EDCET-2014
-
ఎడ్‌సెట్‌లో మనోడే ఫస్ట్
కర్నూలు(విద్య): బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్-2014లో పాములపాడు మండలం ఇస్కాల గ్రామ విద్యార్థి నందీశ్వర కుమారయ్య ప్రతిభ చాటాడు. సోషల్ సబ్జెక్టులో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. ఈ విద్యార్థి తండ్రి బత్తిని నాగమల్లప్ప వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తె రాజేశ్వరికి వివాహం కాగా, మొదటి కుమారుడు శివకుమార్ పాములపాడులో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. రెండో కుమార్తె మౌనిక ఇంటర్ పూర్తి చేశారు. రెండో కుమారుడు నందీశ్వర కుమారయ్య ఇస్కాల గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివి 502 మార్కులు సాధించాడు. ఆ తర్వాత ఆత్మకూరులోని థెరిస్సా జూనియర్ కళాశాలలో హెచ్ఈసీ గ్రూపులో ఇంటర్మీడియట్లో చేరి 888 మార్కులు సాధించాడు. ఆ తర్వాత నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేశాడు. తాజాగా బీఈడీ చదవాలన్న ఉద్దేశంతో గత నెలలో నిర్వహించిన ఎడ్‌సెట్-2014 పరీక్ష రాశాడు. సోషల్ సబ్జెక్టును ఆప్షన్‌గా తీసుకున్న అతను రాష్ట్రస్థాయిలో 102 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. తనకు చరిత్ర పుస్తకాలు చదవడం ఆసక్తి అని కుమారయ్య తెలిపారు. -
వెబ్సైట్లో.. ఎడ్‌సెట్ హాల్‌టికెట్లు
30న పరీక్ష... నిమిషం ఆలస్యమైనా పరీక్షకు నోఎంట్రీ హైదరాబాద్, న్యూస్‌లైన్: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా 42 నగరాల్లోని 349 కేంద్రాల్లో ఈ నెల 30న నిర్వహించే ఎడ్‌సెట్-2014 ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను వెబ్సైట్లో ఉంచినట్టు కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు బుధవారం తెలిపారు. విద్యార్థులు www.apedcet.org వెబ్సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిర్ణీత సమయానికే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరుగుతుందని, సమాధానాలను హెచ్‌బీ పెన్సిల్‌తో మాత్రమే గుర్తించాల్సి ఉంటుందని వివరించారు. హాల్‌టికెట్‌పై ఫొటో రాని పక్షంలో విద్యార్థులు తమ వెంట గెజిటెడ్ అధికారి సంతకం చేసిన రెండు ఫోటోలు తీసుకుని రావాలని సూచించారు. ఈదఫా ఎడ్‌సెట్‌కు 1,65,781 మంది దరఖాస్తు చేయగా, ఉర్దూ మాధ్యమం వారికి కర్నూలు, హైదరాబాద్‌లలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తున్నారు.