సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనలో అత్యంత కీలకమైన ఉద్యోగుల విభజన ప్రక్రియ షురూ అయ్యింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను హైకోర్టు గురువారం విడుదల చేసింది. గతవారం ప్రధాన న్యాయమూర్తి(సీజే) అధ్యక్షతన జరిగిన హైకోర్టు న్యాయమూర్తుల ఫుల్‌కోర్ట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు మార్గదర్శకాల రూపకల్పన జరిగింది.
మార్గదర్శకాలతోపాటు ఆప్షన్ ఫాంలను హైకోర్టు వర్గాలు ఉద్యోగులందరికీ పంపాయి. ఈ ఫాంలను ఈ నెల 15లోపు నింపి సీల్డ్ కవర్‌లో అందజేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల నుంచి అందుకున్న ఈ సీల్ట్ కవర్‌లను ఆయా సెక్షన్ల అధికారులు 15వ తేదీ సాయంత్రం 5లోపు సీజే కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ వెల్లడించారు.
కేటాయింపులు ఇలా..: కేటాయింపుల్లో సీనియారిటీకి ప్రాధాన్యతనిస్తారు. తెలంగాణ హైకోర్టు లేదా ఏపీ హైకోర్టు రెండింటిలో దేనిని ఎంచుకోని ఉద్యోగులను.. వారి సర్వీసు రికార్డుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం కేటాయిస్తారు. ఈ విషయంలో సీజే తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తారు. ఆఫీస్ సబార్డినేట్స్, దఫేదార్స్, జమేదార్స్, రికార్డ్ అసిస్టెంట్స్, బైండర్స్, బుక్ బేరర్స్, లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లు, కాపీయర్ మెషీన్ ఆపరేటర్లు, అసిస్టెంట్ ఓవర్ సీర్ తదితరులను వారి ఆప్షన్ల మేర కేటాయించడం జరుగుతుంది.
ఉద్యోగులు ఎంపిక చేసుకున్న హైకోర్టులో ఖాళీల కంటే ఉద్యోగులు ఎక్కువగా ఉంటే, ఆ ఖాళీల్లో భర్తీ చేయగా మిగిలిన ఉద్యోగులను ఇతర హైకోర్టులో లేదా కింది కోర్టుల్లో డిప్యుటేషన్‌పై నియమిస్తారు. భవిష్యత్‌లో హైకోర్టులో ఖాళీ అయ్యే పోస్టుల్లో వారిని నియమిస్తారు. భార్యాభర్తలిద్దరూ హైకోర్టు ఉద్యోగులైతే వారిద్దరినీ వారు ఎంచుకున్న హైకోర్టుకు కేటాయిస్తారు. హైకోర్టులో పనిచేస్తున్న ఉద్యోగి భార్య లేదా భర్త ప్రభుత్వ ఉద్యోగి అయి ఉంటే, అతను లేదా ఆమె ఏ రాష్ట్ర పరిధిలో పనిచేస్తుంటే ఆ ఉద్యోగిని ఆ హైకోర్టుకు కేటాయించడం జరుగుతుంది. వితంతువులైన మహిళా ఉద్యోగులను వారు ఎంపిక చేసుకున్న హైకోర్టుకు కేటాయిస్తారు.
60 శాతానికి మించి వైకల్యంతో బాధపడే ఉద్యోగులను వారి ఆప్షన్ మేర కేటాయిస్తారు. ఉద్యోగి లేదా భార్య లేదా పిల్లలు తీవ్ర అనారోగ్యంతో ఉంటే ఆ ఉద్యోగులను వారి ఆప్షన్ మేర కేటా యిస్తారు. ఈ మార్గదర్శకాలు జారీ అయ్యే నాటికి పదవీ విరమణకు రెండేళ్ల సర్వీసు ఉన్న ఉద్యోగులు వారు ఎంపిక చేసుకున్న హైకోర్టుకు కేటాయింపు చేస్తారు. ఒక హైకోర్టులో ఖాళీలు ఉండి, మరో హైకోర్టులో మిగులు ఉద్యోగులుంటే వారిని ఏదోక హైకోర్టుకు సీజే విచక్షణాధికారంతో కేటాయిస్తారు. ఈ మార్గదర్శకాలతో సంబంధం లేకుండా సీజే కేటాయింపులపై నిర్ణయం తీసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment