ముంబై తరహా ప్రజారవాణాకు ముందడుగు
మెరుగైన రవాణా సదుపాయాల కల్పన దిశగా..
సాక్షి, సిటీబ్యూరో: రోజూ లక్షలాది మందికి రవా ణా సదుపాయాన్ని కల్పిస్తూ ప్రజా రవాణా వ్యవస్థలో ప్రపంచంలోనే ఆదర్శ నగరంగా అభివృద్ధి చెందిన ముంబై తరహా ప్రజా రవాణా వ్యవస్థకు మన నగరం నూతన సంవత్స రం శ్రీకారం చుట్టనుంది. ముంబై తో పోల్చితే ప్రజా రవాణా రంగంలో మనం వెనుకబడే ఉన్నాం.
బృహణ్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్టు (బెస్ట్) సంస్థ ముంబైలో రోజుకు 4,680కి పైగా బస్సులు నడుపుతోంది. వాటిలో 1,500 బస్సులు సీఎన్జీతో నడుస్తున్నాయి. ప్రజలు సొంత వాహనాల్లో కంటే ఎక్కువ శాతం ప్రజా రవాణానే వినియోగించుకుంటున్నారనేందుకు నిదర్శనంగా 50 లక్షల మంది అక్కడ బస్సుల్లోనే పయనిస్తున్నారు. 2,342 ముంబై సబర్బన్ రైల్వే సర్వీసుల్లో రోజుకు 80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
నగరంలో ప్రస్తుతం..
గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 3,850 బస్సులు ఉన్నాయి. 34 లక్షల మంది ప్రయాణికులు రోజూ ఈ బస్సులను విని యోగించుకుంటున్నారు. హైదరాబాద్లో మూడేళ్ల కిందట ప్రవేశపెట్టిన 100 సీఎన్జీ బస్సులకు పూర్తిస్థాయిలో ఇంధ నం సరఫరా కావడం లేదు. మెట్రోలగ్జరీ వంటి అత్యాధునిక ఏసీ బస్సులు అందుబాటులోకి వచ్చినా ప్రజలు వ్యక్తిగత వాహనాలకే ప్రాధాన్యతనిస్తున్నారు.
ప్రస్తు తం 121 ఎంఎంటీఎస్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉండగా రోజుకు 1.5 లక్షల మంది ప్రయాణికులు వీటిని వినియోగించుకుంటున్నారు. గతేడాది ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండోదశ పనులు పూర్తయితే మరో 100 రైళ్లు, లక్ష మందికిపైగా ప్రయాణికులకు రవాణా సదుపాయం లభించగలదని అంచనా. ఏమైనప్పటికీ విశ్వనగరంగా ఎదగనున్న హైదరాబాద్లో ప్రజా రవాణా వ్యవస్థ ఇప్పుడున్న దానికంటే రెండింతలు అభివృద్ధి చెందనుంది.