E-filing
-
10ఎఫ్ దాఖలుకు మార్చి వరకు గడువు
న్యూఢిల్లీ: నాన్ రెసిడెంట్ (భారత్‌లో నివసించని) పన్ను చెల్లింపుదారులు 10ఎఫ్ పత్రాన్ని మాన్యువల్‌గా (భౌతికంగా) దాఖలు చేసేందుకు 2023 మార్చి 31 వరకు కేంద్ర సర్కారు గడువు ఇచ్చింది. దీనివల్ల నిబంధనల అమలు భారం తగ్గుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. తక్కువ టీడీఎస్ అమలు చేసేందుకు వీలుగా నాన్ రెసిడెంట్ పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్లో ఫామ్ 10ఎఫ్ దాఖలు చేయడం తప్పనిసరి అంటూ ఈ ఏడాది జూలైలో సీబీడీటీ ఆదేశాలు తీసుకొచ్చింది. పాన్ నంబర్లు లేని వారు ఫామ్ 10ఎఫ్ దాఖలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్ పోర్టల్ అనుమతించడం లేదు. దీంతో పన్ను చెల్లింపుదారులు ఫామ్10 ఎఫ్ దాఖలు విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో భౌతికంగా దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. -
కొన్ని కేటగిరీల్లో ఈ–ఫైలింగ్ తప్పనిసరి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని అన్ని హైకోర్టుల్లో 2022 జనవరి 1వ తేదీ నుంచి కొన్ని కేటగిరీల్లో ఈ–ఫైలింగ్ తప్పనిసరి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనిప్రకారం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రభుత్వం ద్వారా వచ్చే కేసులు/పిటిషన్లకు ఈ–ఫైలింగ్ తప్పనిసరి కానుంది. ఆ తేదీ తర్వాత ఏ విషయంలోనూ ప్రభుత్వం భౌతికంగా కేసులు వేయడానికి వీలులేదు. రెవెన్యూ, పన్ను, మధ్యవర్తిత్వం, వాణిజ్య వివాదాలు, హైకోర్టు ద్వారా సాగే ఇతర కేటగిరీల్లో అందరికీ ఈ–ఫైలింగ్ తప్పనిసరి చేయాలి. అంతేగాక సబార్డినేట్ కోర్టుల తీర్పులు/ఉత్తర్వులకు వ్యతిరేకంగా పిటిషన్లు, అప్పీళ్లు, రివిజన్లకు ఈ–ఫైలింగ్ తప్పనిసరి. డబ్బు రికవరీ సూట్లు (బ్యాంకుల ద్వారా రుణ రికవరీ సూట్లు, అద్దె బకాయిలు మొదలైనవి), నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 కింద ఫిర్యాదులు, నిర్వహణ కోసం దరఖాస్తులు, పరస్పర అంగీకారం ద్వారా విడాకుల పిటిషన్లు, బెయిల్ దరఖాస్తులను కూడా ఈ–ఫైలింగ్ ద్వారానే స్వీకరిస్తారు. (సమాచారం: ఐక్యతా శిల్పం సందర్శన ఐదు రోజులపాటు నిలిపివేత) -
‘రిటర్న్‌లపై’ ప్రచార రథాలు
హైదరాబాద్: ఆదాయపు పన్ను రిటర్న్‌ల చెల్లింపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమాచార ప్రచార రథాలను హైదరాబాద్ ఆదాయపు పన్ను విభాగం ప్రారంభించింది. శుక్రవారం ఏసీ గార్డ్స్‌లోని ఇన్‌కం ట్యాక్స్ భవన సముదాయంలో జరిగిన ‘కర్దాతా ఇ–సహయోగ్’కార్యక్రమంలో ఇన్‌కం ట్యాక్స్ (ఏపీ అండ్ తెలంగాణ) ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎన్.శంకరన్ ఈ ప్రచార రథాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రచార రథాల ద్వారా ప్రజలను జాగృతం చేయడంతోపాటు సందేహాలను నివృత్తి చేస్తామని తెలిపారు. జంట నగరాల్లో ఈ రథాలు ఆగస్ట్ 24 వరకు సంచరిస్తాయని పేర్కొన్నారు. ఇక ఆదాయపు పన్ను రిటర్న్‌ల ఇ–ఫైలింగ్ గడువును పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. ఇ–ఫైలింగ్‌ను ఈ నెల 31లోగా ఇంటర్నెట్ ద్వారా చేయాల్సి ఉంటుందన్నారు. గడువులోగా చేయకుంటే 234 ఎఫ్ యాక్ట్ ప్రకారం వడ్డీతో సహా మరో రూ.5 వేలు అదనంగా చెల్లించాలని తెలిపారు. ఇన్‌కం ట్యాక్స్ హైదరాబాద్ విభాగం డైరెక్టర్ జనరల్ ఆర్కే ఫలివాల్ మాట్లాడుతూ.. డిజిటలైజేషన్లో భాగంగా ఇ–ఫైలింగ్ తప్పనిసరి చేశామన్నారు. సీనియర్ సిటిజన్లకు మాత్రం ఎలక్ట్రానిక్ పద్ధతిలో మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఇన్‌కం ట్యాక్స్ హైదరాబాద్ విభాగం చీఫ్ కమిషనర్ అతుల్ ప్రణయ్ మాట్లాడుతూ.. జూలై 31వరకు ఉన్న రిటర్న్‌ల గడువును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) పొడిగించిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్ సెంట్రల్ కె.కామాక్షి పాల్గొన్నారు. -
అందుబాటులోకి ఐటీఆర్-1 ఫామ్
న్యూఢిల్లీ : పన్ను చెల్లించే శాలరీ క్లాస్ ప్రజలు ఎక్కువగా ఉపయోగించే తాజా ఐటీఆర్-1 దరఖాస్తు ఆదాయపు పన్ను శాఖకు చెందిన అధికారిక ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. సింగిల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్ను(ఐటీఆర్) దరఖాస్తును ఏప్రిల్ 5న సీబీడీటీ నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. దీన్ని ఆదాయపు పన్ను శాఖ తన వెబ్సైట్ https://www.incometaxindiaefiling.gov.inలో పొందుపరిచింది. మిగతా ఐటీఆర్ దరఖాస్తులు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు అధికారి పేర్కొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను కొత్త ఐటీఆర్ దరఖాస్తులు శాలరీ క్లాస్ ప్రజలకు తప్పనిసరి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీఆర్ ఫైలింగ్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. ఏడు ఐటీఆర్ దరఖాస్తులను ఎలక్ట్రానిక్‌గా ఫైల్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని కేటగిరీల పన్నుచెల్లింపు దారులకు దీని నుంచి మినహాయింపు ఉంది. గతేడాది ఆర్థిక సంవత్సరంలో 3 కోట్ల మంది శాలరీ క్లాస్ పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్-1ను ఫైల్ చేశారు. ఈ ఏడాది ఐటీఆర్ ఫైల్ చేయడానికి తుది గడువు జూలై 31గా ఉంది. -
రికార్డు స్థాయిలో టాక్స్ రిటర్న్స్ ఈ-ఫైలింగ్
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో టాక్స్ రిటర్న్స్ 68.5శాతం పెరిగి, రికార్డు సృష్టించాయి. 8.32 లక్షల మంది వినియోగదారులు, ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్(ఐటీఆర్స్) ను ఎలక్ట్రానిక్ గా ఫైల్ చేశారని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) గణాంకాలు తెలిపాయి. అయితే 2015-16లో ఈ-ఫైలింగ్ రిటర్న్స్ 4.94 లక్షలుగా మాత్రమే రికార్డు అయినట్టు పేర్కొంది. ఈ-ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా యూజర్లు ఇంట్లోనే ఉండి తేలికగా ఈ సదుపాయాన్ని వాడుకుంటున్నారని తెలిపింది. 2016 ఏప్రిల్ 30వరకు మొత్తం 5.25 కోట్ల యూజర్లు రిజిస్టర్ చేసుకున్నారని, 49.54 శాతం రిటర్న్స్ ఆఫీసు పనివేళల్లో కాకుండా ఇతర సమయాల్లో.. అంటే ఇళ్లలో ఉన్నప్పుడే నమోదయ్యాయని సీబీడీటీ పేర్కొంది. అమెరికాలో కంటే భారత్ లోనే టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం సులభతరంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపిన సంగతి తెలిసిందే. ప్రారంభ సమయంలో ఈ-ఫైలింగ్ చాలా భారమైన పని అని, తర్వాతి కాలంలో ఇది సులభతరంగా మారిందని డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్ పీ పార్టనర్ దివ్య బవేజా తెలిపారు. మార్చి 30న కొత్త ఫారాలను సీబీడీటీ నోటిఫై చేసింది. వాటిని జూలై 31లోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ రిటర్న్స్ ఫైల్ చేయడం మహారాష్ట్ర నుంచి జరిగాయని, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లు తర్వాతి స్థానాల్లో నిలిచాయని డేటా నివేదించింది. -
ఆదాయ మార్గం కాదు!
‘బ్లాక్‌మనీ విండో’పై కేంద్రం న్యూఢిల్లీ: విదేశాల్లో అక్రమాస్తులు, అక్రమాదాయం ఉన్నవారు.. వాటి వివరాలను స్వచ్ఛందంగా వెల్లడి చేసే అవకాశం కల్పించడాన్ని ఆదాయ సమీకరణ మార్గంగా భావించడం లేదని శుక్రవారం కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ‘విదేశాల్లో అక్రమాస్తులున్నవారికి నల్లధనం చట్టం కింద జైలు శిక్షను, భారీ జరిమానాను తప్పించుకునేందుకు ఇది చివరి అవకాశం. దీనికి ప్రభుత్వం ఆదాయ లక్ష్యమేదీ నిర్దేశించలేదు’ అని అన్నారు. నల్ల ధనవంతులకు 90 రోజుల గడవుతో ఈ అవకాశం కల్పించామన్నారు. ఈ అవకాశం జూలై1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. ఆ లోపు విదేశీ అక్రమాస్తుల వివరాలను వెల్లడి చేసినవారు ఆ మొత్తం విలువలో 60% పన్ను, జరిమానా చెల్లిస్తే సరిపోతుంది. గడువు దాటితే అది 120% వరకు పెరగడంతో పాటు, జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాగా, విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని ఈ-ఫైలింగ్ ద్వారా వెల్లడి చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆన్లైన్లో సమర్పించే పత్రాలపై డిజిటల్ సంతకాన్ని తప్పనిసరి చేసింది. ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్లో ఈ మేరకు ఏర్పాటు చేసింది. -
4 నెలల్లో కోటికిపైగా ఐటీ ఈ-ఫైలింగ్స్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ద్వారానే ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చెల్లింపుదారులు అధికంగా మొగ్గు చూపుతున్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. గడచిన సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల కాలంలో ఈ-ఫైలింగ్ చేసిన వారి సంఖ్యలో 48% వృద్ధి నమోదు కావడమే కాకుండా వీరి సంఖ్య కోటి దాటిందని ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) ప్రకటించింది. జూలై 31 వరకు ఆన్లైన్ ద్వారా రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 1.03 కోట్లుగా ఉంటే గతేడాది ఇదే కాలానికి 69,63,056 మంది దాఖలు చేసినట్లు సీబీడీటీ పేర్కొంది. ఆన్లైన్ ద్వారా దాఖలు చేసే వారి సంఖ్య పెరగడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగిందని, నిమిషానికి 2,303 మంది రిటర్నులు దాఖలు చేసినట్లు సీబీడీటీ అధికారులు తెలిపారు. దీంతో చివరకు రిటర్నుల గడువు తేదీని మరో 5 రోజులు పొడిగించడంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 2012-13లో మొత్తంమీద ఆన్లైన్లో రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 2.14 కోట్లుగా ఉంది. -
కోటి దాటిన ఇ- ఐటీ రిటర్న్‌లు
ఆన్లైన్లో ఆదాయపన్ను రిటర్న్‌లు దాఖలు చేసిన వారి సంఖ్య కోటి దాటింది. వేతనాలు తీసుకుంటున్న వారే అత్యధికంగా ఆన్లైన్లో ఆదాయపన్ను రిటర్న్‌లు దాఖలు చేసినట్టు తాజా గణంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది జూలై 31 నాటికి 1,03,21,775 ఇ-రిటన్స్ దాఖలయినట్టు బెంగాళూరులోని ఆదాయపన్ను శాఖకు చెందిన సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్(సీపీసీ) తెలిపింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 2 కోట్లపైగా ఇ-రిటర్న్‌లు ఫైల్ అయినట్టు వెల్లడించింది. తాజాగా ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేసిన వారిలో 7,81,252 మంది వేతన జీవులు ఉన్నారు. గతేడాది 64 లక్షల మంది ఉద్యోగులు ఇంటర్నెట్ ద్వారా ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేశారు. వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే గడువును ఆగస్టు 5 వరకు పొడిగిస్తూ ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రిటర్న్‌ల దాఖలుకు జూలై 31 ఆఖరు తేదీ కాగా ఆన్లైన్ ద్వారా దాఖలు చేసే ఈ-ఫైలింగ్‌కు విపరీతమైన ఆదరణ రావడంతో గడువును పొడిగించింది. గతేడాదితో పోలిస్తే ఆన్లైన్ ద్వారా రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్యలో 46.8 శాతం వృద్ధి నమోదయ్యింది.