత్రించేందుకు శ్రీరాంపూర్, సీసీసీ, ఏసీసీ, పాత మంచిర్యాల సమీపంలో పోలీసులు తరుచూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, చెన్నూర్, బెల్లంపల్లి ప్రాంతాలకు ప్రధాన కేంద్రం మంచిర్యాల కావడంతో నిత్యం రోజుకు లక్షాలాది మంది ప్రజలు వ్యాపారులు, ఉద్యోగులు, మంచిర్యాలకు వచ్చి పోతుంటారు. ఈ క్రమంలో ఇక్కడనే మందు, విందు అన్ని రకాల పనులు చేసుకొని వెళ్తుంటారు. ఈ క్రమంలో శ్రీరాంపూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై, శ్రీ రాంపూర్, లక్సెట్టిపేట వైపునకు వెళ్లే రహదారులపై తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారి పక్కనే రహస్యంగా బెల్ట్‌షాపులు, దాబాల్లో అక్రమ సిట్టింగులు ఉండటంతో వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపడం పరిపాటిగా మారింది. పర్సెంటేజీ ప్రకారమే శిక్ష డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి మద్యం తాగిన పర్సేంటేజీని బట్టి కేసు నమోదు చేయడంతోపాటు జైలుకు పంపే విధానాన్ని ఖరారు చేశారు. సుమారు 30కి పైగా పర్సెంటేజీ వస్తే పోలీసులే జరిమానా విధించి, కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. రెండుసార్లు పట్టుబడితే కేసులు నమోదు చేసి జైలుపు పంపుతున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత మూడేళ్లలో 9,477 మందిపై కేసులు నమోదు కాగా, ఇందులో 459 మంది జైలుకు వెళ్లారు. శిక్ష పడిన వారి లైసెన్స్‌ను కూడా రద్దు చేయాలని జిల్లా రవాణాశాఖ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్యం తాగి వాహనం నడుపుతున్న వారు ప్రమాదంలో మృతి చెందినా, గాయపడ్డ ఎలాంటి బీమా సదుపాయం వర్తించదని ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పునివ్వడం గమనార్హం. అవగాహన కల్పిస్తున్నా.. జిల్లాలో డ్రంకన్ డ్రైవ్‌తో జరుగుతున్న ప్రమాదాల నివారణకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా ఆటోడ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, లారీడ్రైవర్లు ఇతర ప్రైవేటు వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ ఇటీవల కళాకారుల మద్యం, పేకాట, డ్రంకన్ డ్రైవ్, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాల నిర్మూలనకు కళాబృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కళాబృందాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వారంలో నాలుగు రోజులు కళాబృందాలతో ఆటాపాటల ద్వారా మద్యం తాగడం వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నా మందుబాబులు పట్టుపడుతూనే ఉన్నారు.