ఇది కోతల సర్కార్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ప్లేటు ఫిరాయించిందని ఉద్యోగుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) నివేదికను ఆమోదిస్తున్నామంటూ ఫిబ్రవరి 9న బహిరంగంగా ప్రకటించిన ముఖ్యమంత్రి.. తర్వాత మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ. 12 లక్షలుగా పీఆర్సీ సిఫారసు చేయగా, ప్రభుత్వం రూ. 10 లక్షలకే పరిమితం చేయడాన్ని తప్పుబడుతున్నారు. తాజాగా అలవెన్స్లకూ కోత వేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పీఆర్సీ సిఫారసు చేసిన మొత్తంలో సగమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈమేరకు వచ్చే వారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఉద్యోగులతో పాటు పెన్షనర్ల సంక్షేమానికీ కోతలు విధించనుంది. పెన్షనర్లకు ఇవ్వాల్సిన మెడికల్ అలవెన్స్‌నూ సిఫారసు చేసిన మొత్తం ఇవ్వకూడాదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అలవెన్స్‌లను నిర్థారించడానికి వీలుగా రూ. 49,870- రూ. 1,00,770 మూల వేతనం ఉన్న ఉద్యోగులను గ్రేడ్-1గా, రూ. 28,940- రూ. 78,910 మూల వేతనం ఉన్న ఉద్యోగులను గేడ్-2గా, మిగతా ఉద్యోగులను గ్రేడ్-3గా పీఆర్సీ విభజించింది.
పెంపు అంతంతమాత్రమే
► ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కుటుంబంతో కలిసి సొంత ఊరుకు లేదా మరో ప్రాంతానికి వెళ్లి రావడానికి ప్రస్తుతం గరిష్టంగా రూ. 12,500 ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) ఇస్తున్నారు. బస్సు, రైలు ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో ఎల్టీసీ రూ. 18,750కు పెంచాలనీ పీఆర్సీ సిఫారసు చేసింది. అందుకు భిన్నంగా రూ. 15,000కు పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
► ప్రస్తుతం ఎన్జీవోలకు ఒక్కొక్కరికీ రూ. 1000 చొప్పున గరిష్టంగా ఇద్దరు పిల్లలకు ఏటా ఫీజును ప్రభుత్వం రీయింబర్స్ చేస్తోంది. దీన్ని కనీసం రూ. 12,000కు పెంచాలని ఉద్యోగ సంఘాలు పీఆర్సీకి విజ్ఞప్తి చేశాయి. సగటు ఉద్యోగి పిల్లల చదువులు కొనలేక అల్లాడిపోతున్నాడని గుర్తించిన పీఆర్సీ... ఒక్కొక్కరికి రూ. 2,500 చొప్పున గరిష్టంగా ఇద్దరు పిల్లలకు ఫీజు రీయింబర్స్ చేయాలని సిఫారసు చేసింది. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
► ఉద్యోగి అంత్యక్రియల ఖర్చు కోసం ప్రస్తుతం రూ. 10,000 ఇస్తున్నారు. దీన్ని రూ. 20,000కు పెంచాలని పీఆర్సీ సిఫారసు చేసింది. దీన్ని రూ. 15,000కు పరిమితం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు మరణిస్తే.. భౌతికకాయాన్ని సొంత ఊరుకు తీసుకెళ్లడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని ఉద్యోగ సంఘాలు చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం లేదని సమాచారం.
► పోలీసు, ఫైర్, ఫారెస్ట్, ఎక్సైజ్.. తదితర శాఖల సిబ్బంది యూనిఫాం అలవెన్స్ ప్రస్తుతం ఏటా రూ. 2000 ఇస్తున్నారు. దీన్ని రూ. 3500కు పెంచాలని పీఆర్సీ సిఫారసు చేసింది. రూ. 2,500కు పెంపును పరిమితం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
► పెన్షనర్లకు మెడికల్ అలవెన్స్ కింద ప్రతి నెలా రూ. 200 ఇస్తున్నారు. దీన్ని రూ. 350కు పెంచాలని పీఆర్సీ సిఫారసు చేసింది. రూ. 1000కు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం రూ. 200 నుంచి రూ. 250కు పెంపును పరిమితం చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
జీవో 139ను సవరించాలి: యూటీఎఫ్
గ్రాట్యుటీని రూ. 10 లక్షలకు పరిమితం చేస్తూ శుక్రవారం జారీ చేసిన జీవో- 139ను సవరించాలని యూటీఎఫ్ అధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ పరిమితిని రూ. 12 లక్షల కు పెంచాలని, పెంపును పీఆర్సీ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి వర్తింపజేస్తూ జీవోకు సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. బకాయిలను విడుదల చేయాలని కోరారు.
పెంచాల్సిందే: ఎస్టీయూ
గ్రాట్యుటీ పరిమితిని రూ. 12 లక్షలకు పెంచకపోతే ఉద్యమించడానికి వెనకాడమని ఎస్టీయూ అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి జోసెఫ్ సుధీర్‌బాబు ప్రభుత్వానికి హెచ్చరించారు. పీఆర్సీ అమల్లోకి వచ్చిన 2013 జూలై 1 నుంచి గ్రాట్యుటీ పెంపునూ వర్తింపజేస్తూ జీవో-139ని సవరించాలని డిమాండ్ చేశారు.