drizzle
-
భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం
-
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో వాతావరణం చల్లబడింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురు గాలులతో పాటు చిరుజల్లులు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం బాగానే కురిసింది. జూభ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్పల్లి, సికింద్రబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో నగరవాసులు వడగాల్పుల నుంచి ఉపశమనం పొందారు. తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం -
చల్లబడిన బెజవాడ
సాక్షి, అమరావతి: వేడిగాలులు, సెగలు అల్లాడిపోతున్న విజయవాడ వాసులకు ఉపశమనం లభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ వాతావరణం చిరుజల్లులతో స్వాగతం పలికింది. నిన్నటి వరకు వడగాల్పులతో అట్టుడికిపోయిన బెజవాడ నగరం చిరుజల్లుల రాకతో చల్లబడింది. బుధవారం రాత్రి నుంచి మొదలైన చిరుజల్లులతో విజయవాడ వాసులు ఉపశమనం పొందారు. గురువారం ఉదయం కూడా వాతావరణం చల్లగా ఉండటంతో ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం ఇందిరాగాంధి మునిసిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంలో ఇలా చిరు జల్లులతో వాతావరణం చల్లబడడంతో నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనా కాలంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డి రాష్ట్ర పాలనాపగ్గాలు స్వీకరిస్తున్న తరుణంలో విజయవాడ నగరంతో పాటు పలు జిల్లాల్లో వర్షం కురవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహానేత తనయుడికి ప్రకృతి ఇలా స్వాగతం పలికిందని వ్యాఖ్యానిస్తున్నారు. వాతావరణం చల్లబడటంతో ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. -
కోస్తాకు పిడుగులు.. జల్లులు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత కొద్దిరోజులతో పోల్చుకుంటే పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు మాత్రమే అధికంగా రికార్డవుతున్నాయి. కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కొనసాగుతోంది. శనివారం కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులకు ఆస్కారం ఉందని పేర్కొంది. మరోవైపు రాయలసీమలో ఉష్ణతీవ్రత కొనసాగనుంది. శనివారం అక్కడ సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా తిరుపతితో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. రానున్న రెండు రోజులు వడగాడ్పుల ప్రభావం ఉండదని ఐఎండీ వివరించింది. గడచిన 24 గంటల్లో వేపాడ, నందిగామల్లో 3 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది. -
మరో ఐదు రోజులు వర్షాలు అంతంతే..
జగిత్యాల అగ్రికల్చర్: రానున్న ఐదు రోజులపాటు వర్షాలు అంతంతమాత్రంగానే కురియనున్నట్లు పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ లక్ష్మణ్ తెలిపారు. ఆగస్టు 17 నుంచి 21వరకు ఆకాశం పాక్షికంగా మేఘావృతమైనా చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ చిరుజల్లులు సైతం ఆగస్టు 19న 5 మి.మీ, 20న 8 మి.మీ, 21న 6 మి.మీ వర్షం మాత్రమే కురిసే అవకాశం ఉందని వివరించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 31–38 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రతలు 24–25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం ఉదయం 64–69 శాతం, మధ్యాహ్నం 64–76 శాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి దిశ నుంచి గంటకు 9–15 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.