న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో టాక్స్ రిటర్న్స్ 68.5శాతం పెరిగి, రికార్డు సృష్టించాయి. 8.32 లక్షల మంది వినియోగదారులు, ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్(ఐటీఆర్స్) ను ఎలక్ట్రానిక్ గా ఫైల్ చేశారని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) గణాంకాలు తెలిపాయి. అయితే 2015-16లో ఈ-ఫైలింగ్ రిటర్న్స్ 4.94 లక్షలుగా మాత్రమే రికార్డు అయినట్టు పేర్కొంది. ఈ-ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా యూజర్లు ఇంట్లోనే ఉండి తేలికగా ఈ సదుపాయాన్ని వాడుకుంటున్నారని తెలిపింది. 2016 ఏప్రిల్ 30వరకు మొత్తం 5.25 కోట్ల యూజర్లు రిజిస్టర్ చేసుకున్నారని, 49.54 శాతం రిటర్న్స్ ఆఫీసు పనివేళల్లో కాకుండా ఇతర సమయాల్లో.. అంటే ఇళ్లలో ఉన్నప్పుడే నమోదయ్యాయని సీబీడీటీ పేర్కొంది.
అమెరికాలో కంటే భారత్ లోనే టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం సులభతరంగా ఉందని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపిన సంగతి తెలిసిందే. ప్రారంభ సమయంలో ఈ-ఫైలింగ్ చాలా భారమైన పని అని, తర్వాతి కాలంలో ఇది సులభతరంగా మారిందని డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్ పీ పార్టనర్ దివ్య బవేజా తెలిపారు. మార్చి 30న కొత్త ఫారాలను సీబీడీటీ నోటిఫై చేసింది. వాటిని జూలై 31లోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ రిటర్న్స్ ఫైల్ చేయడం మహారాష్ట్ర నుంచి జరిగాయని, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లు తర్వాతి స్థానాల్లో నిలిచాయని డేటా నివేదించింది.