dwaram venkataswamy naidu
-
ఫిడేలు తాతగారు
చిన్నప్పటినుంచీ మా చిన్నతాతకు సంబంధించిన మూడు పెట్టెల గురించి వింటూ పెరిగాను. ఒకటి ఆయన ఫిడేలు పెట్టె. చలం ‘మ్యూజింగ్స్’లో రాశారు కదా. నాయుడుగారూ, చలంగారూ ఒకసారి ఒకే రైలుపెట్టెలో ప్రయాణం చేయడం గురించి. ఏలూరు అడ్వొకేట్ పి.వి.రమణారావుగారికి నాయుడుగారన్నా, వీణధనమ్మాళ్ అన్నా గొప్ప ఆరాధన. ఆయన కూడా ఆ రోజు నాయుడుగారితోపాటు ఆ రైలులోనే ప్రయాణం చేస్తున్నారు. ఆ రమణరావుగారి మాటలెట్లా ఉన్నాయో చలం రాస్తారు. ఆ రైలుబండి, ఆ పట్టాలూ అన్నీ నాయుడుగారి కోసం, ఆ ఫిడేలు కోసమే వేసినట్లూ, మిగతావారంతా వాళ్ళ అదృష్టంకొద్దీ ఆ బండెక్కినట్లూనట. ‘‘అయ్యో, ముట్టుకోకండి, అది నాయుడుగారి వయొలిన్’’ అని గాభరా పడతాడు రమణారావు. ఆరాధనంటే అదీ అంటారు చలం. పైగా నాయుడుగారు చలంగార్ని అడిగారట, ‘మీ పుస్తకాలేమైనా పంపించండి’ అని. అమ్మో నాయుడుగారు నా పుస్తకాలు చదువుతారా అని నివ్వెరపోయారు చలం. ∙∙ చిన్నపిల్లల మధ్య వయొలిన్‌తో చిన్నతాత విన్యాసాలు చూసి తీరాలి. పది పదిహేనుమంది కూర్చునేవారు ఆయన చుట్టూనూ. తలుపులన్నీ మూయించేసేవారు. చిన్న వెలుతురు మసకచీకటిలా ఉండేది. ఆయన పచార్లు చేస్తుంటే నన్నో, మా చెల్లి మనోరమనో ఒక వయొలిన్‌తో కూర్చుని ఒక సాకీ లాగనో, రిఫ్రైన్ లాగనో ‘ఓరోరి బండివాడా వగలమారి బండివాడా’ పల్లవి మెల్లగా వాయించమనేవారు. పచార్లు చేస్తూనే మధ్యలో ఆయన ఆ పాట అందంగా వాయించేవారు. పచార్లు ఆగేవికావు. పాట బండిలాగా సాగిపోతూనే ఉండేది. మధ్యమధ్యలో బండిచక్రం కిర్రు చప్పుడు వినిపించేవారు. ఎడ్ల మెడలో గంటలు, బండివాడి ‘ఎహెయ్’ అరుపూ, చెట్లమీంచి పక్షుల కలరవాలు, వీధిలో కుక్కలు మొరగటం, గాడిద అరుపులూ ఇవన్నీనూ. పిల్లలు నవ్వేవారు. ఆ నవ్వులు కూడా ఆయన ఫిడేలు అనుకరించేది. ఇంతేనా! సడెన్‌గా అలా నడుస్తూనే వయొలిన్ వీపువెనకాతలకి తలక్రిందులుగా దించి కుడిచెయ్యి కమాను సరిగ్గా తీగలమీద పడేట్టు చేసి పాట బ్రేక్ లేకుండా కంటిన్యూ చేసేవారు. అమ్మో! అని పిల్లల కేకలు. మళ్ళీ నడక. ఈసారి నిలబడిపోయి ఒక కాలు ఎత్తి వయొలిన్ కాళ్ళ మధ్యనుంచి వెనక్కీ ప్రక్కకీ పెట్టి అదే పాట వాయించడం. ఇందాకటి వీపుగోకుడు వాద్యం ఆట గురించి నేను తర్వాత ‘‘ఇదేవిటండీ ఎక్కడా వినలేదు, కనలేదు, కథల్లో చదవలేదు’’ అంటే, ఆయన ఇంకెవరూ లేకుండా చూసి నాతో చెప్పారు. ‘‘ఓయ్, నా చిన్నప్పుడు పెళ్ళి ఊరేగింపుల్లోనూ, దేవుడు ఊరేగింపుల్లోనూ సానిమేళా లుండేవోయ్. ఆ మేళాల్లో ఫిడేలు ఉండేది. నాట్యం ఆగిపోయినప్పుడు ఆ ఫిడేలు వాయించేవాళ్ళు ఇలాంటి ఫీట్స్ చేసేవాళ్ళు జనాల కోసం. అవి ఇప్పుడు పోయాయి. అందుకని మీకు కొత్త’’. ఫీట్స్ ఎవరైనా ప్రయత్నించి చెయ్యగలరేమో కాని అంత ప్రిసిషన్, కౌశలం, శ్రుతిభాగ్యం, నాజూకు, సుతారం, ఫీట్స్‌లో కూడా ఉండాలంటే అసాధారణ రహస్య పరిశ్రమా? లేదా అది ఒక అసామాన్య, అతీత సహజశక్తా? ఆయనతో పోల్చగలిగిన మాస్టరీ నాకైతే చార్లీ చాప్లిన్లో మాత్రమే కనిపిస్తుంది. (ద్వారం వెంకటస్వామినాయుడు జయంతి నవంబర్ 8న మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో వీవీఐటీ, నంబూరు ప్రచురిస్తున్న ‘ఫిడేలు నాయుడుగారు’ విడుదల కానుంది. ) - ద్వారం దుర్గాప్రసాదరావు -
ఫిడేల్ నాయుడు గారు
1914 ప్రాంతంలో విశాఖపట్నం ‘మై ఫ్రెండ్స్’ సంఘంలో ఓ ఇరవైయేళ్ల కుర్రాడు సుశ్రావ్యమైన గోష్ఠి చేస్తే, అతడి వాయులీన వైదుష్యాన్ని మెచ్చుకొని మారేపల్లి రామచంద్ర శాస్త్రి బంగారపు ఉంగరం వేలికి తొడుగుతూ ఆ విద్వాంసుడికి ‘ఫిడేలు నాయుడు’ అని నామకరణం చేశారు. తదాది ఆ వేలికి ఉంగరం, ఆ వ్యక్తికా పేరు స్థిరంగా ఉండిపోయాయి. తర్వాత ద్వారం వేంకట స్వామి నాయుడుగారు విజయనగరం కోటలో కచేరి చేసినపుడు, ఆస్థాన విద్వాంసుడు ఆదిభట్ల నారాయణ దాసు విని వివశుడై ‘జీనియస్’ అంటూ ఆరున్నర శృతిలో అన్నారట. చివరిదాకా ఆదిభట్ల ఆ మాట మీదే ఉన్నారు. అంతకుముందు సంగీతంలో మెలకువలు, పైసంగతులు నేర్వాలని ద్వారం విజయనగర సంగీత పాఠశాల ద్వారంలో నిలబడితే– ఆయన వేదనని, వాదనని విని ‘నువ్వు గురు స్థానంలో ఉండాల్సిన వాడివి’ అంటూ విజయనగరం సంగీత కళాశాల ఉచితాసనమిచ్చి కూర్చోబెట్టింది. వజ్రం వెతకదు, వెతకబడుతుంది. ఆధార షడ్జమంలోనే నాయుడు ‘రవ’ళిం పుని జాతి పసిగట్టింది. ఇక తర్వాతిదంతా చరిత్ర. ‘ఈ చిన్న కర్రముక్కని చేతికిచ్చి ఈ సంగీత సముద్రం ఈదమన్నాడు దేవుడు. నావల్ల ఏమవుతుంది?’ అని భయపడుతూనే సంగీత సాగరంలో లక్షలాదిమందిని ఓలలాడించి ధన్యులయ్యారు ఫిడేలు నాయుడుగారు. ఆయన సిద్ధుడు. అనితర సాధ్యమైన సాధనతో వాయులీనాన్ని పూర్తిగా వశపరచుకుని గుండెలకు హత్తుకుని వాయులీన అంతరంగాన్ని అర్థం చేసుకున్నారు. రాగ ప్రస్తా రాన్నిబట్టి మొహమల్ వస్త్రంమీద ముత్యాలు జారినంత మృదువుగా ఉక్కుతీగెలను పలికించగలరు. కొన్ని సందర్భాలలో పున్నాగ పరిమళం శ్రోతల్ని కమ్ముకుంటుంది. ఆయన ఉన్న రోజుల్లో దక్షిణాది ప్రజ హారతులు పట్టింది. దేశం ఫిడేలు నాయుడు గారిని గుర్తించింది. 1957లో భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ బిరుదు ప్రదానం చేసింది. అప్పటికే ప్రతిష్టాత్మకమైన బంగారు పతకాలు అందుకున్నారు. పౌర సన్మానాలు, దర్బారు ఆహ్వానాలు లెక్కకుమించి జరిగాయి. గాంధర్వ విద్యాభూషణ, గానకళా విశారద, సంగీత కళానిధి, డాక్టర్ ఆఫ్ లెటర్స్ (శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం) నాయుడుగారిని అలంకరించాయి. 1950లో ఆంధ్రా యూనివర్సిటీ కళాప్రపూర్ణతో గౌరవించింది. 1964లో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన సంగీత విద్వాంసునిగా నియమించి రాష్ట్రం సత్కీర్తి పొందింది. ద్వారం వారికి శాస్త్రీయ కృతుల నుంచి జానపదాల వరకు అన్నీ ఇష్టమే. వయొలిన్‌పై ఎంకి పాటలకు శాశ్వతత్వం తెచ్చారు. అన్నిటికన్నా మిన్నగా ‘రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ’ అన్న కృతిని కదన కుతూహల రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్యరుగారు వ్యాప్తిలోకి తెచ్చారు. మహాకవి శ్రీరంగం నారాయణ బాబు ద్వారంకి హితులు, సన్నిహితులు. నారాయణ బాబు ద్వారంపై రాసిన కవితలో– ‘నాయుడుగారూ/ మీ వేళ్లు/ ఘన రాగ పంచకం/ మీ శరీర/ మాకాశం/ మీ హస్తం/ హరివిల్లు/ చిత్ర చిత్ర వర్ణాలు/ శ్రీవారి వేళ్లు/’ అంటూ కొనసాగించారు. ఆనాటి మహా కవులలో విశ్వనాథ, జాషువా, తుమ్మల ఫిడేలు నాయుడుగారిని ప్రస్తుతిస్తూ పద్యాలు చెప్పారు. చమత్కారంగా మాట్లాడుతూ, మధ్య మధ్య చుట్ట పొగ సుతారంగా పీలుస్తూ చూడవచ్చిన వారిని పాటలతోనే కాక మాటలతో కూడా ముగ్ధులను చేసే నైజం నాయుడు గారిది. మీ కచేరీ వేళ రెండు పాములు ఆడాయని చెబితే అది నేల మహత్యం అన్నారు. మీరు దీపక రాగం వాయిస్తే అక్కడ వస్త్రాలు అంటుకున్నాయండీ అంటే పాపం ఎవరో బీడీయో చుట్టో కాలుస్తూ ఏమరుపాటున ఉండి ఉంటారు అన్నది ఆయన తీర్మానం. ఆయనొకసారి వయొలిన్‌ని శృతి చేసుకుని, కమాన్ని కూడా పరిక్షించుకుని పక్కన పెట్టారట. వెంటనే నిండు సభ కరతాళ ధ్వనులతో మార్మోగిందట. నమ్మకం కుదిరితే అలాగ ఉంటుందన్నారు నాయుడుగారు. ‘ఈ వాయులీన సాహిత్య మాధుర్యముల్/ దేవతా స్త్రీ కంఠ దీప్తరావమ్ములో/ పారిజాతామోద భావమ్ములో/ సురనీద్ జీవమ్ములో/ ఈ వాయులీన సాహిత్య సాహిత్యముల్/ పలుకరించిన తొట్రుపాటెరుంగని యట్టి/ పలుకులో కలకండ పలుకులో/ చిరునవ్వు మొలకలో...’ – విశ్వనాథ మనకి కూడా ఫిడేలు నాయుడుగారి స్మృతి చిహ్నం విధిగా ఉండాలి. ఈ నెల 8న ద్వారం వారి జయంతి. ఆరోజున నాయుడుగారి జ్ఞాపకాలతో ఒక విశేష సంచిక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు కె. రామచంద్రమూర్తి చేతులమీదుగా విడుదల అవుతుంది. ఉదయం 11 గంటలకు వీవీఐటీ ప్రాంగణం, నంబూరు (గుంటూ రు)లో జరిగే ఈ సభకు అందరూ ఆహ్వానితులే. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
వాగ్దేవి నర్తించిన వాయులీనం
‘‘మనమింతగా నారాధించు కళ నవనవోన్మేషమును బొందవలయును. ప్రాత దుస్తుల తోడను,ప్రాచీనాలంకారముల తోడను మాత్రమే మన కళా సరస్వతిని నిలుపగోరము.’’‘ఫిడేలు నాయుడు’ పేరుతో కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో సుప్రసిద్ధులయిన ద్వారం వెంకటస్వామినాయుడు పలికిన మాటలివి. ఏ కళ అయినా పరిణామం వైపే పరుగులు తీస్తుంది. ఎల్లలు లేని సంగీతానికి అది మరింతగా వర్తిస్తుంది. బహుశా విజయనగరం మహారాజా సంగీత కళాశాల ప్రధాన ఆచార్యులుగా పదవీ స్వీకారం చేసిన సందర్భం కావచ్చు. ఆయన పలికిన మాటలు చిరస్మరణీయాలనిపిస్తూ ఉంటాయి. పైన ఉదహరించిన మాటలు కూడా ఆనాటి ఉపన్యాసం లోనివే. ద్వారం వెంకటస్వామినాయుడుగారు (నవంబర్ 8, 1893 – నవంబర్ 25, 1964) బెంగళూరులో పుట్టారు. కంటోన్మెంట్ మిలటరీ క్వార్టర్స్‌లో ఆ సంగీతనిధి కళ్లు తెరిచారు. అది కూడా దీపావళి అమావాస్య రోజున. తండ్రి మేజర్ వెంకటరాయలు. తల్లి లక్ష్మీనరసమ్మ. వెంకటరాయలు తండ్రి వెంకటస్వామి. ఆయన కూడా సైన్యంలో పనిచేసిన వారే. ఆయన పేరే వెంకటరాయలు కుమారుడికి పెట్టుకున్నారు. నిజానికి వారి కుటుంబంలో చాలామంది కశింకోట సంస్థానాధీశుని దగ్గర సైన్యంలో పనిచేసిన వారే. స్వస్థలం కూడా అదే.ఫిడేలు నాయుడుగారు తుపాకీ పట్టకుండా కమాను పట్టుకునేటట్టు చేసినవి రెండు. ఒకటి... ఆ కుటుంబ పెద్దల మారిన దృష్టి. రెండు... వెంకటస్వామినాయుడు పోగొట్టుకున్న దృష్టి. పూర్వం భారతీయ ప్రభువుల దగ్గర సేవ చేశారు. కానీ బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించిన తరువాత ప్రభువులు మారిపోయారు. పరదేశ ప్రభువుల ఆదేశాలతో సాటి భారతీయుల మీద తుపాకీ ఎత్తవలసి వస్తోంది. అందుకే వెంకటరాయలు ఆత్మగౌరవం కలిగిన వృత్తులలో తన సంతానం ఉండాలని కోరుకున్నారు. వారిని బడికి పంపారు. కానీ వెంకటస్వామి నాలుగో క్లాసుకు వచ్చేసరికి తండ్రి పదవీ విరమణ చేసి, కశింకోటకు చేరుకున్నారు. దానితో వెంటకస్వామిని విశాఖలోని ఏవీయన్ విద్యాసంస్థలో చేర్చారు. క్రమంగా చూపులో మార్పు వచ్చింది. నల్లటి బోర్డు మీద అక్షరాలు అతుక్కుపోయి కనిపించేవి. అంతా అయోమయంగా ఉండేది. చివరికి బోధకులు వెంకటస్వామిని సంస్థ నుంచి పంపించేశారు. అప్పటికే రైల్వేశాఖలో కుదురుకున్న అన్నలు ఇద్దరూ వెంకటస్వామిని ఓదార్చారు. తండ్రి నేర్పించిన వయొలిన్ వాద్యాన్ని తమ్ముడికి నేర్పడం ఆరంభించారు. ఆ సోదరులిద్దరిదీ వానాకాలం వాద్యవిద్య కాదు. ఒకరు మద్రాస్‌లో పట్నం సుబ్రహ్మణ్యన్ అయ్యర్ అంతటి పండితుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. మరొక సోదరుడు రైల్వే ఉన్నతాధికారి ఒకరి దగ్గర పాశ్చాత్య వయొలిన్ సంగీతం నేర్చుకున్నారు. ఆ అన్నలిద్దరూ తమ్ముడికి తమకు తెలిసినదంతా నేర్పించారు.1919లో విజయనగరం రాజా సంగీత కళాశాలను నెలకొల్పారు. తొలి ప్రధాన ఆచార్యులు శ్రీమజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు. విద్యార్థులకు ప్రవేశ పరీక్ష జరిగింది. వెంకటస్వామినాయుడిని కూడా తీసుకువెళ్లారు. అది ఆయన జీవితాన్ని మార్చింది. సంస్థానాధీశుడు విజయరామగజపతితో పరిచయం కలిగింది ఆ సందర్భంలోనే. రాజావారు వెంకటస్వామిని కూడా సంగీత కళాశాల ఆచార్యులుగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు.శిల్పం, చిత్రలేఖనం కాలం మీద సంతకం చేసి వెళతాయి. ఏ సంగీతజ్ఞుడి ప్రతిభకైనా ఆ లక్షణం ఉండదు. శిష్యులు, ప్రశిష్యుల పరంపరలో, వారి శైలిలో దాని జాడను అన్వేషించవలసిందే. ఫిడేలు నాయుడుగారి విషయంలో మాత్రం కొందరు తమ అనుభవాలను నమోదు చేశారు. వి. తిరుపతి అనే ఆయన రాసిన సంగతులు చూడండి: ‘‘వారానికి కనీసం అయిదు రోజులైనా ప్రతీ సాయంత్రం సంజ వాలిన కొద్దిసేపటికి ఆ మహా విద్వాంసుడు తన ఇంట్లో ఒక లేడి చర్మం మీద కూర్చొని ఫిడేలు పట్టుకుంటారు. ఆ గదిలో ఒక దీపం మెల్లగా వెలుగుతూ ఉంటుంది. ఊదువత్తులు అగరు వాసనలతో మెత్తగా గది గుబాళిస్తూ ఉంటుంది. నాయుడుగారు నిదానంగా గంభీరంగా తన నాదోపాసనకు పూనుకుంటారు. అక్కడ చేరిన వాళ్లలో శ్రీమంతులు, చిరుపేదలు ఉంటారు. అక్కడ జాతిమత భేదాలు లేవు. చిన్నాపెద్దా, ఆడామగ తేడాలు లేవు. పిలిచారా పిలవలేదా అనుకోరు’’. తిరుపతి ఇంకా ఇలా రాశారు:‘‘సాధారణంగా ఒక వర్ణంతోనో, ఒక కీర్తనతోనో ఆ సాయంకాలం మొదలవుతుంది. అక్కడి నుంచి ఒక స్వరప్రవాహం... నాథుని ప్రియ స్పర్శతో నెచ్చెలి హృదయం ప్రఫుల్లమై తన అంతరంగ రహస్యాలన్నింటినీ అతని స్వాధీనం చేసినట్లుగానే ఆ వయొలిన్ నాయుడిగారి సన్నటి వ్రేళ్ల లాలనలో తన శరీరరంలో, తన నరనరాల్లో దాగి ఉన్న అద్భుత నాద రహస్య సంపదలను ఆయనకు ధారాదత్తం చేస్తుంది.’’ఫిడేలు నాయుడుగారు దురదృష్టం కొద్దీ చూపు కోల్పోయారు. కానీ ఆయనకు అపారమైన ధారణ ఉండేది. ఎన్నో సంగీతశాస్త్ర గ్రంథాలను ఆయన సేకరించారు. ఎవరో ఒకరు వాటిని చదివి వినిపించేవారు. ఎప్పటికీ గుర్తుండేవి.చిత్రంగా ఎవరైనా శిష్యుడు అపరాధపరిశోధన నవలలు చదివి వినిపిస్తే చక్కగా ఆస్వాదించేవారు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా పురాతత్వ పరిశోధనలు వాటి గురించిన వ్యాసాలు చదివి వినిపించినా శ్రద్ధగా ఆలకించేవారు. కర్ణాటక సంగీత గ్రంథాలతో పాటు, హిందుస్తానీ సంగీతానికి సంబంధించిన పుస్తకాలు కూడా ఆయన చదివించుకునేవారు. వెంకటస్వామి తిరువానూరు, మద్రాసు, మైసూర్, మధుర, తంజావూరు నగరాలకు తన విద్యను, ప్రతిభను పరిచయం చేశారు. జైపూర్, ఢిల్లీ, కలకత్తాలను కూడా ఓలలాడించారు. 1936లో ఆయన ఇచ్చిన గ్రామఫోన్ రికార్డు విదేశాలకు కూడా వెళ్లింది. నాయుడుగారిని హరేన్ చటోపాధ్యాయ కలుసుకున్నప్పుడు ‘‘ప్రొఫెసర్ గారూ! ఈ శ్రుతుల మాధుర్యం ఒక గొప్ప సంపద. కలకాలం నా హృదయంలో భద్రపరుచుకొంటాను’’ అన్నారు.ప్రతి సంగీతాభిమాని, కళాభిమాని చేసిన పని కూడా అదే. - డా. గోపరాజు నారాయణరావు -
మణులొద్దు.. మాన్యాలొద్దు..
యావత్ భారతదేశంలోనే వయోలిన్‌కు పర్యాయపదంగా నిలిచిన మహామహోపాధ్యాయుడు ద్వారం వెంకటస్వామి నాయుడు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, వయోలిన్‌పై స్వర విన్యాసాలను సాధన చేసిన మంగతాయారు ఎనిమిది పదుల వయసులోనూ అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. వంశీ సంగీత అకాడమీ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న సందర్భంగా మంగళవారం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో తన వయోలిన్ కచేరీతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా ఆ వాద్య శిఖామణిని ‘సిటీప్లస్’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ..:: త్రిగుళ్ల నాగరాజు వయోలిన్ వాద్య విన్యాసంలో మేరునగధీరుడు మా నాన్నగారు. బ్రహ్మ సృష్టికారుడైతే.. నాదాన్ని సృష్టించింది సరస్వతీదేవి. ఆ అమ్మవారు సృజించిన నాద విలాసాన్ని భువిపై నలుచెరగులా వ్యాప్తి చేసిన కారణజన్ములలో మా నాన్నగారు ఒకరని నేను విశ్వసిస్తాను. విదేశీ వాద్య పరికరమైన వయోలిన్‌ను వాగ్దేవి ఒడిలో అలంకరించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన పుంభావ సరస్వతి. ఎందరో శిష్యులను ఆదరించి, విద్వాంసులుగా తీర్చిదిద్ది, వయోలిన్‌ను భారత వాద్య సంపదలో ఓ భాగంగా మార్చేశారాయన. అలాంటి మహానుభావుడి వారసురాలుగా పుట్టడంనా పూర్వ జన్మ సుకృతం. మహామహుల సరసన.. నా బాల్యమంతా విజయనగరంలోనే సాగింది. నాన్నగారి శిష్యురాలిగా చిన్నతనంలోనే వయోలిన్ నేర్చుకోగలిగాను. విజయనగరంలోని సంగీత కళాశాలలో డిప్లొమా చేశాను. అంతేకాదు కొన్నాళ్లు నేను సంగీతం నేర్చుకున్న కళాశాలలోనే అధ్యాపకురాలిగా కూడా పనిచేశాను. మా కుటుంబం మద్రాస్‌కు వెళ్లిన తర్వాత ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో సంగీతంలో డిగ్రీ చేశాను. ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో గ్రేడ్-ఏ కళాకారిణిగా సెలెక్టయ్యాను. 16 ఏళ్ల పాటు ఆకాశవాణిలో నా వాద్య స్రవంతి కొనసాగింది. అదే సమయంలో ఎన్నో కచేరీల్లో పాల్గొన్నాను. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్, వేదవల్లి, ఎమ్మెల్ వసంతకుమారి వంటి గానశారదల కచేరీల్లో వాద్య సహకారం అందించడం మరచిపోలేని అనుభూతి. నా జీవితాన్ని కళకే అంకితం చేశాను. వయోలిన్‌లో లీనమై వివాహం సంగతే మరచిపోయాను. ఒక గురువుగా ఎందరో శిష్యులను తీర్చిదిద్దాను. నేడు ఇండియాతో పాటు అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లోనూ నా శిష్యులు పాఠశాలలు స్థాపించి మరీ కళాసేవ చేస్తున్నారు. ఒక గురువుగా అంతకంటే ఏం కావాలి. ప్రభుత్వం బాధ్యత.. పూర్వం రోజుల్లో కళాకారులను ఆదుకోవడానికి మహారాజులు ఉండేవారు. నేడు రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు.. ప్రభుత్వాలు, ప్రజాపాలకులు వచ్చారు. కళాకారులకు మాత్రం సరైన పోషణ కరువైందనే చెప్పాలి. అప్పుడు ఇచ్చినట్టు మణులు, మాన్యాలు అవసరం లేదు.. కళనే సర్వసంగా భావించి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తులకు పోషించడం ప్రభుత్వం కనీస బాధ్యత. నాదసాధకులకు ప్రోత్సాహం మాట అటుంచండి, పోషణ అందిస్తే అదే పదివేలు. కళాకారులు తృప్తిగా ఉంటేనే దేశం, కాలం సుభిక్షంగా ఉంటాయి. ఆయా కళాకారుల ప్రదర్శనలను సీడీలుగా రూపొందించి మార్కెట్లోకి విడుదల చేసి, వాటిపై వచ్చిన మొత్తాన్ని వారికి అందజేస్తే ఎంతో మేలు చేసిన వారు అవుతారు. గురువులదే బాధ్యత.. జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందరో మహానుభావులకు ఆలవాలంగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో నాకీ సత్కారం చేయడం మరింత ఆనందాన్నిచ్చింది. నేటి తరంలో సంగీతం, నాట్యం నేర్చుకోవాలనే జిజ్ఞాస కనిపిస్తోంది. దాన్ని మరింత అర్థవంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదే. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప వేదం, నాట్యం, సంగీతం, చిత్రలేఖనం.. వంటి కళల్లో ప్రవేశం పొందలేరు. మీకు లభించిన వరం నిష్ఫలం కాకూడదంటే కళను ఆరాధించాలి. భక్తి, శ్రద్ధలతో సాధన చేయాలి. ఈ రెండూ లేనివాళ్లు.. సంగీతంలోనే కాదు ఏ రంగంలో ఉన్నా రాణించలేరు. గురువుల కృపను పొందడం అంటే .. వారికి సుశ్రూష చేసి విజ్ఞానాన్ని సముపార్జించడం ఒకటే కాదు, వారు చూపిన బాటలోనడవగలగాలి. వారు నేర్పిన విద్యల్లోని అర్థాన్ని, అంతరార్థాన్ని గ్రహించగలగాలి. అప్పుడే గురువును మించిన శిష్యులని అనిపించుకోగలరు.