మెర్సిడెస్-బెంజ్ నుంచి 2 కొత్త కార్లు
ఈ-క్లాస్ కాబ్రియోలెట్
రూ.78.50 లక్షలు
సీఎల్ఎస్ 250 సీడీఐ కూపే
రూ.76.50 లక్షలు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ బుధవారం రెండు కొత్త మోడళ్లు... ఈ-క్లాస్ కాబ్రియోలెట్, సీఎల్ఎస్ 250 సీడీఐ కూపే(డీజిల్ ఇంజిన్)లను ఆవిష్కరించింది. ఈ-క్లాస్ కాబ్రియోలెట్ ధర రూ.78.50 లక్షలని, సీఎల్ఎస్ 250 సీడీఐ కూపే ధర రూ.76.50 లక్షలని (రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) పేర్కొంది. భారత మార్కెట్‌కు అనువుగా ఉన్న తమ అంతర్జాతీయ మోడళ్లను ఇక్కడకు తెస్తున్నామని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ ఇబెర్డ్హర్డ్ కెర్న్ చెప్పారు. ఈ ఏడాది 15 కొత్త మోడళ్లను అందించనున్నామని, మరో 15 షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు.
మెర్సిడెస్-బెంజ్ యాప్
క్లౌడ్ ఆధారిత మెర్సిడెస్-బెంజ్ యాప్‌లను పరిచయం చేస్తున్నామని కెర్న్ పేర్కొన్నారు. ఈ యాప్‌లతో ఇంటర్నెట్, వాతావరణం, ఆడియో వార్తలు, ఫేస్బుక్, మెర్సిడెస్-బెంజ్ రేడియోలకు యాక్సెస్ పొందవచ్చని వివరించింది. ప్రస్తుతం సీఎల్ఎస్ కారులో ఈ యాప్‌ను ఆఫర్ చేస్తున్నామని, భవిష్యత్‌లో రానున్న కార్లలో దీనిని అందించనున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది విక్రయాల్లో రెండంకెల వృద్ధి సాధించగలమని తెలిపారు. ప్రస్తుతం 39 నగరాల్లో 71 మంది డీలర్లున్నారని, ఈ సంఖ్యను 80కు పెంచనున్నామని వివరించారు.