ELS Narsimhan
-
ప్రొటెం స్పీకర్‌గా శంబంగి ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రొటెం స్పీకర్‌గా విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. కాగా శంబంగి బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం నుంచి ఇప్పటికి 4సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావును ఓడించారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైతే శంబంగి శాసనసభ సమావేశాల తొలి రోజున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత శాసనసభ స్పీకర్ ఎన్నికను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికైన స్పీకర్‌కు పదవీ బాధ్యతలు అప్పగించిన తరువాత ఆయన పదవీకాలం ముగుస్తుంది. -
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ సమావేశం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. రాష్ట్రంలో రెవెన్యూ, మున్సిపల్ చట్టాల మార్పుపై ఈ సమావేశంలోచర్చించినట్లు తెలుస్తోంది. కాగా రెవెన్యూ, మున్సిపల్ చట్టాలు రూపొందించాలంటూ ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల్లో అవినీతి, లంచాల ఆరోపణలతో, ఈ శాఖలను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆయా శాఖల చట్టాల్లో మార్పులు తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ సాయంత్రం గవర్నర్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
నేటి నుంచి ‘ఆగ్నేయాసియా’ సదస్సు
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయాసియా దేశాల సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. సోమవారం నుంచి ఏడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ప్రారంభిస్తారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్డీ) ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఆగ్నేయాసియా దేశాలకు చెందిన సివిల్ సర్వెంట్లకు ఈ పేమెంట్లు, ఆర్థిక చేకూర్పు, సామాజిక భద్రత అంశాలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎఫ్ఓ సంజయ్ సక్సేనా, ఆయుష్మాన్ భారత్ సీఈఓ ఇందూభూషణ్, చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బి.చంద్రశేఖర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
మెడికల్ టూరిజంలో మన దేశం ప్రత్యేకమైన అభివృద్ధి సాధిస్తోంది. అయినప్పటికీ చిన్నారుల్లో తలసేమియా వ్యాధి బాధిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ తరహా వైద్యసేవలు అందుబాటులోకి రావాలి. పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు, డాక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సాక్షిప్రతినిధి, కరీంనగర్: వైద్యరంగంలో మన దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తోందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోందన్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 23న కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలకు ఒక వరమని అన్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఆరు లక్షల మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందారన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.800 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కరీంనగర్ మండలం నగునూరులోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ (పిమ్స్)లో శనివారం సికిల్‌సెల్, తలసేమియా చికిత్స కేంద్రాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రారంభించారు. వైద్య విద్యలో అత్యంత ప్రతిభ చూపిన ఐదుగురు మెడికోలకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రతిమ ఆడిటోయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మెడికోలు, వైద్యులను ఉద్దేశించి ప్రసంగించారు. మెడికల్ టూరిజంలో మన దేశం ప్రత్యేకమైన అభివృద్ధి సాధిస్తోందన్నారు. అయినప్పటికీ చిన్నారుల్లో తలసేమియా వ్యాధి బాధిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ తరహా వైద్య సేవలు అందుబాటులోకి రావాలన్నారు. పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు, డాక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రక్తదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలన్నారు. దేశంలో పోలియో, స్మాల్ఫాక్స్ వ్యాధులను విజయవంతంగా నిర్మూలించామని, అదే తరహాలో తలసేమియా వ్యాధి నిర్మూలనకు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య విద్యలో బాలబాలికల నిష్పత్తి పెరగడం సంతోషకర పరిణామమని అన్నారు. చారిత్రాత్మక నేపథ్యం గల కరీంనగర్‌కు రావడం ఇదే ప్రథమని, ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. ఒకప్పుడు ఒక్కరే.. ఇప్పుడు మూడు, నాలుగు కోట్ల మంది : మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు తలసేమియా దేశాన్ని కంగదీసే వ్యాధి అని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. 1938లో దేశంలో ఒక్కకేసే నమోదైతే... ఇప్పుడా సంఖ్య మూడు నుంచి నాలుగు కోట్లకు చేరిందన్నారు. కేరళలోని ఆదివాసీలలో తలసేమియా అధికంగా ఉందన్నారు. తలసేమియా విషయంలో భారతావని అప్రమత్తం కావాలన్నారు. తలసేమియా బాధితులకు రక్తమార్పిడి కోసం 2లక్షల యూనిట్లు అవసరమని తెలిపారు. బాధితులకు ఉచిత రక్తమార్పిడి చేసేందుకు ప్రయత్నించాలని కోరారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మేనరికం వల్ల మాత్రమే తలసేమియా వస్తుందనుకుంటే పొరపాటని, ఇప్పుడు అందరికీ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యువతీ యువకులు పెళ్లికి ముందు రక్తపరీక్షలు చేయించుకోవడం మంచిదన్నారు. అందరూ కృషి చేస్తేనే ఆరోగ్య తెలంగాణ: గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఒక మంచి ఆశయం, లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా మారాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆకాంక్షించారు. పట్టణ ప్రాంతాలకు తోడు గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో ఆరోగ్యంపై అవగాన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధించాలంటే గ్రామీణలం తా ఆరోగ్యంగా ఉండాలన్నారు. తలసేమియా, సికెల్‌సెల్ తదితర వ్యాధులపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలన్నారు. ఆర్యోగవంతమైన తెలంగాణ నిర్మాణం కోసం అందరి కృషి అవసరమన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ప్రతిమ ఆసుపత్రి చైర్మన్ బోయినపల్లి శ్రీనివాస్‌రావు, కళాశాల ప్రొఫెసర్లు, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు మందు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి హెలికాప్టర్లో వచ్చిన రాష్ట్రపతి, గవర్నర్లను హెలిప్యాడ్ వద్ద కలిసి స్వాగతం పలికారు. -
‘ఉమ్మడి’ పంపిణీ బాధ్యత గవర్నర్దే
-
‘ఉమ్మడి’ పంపిణీ బాధ్యత గవర్నర్దే
సచివాలయం సహా రాజధానిలోని ఇతర కార్యాలయాల కేటాయింపు జనాభా ప్రాతిపదికన ఆఫీస్‌ల విభజన సీమాంధ్రకు 58.32 శాతం.. తెలంగాణకు 41.68 శాతం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్రకు ఉమ్మడి రాజధానిగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయాల పంపిణీని గవర్నర్ నరసింహన్ చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. పదేళ్ల కాలానికి కార్యా లయాలను ఇరు రాష్ట్రాలకు విభజించాల్సి ఉన్నందున, అన్ని శాఖల కార్యాలయ భవనాల జాబితాలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇవీ.. రాష్ట్ర రాజధానిలోని సచివాలయంతో సహా అన్ని రాష్ట్రస్థాయి ప్రభుత్వ కార్యాలయాల భవనాలన్నింటినీ జనాభా ప్రాతిపదికన విభజిం చాల్సి ఉంది. సీమాంధ్రకు 58.32%, తెలం గాణకు 41.68% చొప్పున కేటాయిస్తారు. ఏ భవనాలను ఏ రాష్ట్రానికి కేటాయించాలి, ఏ భవనాల్లో ఎటు పక్కన ఎవరికి కేటాయించాలో రాష్ర్ట గవర్నర్ నిర్ణయిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో యాజమాన్య నిర్వహణతో పాటు కేటాయింపులు, పంపిణీపై తుది నిర్ణయం గవర్నర్దే. ఉమ్మడి రాజధానిలో ఇరు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటారు. శాంతిభద్రతలతో పాటు అంతర్గత భద్రత, ప్రతిష్టాత్మక సంస్థల రక్షణ బాధ్యత గవర్నర్దే. గవర్నర్‌కు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సలహాదారులను నియమిస్తుంది. సలహాదారులకు కేటాయించిన అంశాలపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇందుకు సంబంధించి మార్గదర్శక సూత్రాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చే స్తుంది. ఇరు రాష్ట్రాల విభజన తరువాత అవసరమైన అదనపు పోలీసు బలగాల పెంపునకు కేంద్రం సహాయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం నిర్వహణ, పరిపాలనను మూడేళ్లపాటు కేంద్ర హోంమంత్రిత్వశాఖ చేపడుతుంది. సీమాంధ్రలో కొత్తగా గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇరు రాష్ట్రాల్లో గ్రేహౌండ్స్ ఆపరేషనల్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి. గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌లలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందిని ఏ రాష్ట్ర డీజీపీ కింద పనిచేస్తారో ఇచ్చే ఆప్షన్ ఆధారంగా విభజిస్తారు. ఈ విషయాలన్నింటిలో రాష్ట్ర హోంశాఖ సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది.