పరిహారం.. ఫలహారం
కోదాడటౌన్, న్యూస్‌లైన్: పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామమైన వెల్లటూరులో పునరావాస ప్యాకేజీ విషయంలో కోదాడలోని ప్రత్యేక కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. మేళ్లచెరువు మండలం వెల్లటూరులో ముంపు బాధితుల పేరుతో భారీగా దండుకున్నారు. గ్రామానికి చెందిన 12మందికి రెండేసిసార్లు, ఒక కుటుంబానికి మూడుసార్లు చెక్కులు జారీ చేశారు.
అంతేకాకుండా ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ పరిహారాన్ని ఇచ్చి దానిలో కూడా సగానికి పైగా తమ వాటాగా పుచ్చుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఘనత వహించిన ఈ అధికారులు గ్రామంలో మరణించిన దాదాపు 20మంది పేరుతో *23 లక్షలకు చెక్కులు జారీ చేశారు. ఈ విధంగా ఈ ఒక్క గ్రామంలోనే అధికారులు 49 లక్షల రూపాయలను అధికంగా, అక్రమంగా చెల్లించి దానిలో సింహభాగం వారే పుచ్చుకున్నట్లు తెలుస్తుంది.
చనిపోయినవారికి అందజేశారట....
వెల్లటూరు గ్రామంలో దాదాపు 20మంది మృతి చెందారు. వీరికి కూడా అధికారులు చెక్కులు జారీ చేశారు. బినామీ పేర్లతో అకౌంట్లను తెరిచి దానిలో ఈ చెక్కులను వేసి ఏటీఎం కార్డుల ద్వారా ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసినట్లు తెలుస్తుంది. ఒక్క గ్రామంలోనే 20మంది మృతులకు జంకు, బొంకు లేకుండా చెక్కులను జారీ చేయడంలో కోదాడలోని పులిచింతల కార్యాలయ ఉద్యోగుల చేతివాటం ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ మొత్తం వ్యవహరంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులు వాటాలు పంచుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ ఈ మొత్తం వ్యవహరంలో జోక్యం చేసుకుని విచారణ జరిపించి అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
కనీస చర్యలు కరువు..
కోదాడ పులిచింతల అధికారులు చేస్న్ను అక్రమాలపై ‘సాక్షి’ గత డిసెంబర్ 17న ‘డబ్బుల్..డబుల్’ శీర్షికన భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. దాదాపు 30 లక్షల రూపాయలు అక్రమంగా చెల్లించిన విషయాన్ని సవివరంగా సాక్ష్యాధారాలతో సహా ప్రచురించింది. ఇదంతా మేళ్లచెరువు మండలంలోని చింత్రియాల గ్రామంలో జరిగిన కుంభకోణం మాత్రమే. దీనిపై సూర్యాపేట ఆర్డీఓ విచారణ చేస్తున్నట్లు అప్పుడు అధికారులకు చెప్పారు. ఇది చెప్పి నెల రోజులు దాటినా దీనిపై అధికారులు కనీస చర్యలు తీసుకోలేదు.