ఓటు హక్కు వినియోగంతోనే లక్ష్య సిద్ధి
‘ఓటు కోసం నడక’లో డీఆర్వో నాగబాబు
గుంటూరు ఈస్ట్: ప్రతి ఒక్కరూ నిర్భయంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందని డీఆర్వో నాగబాబు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం ఁఓటు కోసం నడక* నిర్వహించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, అదనపు ఎస్పీలు రామాంజనేయులు, భాస్కరరావు, ఆర్డీవో భాస్కర్ నాయుడు, ఎస్బీ డీఎస్పీ రామాంజనేయులు, పలు శాఖల జిల్లా అధికారులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆర్డీవో నాగబాబు జెండా ఊపి ప్రారంభించిన నడక పోలీసు పరేడ్ గ్రౌండ్ నుంచి పాత బస్టాండ్ సెంటర్లోని ఉర్దూ పాఠశాల వరకు సాగింది. పలు నినాదాలతో కూడిన ప్లకార్డులను దారిపొడవునా ప్రదర్శించారు. ఓటు హక్కు విలువను తెలియజేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఆర్వో నాగబాబు మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు.
18 ఏళ్లు నిండినవారందరూ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ప్రపంచంలోనే పెద్దదైన మన ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ పెద్ద పండుగని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు వేసి దేశ భవిష్యత్తును గొప్పగా మార్చాలని కోరారు. ఆర్డీవో భాస్కర్ నాయకుడు మాట్లాడుతూ దేశంలోని ఎన్నికల ప్రక్రియ భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తుందని చెప్పారు.