తులసి వరమాల
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ పెద్దింటి కుటుంబానికి చెందిన పెళ్లి వేడుక నెట్టింట వైరల్ అవుతోంది. కారణం వీరీ పెళ్లిలో తులసిమొక్కలు ప్రధాన పాత్ర పోషించడమే. విషయమేమింటే.. ఆదిత్య అగర్వాల్, మాధురి బలోడి స్కూల్ ఏజ్ నుంచి స్నేహితులు. చదువులు పూర్తయ్యాక పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే, తమ మధ్య చిగురించిన ప్రేమకు గుర్తుగా పర్యావరణం పట్ల ప్రేమనూ చాటుకోవాలనుకున్నారు. రెండు కుటుంబాలవారూ ధనవంతులే అయినప్పటికీ ఇరు కుటుంబాల నుంచీ పెళ్లి ఖర్చునూ తగ్గించాలని ముందే నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ ఆలోచించుకొని అన్నింటా ఖర్చును తగ్గిస్తూ వచ్చారు. తులసిమొక్కని తమ పెళ్లికి పెద్దగా నిర్ణయించారు.
ఊరేగింపులో మొక్కలు
వరుడు తన స్నేహితులతో కలిసి కల్యాణ మండపానికి వచ్చే ముందు జరిగిన ఊరేగింపు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. గుర్రం లేదా కారులో కాకుండా వరుడు ఎలక్ట్రిక్ సైకిల్ మీద మండపానికి చేరుకున్నాడు. పూల దండలకు బదులుగా వధూవరులు తులసి మాలలు మార్చుకున్నారు. వధూవరుల దుస్తులు రూ.6000కు మించకుండా జాగ్రత్తపడ్డారు. పెళ్లి మండపం అలంకరణ అంతా పర్యావరణ అనుకూలమైన వాటితో తీర్చిదిద్దారు. ఈ వివాహంలో అతిథులకు బహుమతులకు బదులుగా మొక్కలు అందించారు. ఇలా తమ పెళ్లి ద్వారా పర్యావరణం పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు.
‘మా పెళ్లికి కార్డులు కూడా ముద్రించలేదు. ఇ–ఆహ్వానాలనే డిజైన్ చేసి, పంపించాం. వేదిక ముందు ప్రింటెడ్ బ్యానర్ కు బదులుగా చాక్‌పీస్‌తో రాసిన బోర్డును ఏర్పాటు చేశాం. ఇలా జాగ్రత్తలు తీసుకోవడానికి మా రెండు కుటుంబాలు మద్దతు తెలపడం మాకు చాలా ఆనందంగా ఉంది’ అని వివరించారు వధూవరులు. ప్లాస్టిక్ వాడకం లేని ఈ ఎకోఫ్రెండ్లీ పెళ్లిని నెటిజన్లు విపరీతంగా ప్రశంసిస్తున్నారు. వివాహంతో ఒక్కటయ్యే జంటలు ఇలాంటి వివాహ పద్ధతులను అవలంబించాలని కొందరు, ఇదొక సృజనాత్మక మార్గం అని మరికొందరు కొనియాడుతున్నారు.
పర్యావరణ అనుకూలమైన బైక్‌లపై ఊరేగింపుగా వివాహ వేదికకు చేరుకుంటున్న వరుడు, అతడి స్నేహితులు.