Employees Division Process
-
హైకోర్టు ఉద్యోగుల విభజన షురూ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనలో అత్యంత కీలకమైన ఉద్యోగుల విభజన ప్రక్రియ షురూ అయ్యింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను హైకోర్టు గురువారం విడుదల చేసింది. గతవారం ప్రధాన న్యాయమూర్తి(సీజే) అధ్యక్షతన జరిగిన హైకోర్టు న్యాయమూర్తుల ఫుల్‌కోర్ట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు మార్గదర్శకాల రూపకల్పన జరిగింది. మార్గదర్శకాలతోపాటు ఆప్షన్ ఫాంలను హైకోర్టు వర్గాలు ఉద్యోగులందరికీ పంపాయి. ఈ ఫాంలను ఈ నెల 15లోపు నింపి సీల్డ్ కవర్లో అందజేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల నుంచి అందుకున్న ఈ సీల్ట్ కవర్లను ఆయా సెక్షన్ల అధికారులు 15వ తేదీ సాయంత్రం 5లోపు సీజే కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ వెల్లడించారు. కేటాయింపులు ఇలా..: కేటాయింపుల్లో సీనియారిటీకి ప్రాధాన్యతనిస్తారు. తెలంగాణ హైకోర్టు లేదా ఏపీ హైకోర్టు రెండింటిలో దేనిని ఎంచుకోని ఉద్యోగులను.. వారి సర్వీసు రికార్డుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం కేటాయిస్తారు. ఈ విషయంలో సీజే తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తారు. ఆఫీస్ సబార్డినేట్స్, దఫేదార్స్, జమేదార్స్, రికార్డ్ అసిస్టెంట్స్, బైండర్స్, బుక్ బేరర్స్, లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లు, కాపీయర్ మెషీన్ ఆపరేటర్లు, అసిస్టెంట్ ఓవర్ సీర్ తదితరులను వారి ఆప్షన్ల మేర కేటాయించడం జరుగుతుంది. ఉద్యోగులు ఎంపిక చేసుకున్న హైకోర్టులో ఖాళీల కంటే ఉద్యోగులు ఎక్కువగా ఉంటే, ఆ ఖాళీల్లో భర్తీ చేయగా మిగిలిన ఉద్యోగులను ఇతర హైకోర్టులో లేదా కింది కోర్టుల్లో డిప్యుటేషన్‌పై నియమిస్తారు. భవిష్యత్‌లో హైకోర్టులో ఖాళీ అయ్యే పోస్టుల్లో వారిని నియమిస్తారు. భార్యాభర్తలిద్దరూ హైకోర్టు ఉద్యోగులైతే వారిద్దరినీ వారు ఎంచుకున్న హైకోర్టుకు కేటాయిస్తారు. హైకోర్టులో పనిచేస్తున్న ఉద్యోగి భార్య లేదా భర్త ప్రభుత్వ ఉద్యోగి అయి ఉంటే, అతను లేదా ఆమె ఏ రాష్ట్ర పరిధిలో పనిచేస్తుంటే ఆ ఉద్యోగిని ఆ హైకోర్టుకు కేటాయించడం జరుగుతుంది. వితంతువులైన మహిళా ఉద్యోగులను వారు ఎంపిక చేసుకున్న హైకోర్టుకు కేటాయిస్తారు. 60 శాతానికి మించి వైకల్యంతో బాధపడే ఉద్యోగులను వారి ఆప్షన్ మేర కేటాయిస్తారు. ఉద్యోగి లేదా భార్య లేదా పిల్లలు తీవ్ర అనారోగ్యంతో ఉంటే ఆ ఉద్యోగులను వారి ఆప్షన్ మేర కేటా యిస్తారు. ఈ మార్గదర్శకాలు జారీ అయ్యే నాటికి పదవీ విరమణకు రెండేళ్ల సర్వీసు ఉన్న ఉద్యోగులు వారు ఎంపిక చేసుకున్న హైకోర్టుకు కేటాయింపు చేస్తారు. ఒక హైకోర్టులో ఖాళీలు ఉండి, మరో హైకోర్టులో మిగులు ఉద్యోగులుంటే వారిని ఏదోక హైకోర్టుకు సీజే విచక్షణాధికారంతో కేటాయిస్తారు. ఈ మార్గదర్శకాలతో సంబంధం లేకుండా సీజే కేటాయింపులపై నిర్ణయం తీసుకోవచ్చు. -
సొంత రాష్ట్రానికే వెళ్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి రిలీవైన ఏపీ స్థానికత గల విద్యుత్ ఉద్యోగుల్లో అత్యధిక శాతం మంది సొంత రాష్ట్రం ఏపీకి వెళ్లేందుకే మొగ్గు చూపారు. ఈ వివాదంపై హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవైన ఉద్యోగుల నుంచి గత నెలలో ఆప్షన్లు స్వీకరించగా, 55.12 శాతం మంది ఏపీకి, తెలంగాణకు 44.87 శాతం మంది ఆప్షన్లు ఇచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం విద్యుత్ ఉద్యోగుల విభజన ప్రక్రియకు ఏపీ విద్యుత్ సంస్థలు సహకరించడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏకపక్షంగా తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల విభజన ప్రక్రియను చేపట్టి స్థానికత ఆధారంగా 2015 జూన్ 11న 1,252 మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీకి రిలీవ్ చేశాయి. తెలంగాణ రిలీవ్ చేసిన ఉద్యోగులను ఏపీ విద్యుత్ సంస్థల్లో చేర్చుకోకపోవడం, రిలీవైన ఉద్యోగులు హైకోర్టులో కేసు వేయడంతో దాదాపు రెండున్నరేళ్లుగా ఈ వివాదం అపరిష్కృతంగా ఉండిపోయింది. గత నెల 3న హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఈ ఉద్యోగుల నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆప్షన్లు స్వీకరించి ఆ సమాచారాన్ని ఏపీ విద్యుత్ సంస్థలతో పంచుకున్నాయి. రిలీవైన ఉద్యోగుల్లో 619 మంది ఏపీకి, 504 మంది తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చారు. మరో నలుగురు తమ విషయంలో నిర్ణయాన్ని విద్యుత్ సంస్థల యాజమాన్యాలకే వదిలేశారు. మరో 23 మంది రిటైర్డు కావడం, మరణించగా, మిగిలిన వారు ఆప్షన్లు ఇవ్వలేదని అధికారవర్గాలు తెలిపాయి. ఆప్షన్లు ఇచ్చిన వారిలో అధిక శాతం మంది సొంత రాష్ట్రం ఏపీలో పనిచేసేందుకే మొగ్గు చూపడం గమనార్హం. విద్యుత్ ఉద్యోగుల విభజన కేసుపై హైకోర్టులో జరిగే తదుపరి విచారణలో ఇరు రాష్ట్రాలు ఆప్షన్లు కేటాయించిన ఉద్యోగుల విషయంలో తమ అభిప్రాయాలను తెలపనున్నాయి. ఎస్పీడీసీఎల్‌కే ఏపీ ఉద్యోగుల మొగ్గు తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ నుంచి మొత్తం 1,252 మంది విద్యుత్ ఉద్యోగులు రిలీవై ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ చెందని వారిగా డోలాయమానంలో ఉన్నారు. కోర్టు ఆదేశాలతో తెలంగాణ విద్యుత్ సంస్థలు ప్రతినెలా వీరికి రూ.12 కోట్ల జీతభత్యాలు చెల్లిస్తున్నప్పటికీ వారిని విధుల్లో చేర్చుకోకుండా ఖాళీగా కూర్చోబెట్టింది. వీరినుంచి ఏ పని తీసుకోకుండానే గత రెండున్నరేళ్లలో ఏకంగా రూ.300 కోట్ల జీతాలు చెల్లించింది. అయినా, వారితో పని చేయించుకునేందుకు ఇష్టపడడం లేదు. రిలీవ్ చేసిన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబును కలవడం, హైకోర్టులో కేసులు వేసి తొందరపడ్డారని రిలీవైన ఉద్యోగుల తీరు పట్ల తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అసంతృప్తిగా ఉండడమే దీనికి కారణం. దీనితో సంబంధాలు దెబ్బతిన్నాయి, రిలీవైన ఉద్యోగులను మళ్లీ తెలంగాణలో చేర్చుకున్నా ఇక్కడి ఉద్యోగులతో సఖ్యతతో పనిచేసే అవకాశం లేదని తెలంగాణ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అధిక మంది ఉద్యోగులు ఏపీకి ఆప్షన్ ఇచ్చారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, టీఎస్ఎస్పీడీసీఎల్ నుంచి రిలీవైన ఉద్యోగుల్లో 65.5 శాతం తెలంగాణకు ఆప్షన్ ఇవ్వగా, టీఎస్ఎన్పీడీసీఎల్ నుంచి రిలీవైన ఉద్యోగుల్లో 83.9 శాతం మంది ఏపీకి ఆప్షన్లు ఇవ్వడం గమనార్హం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టీఎస్ఎస్పీడీసీఎల్లో పని చేసేందుకే అధిక శాతం రిలీవైన ఉద్యోగులు మొగ్గు చూపారు. -
'సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలి'
హైదరాబాద్: సచివాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనలో ఇప్పటి దాక జరిగిన పురోగతిపై చర్చించారు. ఉద్యోగుల శాశ్వత విభజనపై కమలనాధన్ కమిటీ రేపు భేటీ కానుంది. ఈ నేపథ్యంలో ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కమలనాధన్ ను కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. అవసరం మేరకు సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలని కోరారు.