హత్య కేసులో నలుగురి అరెస్టు
బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని అశోక్‌నగర్‌బస్తీలో జరిగిన హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సీఐ బానోతు బాలాజీ తన చాంబర్లో వివరాలు వెల్లడించారు. తాండూర్ మండల కేంద్రానికి చెందిన ఎల్లేరు సతీష్, తన భార్య శుక్లతో కలిసి రెండు నెలల క్రితం బెల్లంపల్లికి వలస వచ్చాడు. అశోక్‌నగర్ బస్తీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. సతీష్ ఓ మోటార్‌సైకిల్ షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తుండేవాడు. తన భార్య శుక్లకు తాండూరుకు చెందిన కొడిపే నర్సింలుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా సతీష్ తెలుసుకున్నాడు.
నర్సింలును అంతమొందించాలని భార్య శుక్ల, మేనల్లుడు వాల్మీకి వినోద్(తాండూర్), బావమరిది వైరగాడి నూతన్‌కుమార్(భూరుగుగూడ, ఆసిఫాబాద్)లతో కలిసి పథకం రూపొందించాడు. గత నెల 24న శుక్లతో నర్సింలుకు ఫోన్ చేయించి బెల్లంపల్లికి రప్పించాడు. రాత్రి 10గంటల తర్వాత ఇంటికి రాగానే వైర్‌తో నర్సింలు మెడకు ఉరి వేసి, తలపై రాడ్‌తో కట్టి చంపారు. మృతదేహాన్ని బయటకు తరలించే క్రమంలో ఇంటి యజమానికి మెలకువ వచ్చి బయటకు రావడంతో నిందితులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. మహారాష్ట్రకు పారిపోయారు. వారి వద్ద ఉన్న డబ్బులు అయిపోవడంతో శుక్రవారం తాండూరుకు వచ్చినట్లు సమాచారం అందుకుని సతీష్, శుక్ల, వినోద్, నూతన్‌కుమార్‌లను అరెస్టు చేశామని సీఐ వివరించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వన్‌టౌన్ ఎస్సై వి.వేణుగోపాల్‌రావు, ఏఎస్సై సాగర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.