earthquake comments
-
రాహుల్ గాంధీకి చుక్కెదురు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ లంచాలు తీసుకున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దాఖలు చేసిన ఆరోపణలు తేలిపోయాయి. వాటికి సంబంధించి దాఖలైన ఒక పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. తాము నాటి గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్రమోదీకి లంచాలు ఇచ్చామంటూ సహారా - బిర్లా డైరీలలో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ 'భూకంపం' పుట్టిస్తానని కూడా రాహుల్ గాంధీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, అదే విషయమై.. అవే ఆధారాలను ప్రస్తావిస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానమంత్రి సహా ఆ డైరీలలో పేర్లున్నవారిపై విచారణ జరిపించాలని ఆయన ఆ పిటిషన్లో కోరారు. అయితే, ఇలాంటి పత్రాలను కూడా చట్టపరమైన ఆధారాలుగా భావిస్తే, చట్టాన్ని కూడా దుర్వినియోగం చేసినట్లవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించింది. -
నేను మాట్లాడితే భూకంపమే
పెద్దనోట్ల రద్దు అంశంపై లోక్‌సభలో తనను మాట్లాడనివ్వడం లేదని, తాను మాట్లాడితే భూకంపం వస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఈ భయంతోనే ప్రభుత్వం చర్చ నుంచి పారిపోతోందని ఆయన చెప్పారు. పెద్దనోట్ల రద్దు అనేది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం అని, తాను లోక్‌సభలోనే దీనిపై మాట్లాడలనుకుంటున్నానని, అక్కడ అన్నీ చెబుతానని అన్నారు. ప్రధానమంత్రి యావత్ దేశంలో ప్రసంగాలు ఇస్తున్నారు గానీ, లోక్‌సభకు రావడానికి మాత్రం భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు ఇంత భయం ఎందుకని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు మీద చర్చించడానికి తాము దాదాపు నెల రోజుల నుంచి ప్రయత్నిస్తున్నామని, పాలకు పాలు.. నీళ్లకు నీళ్లు ఏవో తేలిపోవాలనే తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు.