16న ఎంసెట్-3 ర్యాంకులు!
రేపే పరీక్ష, అదే రోజు ప్రాథమిక ‘కీ’
14 వరకు అభ్యంతరాల స్వీకరణ
అబ్జర్వర్లుగా ప్రభుత్వ ఇంజనీరింగ్, డిగ్రీ లెక్చరర్లు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 11న నిర్వహించనున్న ఎంసెట్-3 ప్రవేశ పరీక్ష ఏర్పాట్లతోపాటు పరీక్ష తరువాత చేపట్టాల్సిన చర్యలపై ఎంసెట్ కమిటీ దృష్టి సారించింది. పరీక్ష పూర్తి కాగానే అదే రోజు సాయంత్రం ప్రాథమిక ‘కీ’ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ప్రాథమిక ‘కీ’పై 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించాలని నిర్ణయించినట్లు తెలియవచ్చింది.
అలాగే విద్యార్థుల ర్యాంకులను 16న విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు పరీక్షల అబ్జర్వర్లుగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల లెక్చరర్లనే నియమించేలా చర్యలు చేపట్టంది. కాగా, ఎంసెట్-3 ప్రశ్నపత్రం సెట్ కోడ్‌ను 11న ఉదయం 6 గంటలకు జేఎన్టీయూహెచ్లోని యూజీసీ అకడమిక్ స్టాఫ్ కాలేజీ ఆడిటోరియంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి విడుదల చేస్తారని ఎంసెట్-3 కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు.
పదే పదే రాసే వారిపై నిఘా
ఎంసెట్-3 దరఖాస్తుదారుల్లో కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు, మరికొందరు 35 ఏళ్లు పైబడిన వారు, 1996లో ఇంటర్ ఉత్తీర్ణులైన వ్యక్తులు ఉన్నట్లు ఎంసెట్ కమిటీ నుంచి సేకరించిన వివరాల ద్వారా గుర్తించిన పోలీసులు... అటువంటి వారు పరీక్షకు ఎందుకు దరఖాస్తు చేసుకున్నారన్న కోణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
అలాంటి వారితోపాటు సీట్లు ఇప్పిస్తామని చెప్పే బ్రోకర్లు సహా కోచింగ్ సెంటర్లు, కార్పొరేట్ కాలేజీల వద్ద కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. పరీక్ష కేంద్రాల వద్ద అడుగడుగునా నిఘా ఏర్పాట్లు చేశారు. అయితే ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో పదేపదే ఎంసెట్ రాసే వారిలో ఎక్కువ మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోలేదని సమచారం.
పరీక్ష రాసేవారు 40 వేల లోపే...
ఎంసెట్-2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 56,153 మంది విద్యార్థులను ఎంసెట్-3కి అనుమతించాలని ఎంసెట్-3 కమిటీ నిర్ణయించగా అందులో తెలంగాణకు చెందిన 38,214 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 17,939 మంది ఉన్నారు. అయితే శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 36,500 మంది విద్యార్థులు మాత్రమే హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. రాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉన్నందున వారి సంఖ్య మరో 3 వేల వరకు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.