ఇక చకచకా వ్యాపార అనుమతులు
ఎంట్రప్రెన్యూర్స్ కోసం ఈ-బిజ్ పోర్టల్
- 11 ప్రభుత్వ సేవలు ఒకేచోట లభ్యం...
- జీ2బీ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్రం
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారాలకు మరింత సానుకూల పరిస్థితులను కల్పించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గురువారం ఈ-బిజ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇక్కడ వ్యాపారం చేయాలనుకునే ఎంట్రప్రెన్యూర్స్‌కు 11 రకాల సేవల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని దీనిలో కల్పించారు.
పాన్, డిన్ నంబర్లు పొందడంతోపాటు పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా వన్‌స్టాప్ అనుమతి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఈబిజ్.జీవోవీ.ఇన్’ అనే గవర్నమెంట్-టు-బిజినెస్(జీ2బీ) పోర్టల్‌లో ప్రతిపాదిత సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందికి చేర్చామని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 24 గంటలూ పోర్టల్‌లో సేవలను ఉపయోగించుకోవచ్చని.. దరఖాస్తు చేసుకోవడం, సంబంధిత పత్రాలను ఇవ్వడం, చెల్లింపులు, లెసైన్స్/పర్మిట్ పొందడంతోపాటు తమ దరఖాస్తు ప్రస్తుత స్థితి(స్టేటస్) తెలుసుకోవడం వంటివన్నీ పోర్టల్‌లో ఉంటాయని ఆమె వివరించారు. కంపెనీ పేరు నమోదు, వ్యాపార ఏర్పాటు ధ్రువీకరణ పత్రం, వ్యాపార ప్రారంభానికి అనుమతి, ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) వద్ద రిజిస్ట్రేషన్ వంటివాటికి ఎంట్రప్రెన్యూర్స్ ఈ-బిజ్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి నాలుగు సేవలు, కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ), ఆర్బీఐల నుంచి రెండేసి, డీజీఎఫ్టీ, ఈపీఎఫ్ఓల నుంచి ఒక్కొక్కటి చొప్పున సేవలు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. ఇక పెట్రోలియం-ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అనుమతులు కూడా దీనిద్వారా పొందవచ్చు. వ్యాపారానికి సానుకూల దేశాల తదుపరి జాబితాలో భారత్ ర్యాంక్ మెరుగయ్యేందుకు ఈ చర్యలు దోహదం చేస్తాయని.. దీనివల్ల భారీగా ఉద్యోగాలు కూడా కల్పించేందుకు వీలవుతుందని ప్రపంచ బ్యాంక్ డెరైక్టర్(ఇండియా) ఒనో రౌల్ వ్యాఖ్యానించారు. ప్రపంచ బ్యాంక్ ఈ ఏడాది నివేదిక(మొత్తం 189 దేశాలు)లో భారత్ ర్యాంక్ రెండు స్థానాలు దిగజారి 142కు పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే, టాప్-50 ర్యాంకుల్లో భారత్‌ను నిలపాలనేది కేంద్రం లక్ష్యం.
ఇన్ఫోసిస్ భాగస్వామ్యంతో...
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ గవర్నమెంట్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఈ పోర్టల్‌కు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కన్సల్టింగ్ పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) విధానం కింద పదేళ్ల కాలానికిగాను ఈ-బిజ్ను అభివృద్ధి చేసింది. తొలి మూడేళ్లూ పైలట్ ఫేజ్ కింద పోర్టల్‌ను నిర్వహిస్తారు. మిగతా ఏడేళ్లలో మరింత విస్తరించనున్నారు. కాగా, పైలట్ ఫేజ్‌లో మొత్తం 50 సేవలు(26 కేంద్ర ప్రభుత్వ, 24 రాష్ట్రాలకు సంబంధించినవి) చేరుస్తారు. ఆంధ్రప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు ఇందులో ఉంటాయి. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లు, వ్యాపారాలకు సం బంధించి 200కుపైగా సేవలను పోర్టల్ అందిస్తుంది.
వేగంగా పనిచేస్తున్నందుకు విమర్శిస్తున్నారు: జైట్లీ
న్యూఢిల్లీ: కొత్త ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది నెలలు గడుస్తున్నా పరిస్థితులు మారలేదంటూ ప్రముఖ బ్యాంకర్ దీపక్ పరేఖ్ చేసిన వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ, ిపీయుష్ గోయల్ తదితర కేంద్ర మంత్రులు ఘాటుగా స్పందించారు. అలసత్వంతో పనిచేసిన గత ప్రభుత్వాలకు భిన్నంగా తమ ప్రభుత్వం వేగంగా పనిచేస్తున్నా కూడా విమర్శలు వస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. అతి వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందంటూ విమర్శిస్తున్నారని ఈ-బిజ్ పోర్టల్ ప్రారంభం సందర్భంగా గురువారం ఆయన పేర్కొన్నారు.
కొత్త ప్రభుత్వం వచ్చినా వాస్తవ పరిస్థితులు మారకపోవడంపై వ్యాపార వర్గాల్లో అసహనం పెరుగుతోందంటూ పరేఖ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా.. ఇన్ని రోజులుగా ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకుంటోందో దేశవిదేశాల్లోని ఇన్వెస్టర్లు పరిశీలిస్తూనే ఉన్నారని జైట్లీ పేర్కొన్నారు. బీమా తదితర రంగాల్లో ఆర్డినెన్సుల ద్వారా సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలపై వచ్చిన విమర్శలనూ ఆయన తప్పుపట్టారు.