'గాంధీ'లో ఎమ్మెల్యే భార్యకు షాక్
- తీరు మారని గాంధీ సిబ్బంది వైఖరి
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి సిబ్బంది తీరు మరోసారి వివాదస్పదమైంది. సిబ్బంది నిర్లక్ష్యంపై ఎన్నిసార్లు విమర్శలు వచ్చినా వారు మారడం లేదు. తాజాగా చికిత్స నిమిత్తం గాంధీకి వచ్చిన ఎమ్మెల్యే భార్యను సైతం సిబ్బంది లంచం అడగటం కలకలం రేపుతోంది. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత మంగళవారం తమ సమీప బంధువు మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో చికిత్స కోసం గాంధీ హాస్పిటల్ కు వచ్చారు.
అయితే ఆమెను అక్కడ సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఆమే స్వయంగా వీల్‌ఛైర్ తీసుకొచ్చి అతడిని కూర్చోబెట్టి ఆస్పత్రిలోపలికి తీసుకెళ్లారు. అంతేకాకుండా వీల్ ఛైర్ వార్డులోకి తీసుకెళ్లడానికి ఎమ్మెల్యే భార్యను సిబ్బంది లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. ఒక ఎమ్మెల్యే భార్య పరిస్థితే ఇలా ఉంటే మిగతా వారి పరిస్థితి ఏంటని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా గాంధీ సూపరిండెంట్ కానీ , అధికారులు కానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.