ఆన్‌లైన్ ద్వారానే ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చెల్లింపుదారులు అధికంగా మొగ్గు చూపుతున్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ద్వారానే ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చెల్లింపుదారులు అధికంగా మొగ్గు చూపుతున్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. గడచిన సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల కాలంలో ఈ-ఫైలింగ్ చేసిన వారి సంఖ్యలో 48% వృద్ధి నమోదు కావడమే కాకుండా వీరి సంఖ్య కోటి దాటిందని ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) ప్రకటించింది. జూలై 31 వరకు ఆన్‌లైన్ ద్వారా రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 1.03 కోట్లుగా ఉంటే గతేడాది ఇదే కాలానికి 69,63,056 మంది దాఖలు చేసినట్లు సీబీడీటీ పేర్కొంది. ఆన్‌లైన్ ద్వారా దాఖలు చేసే వారి సంఖ్య పెరగడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగిందని, నిమిషానికి 2,303 మంది రిటర్నులు దాఖలు చేసినట్లు సీబీడీటీ అధికారులు తెలిపారు. దీంతో చివరకు రిటర్నుల గడువు తేదీని మరో 5 రోజులు పొడిగించడంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 2012-13లో మొత్తంమీద ఆన్‌లైన్‌లో రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 2.14 కోట్లుగా ఉంది.